Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిన్న విషయమైనా, పెద్ద సమస్య అయినా.. అవసరమున్నా, లేకపోయినా.. కొందరు దాని గురించే పదే పదే లోతుగా ఆలోచిస్తుంటారు. నిజానికి దీనివల్ల సమయం వృథా అవడంతో పాటు మానసికంగానూ ఒత్తిడి ఎదురవుతుంటుంది. కానీ మానసికంగా దృఢంగా ఉన్న వాళ్లు అస్సలు ఇలా చేయరు. ఏదైనా సమస్య వస్తే దాన్ని త్వరగా పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు తప్ప.. దాని గురించే లోతుగా ఆలోచించి మనసు పాడు చేసుకోరు. అలా కాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
నచ్చకపోతే చిన్న విషయానికే కోపగించుకోవడం, చిరాకు పడడం వంటివి చేస్తుంటారు మనలో చాలామంది. కానీ మానసికంగా దృఢంగా ఉండే వారు ప్రశాంతంగా దాని గురించి ఆలోచించే ప్రయత్నం చేస్తుంటారట. తమ అధీనంలో లేని దాని గురించి పాకులాడకుండా తమ సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు.
శరీరాకృతి దగ్గర్నుంచి, వేసుకునే దుస్తుల దాకా ఎదుటివారికి అందంగా కనిపించాలన్న ఆలోచనే మన మనసును తొలిచేస్తుంటుంది. నిజానికి ఇదే మానసిక ఒత్తిళ్లకు కారణమవుతుంటుంది. కానీ తాము మాత్రం చుట్టూ ఉన్న వాళ్ల కోసం కాకుండా తమకు నచ్చినట్టుగా ఉండడంలోనే సంతోషాన్ని, సంతృప్తిని వెతుక్కుంటామంటున్నారు మానసికంగా బలంగా ఉండే అమ్మాయిలు.
గతం గతః.. అనుకొని ఈ క్షణాన్ని ఆస్వాదిస్తూ.. భవిష్యత్తు గురించి ఉన్నతంగా ఆలోచించే వారే జీవితంలో పైచేయి సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉండే వారి ఫిలాసఫీ కూడా ఇదే. అందుకే గత జ్ఞాపకాల్ని తవ్వుకొని బాధపడకుండా.. భవిష్యత్తు గురించి జీవించడం నేర్చుకుందాం.
ఈర్ష్యాద్వేషాలు, అసూయ, ఎదుటివారి గెలుపును జీర్ణించుకోలేకపోవడం.. ఇవన్నీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంటాయి. అందుకే కొంతమంది వీటి జోలికి పోరు. దాంతో సంతోషంగా ఉండగలుగుతారు. పైగా విజేతల్ని ప్రశంసించడం, కష్టపడే వారిని ప్రోత్సహించడం.. వీరికి అలవాటు కూడా!
'కోరుకున్నవన్నీ జరగాలని లేదు. అంతమాత్రానికి బాధపడడం అనవసరం..' అనుకుంటారు మానసికంగా దృఢంగా ఉండే వ్యక్తులు. అందుకే నిత్యం సంతోషంగా ఉంటారు. కాబట్టి గొంతెమ్మ కోరికలు కోరుకోకుండా.. మన సమర్థత, వనరుల్ని దృష్టిలో ఉంచుకొనే ఏ విషయంలోనైనా అడుగు ముందుకేయడం మంచిది.
స్నేహితుల్ని ఎంచుకోవడంలోనూ జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారట మానసికంగా దృఢంగా ఉండే అమ్మాయిలు. చాడీలు చెప్పడం, అసూయ పడడం, ఎదుటివారి ఓటమిలో సంతోషాన్ని వెతుక్కోవడం ఇలాంటి లక్షణాలున్న వ్యక్తుల్ని దూరం పెడుతుంటారని, ఒకవేళ చెలిమి చేసినా వారి గురించి తెలిశాక మాత్రం వారితో స్నేహ బంధాన్ని తెంచుకోవడానికీ సిద్ధంగా ఉంటారట!
కొంతమంది మొహమాటానికి పోయి చాలా పనుల్ని నచ్చకపోయినా స్వీకరిస్తుంటారు. కానీ మానసికంగా బలంగా ఉండే వారు ఈ విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తుంటారని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. వాళ్ల ఆత్మగౌరవానికి, సామర్థ్యానికే ప్రాధాన్యమిస్తుంటారు. ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది కూడా! రిస్క్ తీసుకోవడానికి భయపడకుండా, ఓటమినీ గెలుపుతో సమానంగా స్వీకరించడం మానసికంగా దృఢంగా ఉండే వ్యక్తులకే చెల్లుతుంది.