Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''రాళ్ళల్లో ఇసుకల్లో రాశాము ఇద్దరి పేర్లు'' అంటూ ఓ సినిమా పాట ఉన్నది. కొండల మీద, సముద్ర తీరాల్లో ప్రేయసీ ప్రియుల పేర్లు రాసుకొని ఆనందించేవారు. ఇప్పుడు కొత్తగా తీరాల్లోని ఇసుకపై చిత్రాలు గీసి వాటి మధ్యలో కాబోయే వధూవరులు నిలబడి ఫొటోలు తీసుకుంటున్నారు. ప్రీవెడ్డింగ్ షూట్లలో పల్లకి బొమ్మ వేసి దాని మధ్య ఇద్దర్నీ కూర్చోబెట్టి ఫొటోలు తియ్యటం, లేదా నేల మీద పడుకోమని వాళ్ళకి రెక్కలు మొలిచినట్టుగా బొమ్మలు వేసి ఫొటోలు తియ్యటం చేస్తున్నారు. దాంట్లో ఎవరి క్రియేటివిటీని వారు చూపించుకుంటున్నారు. చాలా అందంగా వస్తున్నాయి ఫొటోలు. రోజురోజుకూ పెళ్ళి ఫొటోల తతంగం రకరకాల హంగులు సమకూర్చుకుంటోంది. కొత్త పుంతలు తొక్కుతోంది. మా చిన్నతనంలో అందమైన బొమ్మలు వేసుకొని శాండ్ పెయింటింగ్ చేసేవాళ్ళం. ఇళ్ళు కట్టుకునేటపుడు ఇసుక కుప్పలు పోయించుకుంటారు. పిల్లలకు ఇసుక కుప్పల్లో ఆడటం అంటే చాలా సరదా కదా! అలాంటి ఇసుకలో వచ్చే గవ్వలు, తెల్లటి రాళ్ళు ఏరుకుని దాచుకునేవాళ్ళం. తెల్లని సన్నని ఇసుకతో చక్కని పెయింటింగ్‌లు చేసేవాళ్ళం. కొన్నిటిని మీకు ఈరోజు పరిచయం చేస్తాను.
అమ్మాయి బొమ్మ
గాజుల దుకాణాల్లో ఒక అమ్మాయి బొమ్మ ఎక్కువగా కనిపిస్తుంది. తల మీద కొంగుతో ముక్కుకు పెద్ద ముంగిరతో సర్వాలంకార భూషితమైన అమ్మాయి బొమ్మ గాజుల పెట్టల మీద కనిపించేది. మేము ఆ అమ్మాయి బొమ్మను పెద్ద డ్రాయింగ్ షీటు మీద పెన్సిల్‌తో వేసుకునే వాళ్ళం. ఇప్పుడు నల్లని డ్రాయింగ్ షీటు తెచ్చుకోవాలి. పెన్సిల్‌తో వేసుకునే బొమ్మ మాత్రం మామూలు తెల్లని డ్రాయింగ్ షీటు మీదే. నల్లటి డ్రాయింగ్ ఫీటేమో బొమ్మ తయారు చేయడానికి వాడుకోవాలి. తెల్లని కార్బన్ పేపర్‌ను షాప్‌లో కొనుక్కోవాలి. నల్లని డ్రాయింగ్ షీటుపై తెల్లని కార్బన్ పేపర్ పెట్టుకొని దానిమీద పెన్సిల్‌తో వేసిన బొమ్మను పెట్టి కార్బన్‌తో కాపీ తీసుకోవాలి. చక్కగా నల్లని షీటుపై బొమ్మ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ బొమ్మ రేఖలపై ఫెవికాల్ రాసుకోవాలి. ఈ ఫెవికాల్పై తెల్లని ఇసుకను చల్లి కొద్దిగా అద్దాలి. అప్పుడు ఇసుక దానిపై చక్కగా అతుక్కుంటుంది. ఇలా ఇసుకతో రేఖా చిత్రం తయారవుతుంది. దీనిలో మరోరకం పెయింట్ వేసినట్టుగా చేసుకోవచ్చు. బజార్లో రంగుల్లో ఇసుక దొరుకుతుంది. దాంతో ఇంకా అందంగా చేయవచ్చు.
రాథ వెన్న చిలుకుతున్న దృశ్యం
దీనికోసం రంగుల ఇసుకను బజార్లో తెచ్చుకోవచ్చు. లేదా ఇంట్లో మనమే రంగులు వేసుకోవచ్చు. బతుకమ్మ పూల కోసం వాడే రంగుల్ని ఇసుకకు వేయవచ్చు. మొదటగా బొమ్మను డ్రాయింగ్ షీటుమీద వేసుకోవాలి. పెరుగు కుండ, దానిలో చిలకటానికి కర్ర, గొల్లభామ, తీసిన వెన్నను ఉట్టి మీద పెట్టినట్టు కుండలు అన్నీ చక్కగా చిత్రించుకోవాలి. ఇప్పుడు రంగుల ఇసుకను తీసుకుని మెల్లగా అతికించాలి. మొదటగా ఫెవికాల్ పూసుకొని దాని మీద నిదానంగా చల్లాలి. అతుక్కున్నాక మిగిలిన రంగు ఇసుకను విదిలించాలి. ఇలా రంగులన్నీ వేసుకున్నాక చిత్రం అందంగా తయారవుతుంది. రాథతో పాటు కృష్ణుడ్నీ చిత్రించుకోవచ్చు. రాథాకృష్ణుల చిత్రం అద్భుతంగా ఉంటుంది.
పువ్వులు
ఇసుకతో వేసే పెయింటింగుల్ని ఇంకో రకంగా కూడా వేయవచ్చు. మొదటగా చిత్రాన్ని మొత్తం తెల్లని ఇసుకతో నింపేసి ఆ తర్వాత మనకు కావల్సిన రంగులు వేసుకోవచ్చు. ఇది కొంత సులభంగా ఉంటుంది. మొదటగా డ్రాయింగ్ షీటు మీద పెన్సిల్‌తో బొమ్మను వేసుకోవాలి. ఇసుకతో చేసే ఏ పెయింటింగైనా నల్లని డ్రాయింగ్ షీటు మీదే చేయాలి. లేదా నల్లని ముఖమల్ క్లాత్ మీద కూడా వేయవచ్చు. నేను గతంలో చేసినవన్నీ ముఖమల్ క్లాత్‌తోనే చేశాను. ఇప్పుడు స్పాంజి లాంటి మెత్తటి షీట్స్ కూడా దొరుకుతున్నాయి. కాబట్టి వాటిని కూడా వాడవచ్చు. ఏదైనా నలుపు రంగు షీటు మీద వైట్ కార్బన్ పేపర్‌తో బొమ్మను ట్రేస్ చేసుకోవాలి. లేదంటే వైట్ పెన్సిల్‌తో బొమ్మను డైరెక్ట్‌గా వేసుకోగలిగితే వేసుకోవచ్చు. బొమ్మ మీద ఫెవికాల్ రాస్తూ ఇసుకను అతికించుకోవాలి. బొమ్మను పూర్తిగా తెల్లని ఇసుకతో అతికించాలి. ఇప్పుడు రంగుల్ని తీసుకొని ఇసుక మీద పెయింట్ చేయాలి. నేను పువ్వుల కొమ్మల్ని తయారు చేశాను. రంగుల షేడ్స్‌తో అందమైన పువ్వులను చిత్రించాను. చూడండి మీరూ ప్రయత్నించండి.
పూలకుండి
కుండ ఆకారంలో ఉండే పూల కుండీని తయారు చేద్దాం. ఇలాంటి పూల కుండీలను ముగ్గులలో, పెయింటింగులలో ఎక్కువగా వాడతారు. లేత గోధుమరంగు, కాఫీ రంగులను ఉపయోగించి డెకరేషన్ చేస్తే అందమైన కుండ లాంటి కుండీ తయారవుతుంది. శకుంతల మొక్కలకు కుండతో నీళ్ళు పోస్తున్నట్టుగా ఉండే చిత్రంలో అందమైన కుండ కనిపిస్తుంది. అలాంటి చిత్రానికి మేము కూజా ఆకారంలోనే పెయింట్ చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా ఒక కార్డు బోర్డును కూజా ఆకారంలో కత్తిరించాలి. అంటే బొమ్మ అంతా కూడా ఇసుకతోనే తయారవుతుంది. కత్తిరించిన కార్డుబోర్డు మీద కుండ డిజైన్లు పెన్సిల్‌తో వేసుకోవాలి. ఇప్పుడు ఆ గీతల వెంట ఫెవికాల్ సన్నగా రాస్తూ ఇసుకను పోస్తూ రావాలి. ఫెవికాల్ ఆరేసరికి ఇసుక గట్టి పడుతుంది. ఇలా ముందుగా గీతలు వచ్చేస్తాయి. ఈ గీతల మధ్యలో రంగులు వేసుకోవాలి. అంటే రంగులు వేసుకున్న ఇసుకను వాడాలి. డిజైనులో ఏరంగు వేసుకుందామనుకుంటామో ఆ రంగును మాత్రమే ఫెవికాల్ రాసి అతికించాలి. ఇంత కష్టపడకుండా ఉండాలంటే బజార్లో స్టిక్కర్ బొమ్మ రంగుల ఇసుక దొరుకుతుంది. స్టిక్కర్ తీసి రంగుల ఇసుక చల్లుకోవటమే మనం చేయవల్సిన పని.
ఫ్లవర్‌వేజ్
బెలూన్, ఇసుకతో అందమైన ఫ్లవర్‌వేజ్ చేద్దాం. బాగా బెలూన్ ఊది దానికి దారం కట్టి పెట్టాలి. ఫెవికాల్‌కు కొద్దిగా నీళ్ళు కలిపి ఉబ్బిన బెలూన్ చుట్టూతా పూయాలి. కొన్ని కాగితం ముక్కల్ని చిన్నచిన్న ముక్కలుగా కత్తిరించి వాటిని బెలూన్‌కు అతికించాలి. మొత్తం అతికించాక దానిపై మరల ఫెవికాల్ పూయాలి. ఇది ఆరిపోయాక బెలూన్ను పగల గొట్టాలి. చివర్లు సరిగా కత్తిరించి లోపల ఒక పొడవాటి సీసాను పెట్టాలి. మరల సీసాను కవర్ చేస్తూ కాగితం ముక్కలు అతికించి ఫెవికాల్ పూయాలి. ఈ ఫెవికాల్ మీద ఇసుకను చల్లాలి. ఇసుక అతుక్కున్నాక దాని మీద సిల్వర్ లేదా గోల్డ్ కలర్ స్ప్రేను చల్లుకోవాలి. పేపర్ పువ్వులు తయారు చేసుకుని ఫ్లవర్‌వేజ్ మీద అతికిస్తే చాలా అందంగా కనిపిస్తుంది. ఇలా ఇసుకతో ఎన్నో రకాల బొమ్మలు తయారు చేసుకోవచ్చు.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్