Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తల్లిదండ్రులందరూ తమ పిల్లల ప్రతి అవసరాన్ని తీర్చాలనుకుంటారు. వారిని మంచి మనుషులుగా, సర్వతోముఖ సామర్థ్యాలు కలిగిన వ్యక్తులుగా పెంచాలని కోరుకుంటారు. అయితే అన్నీ అందుబాటులో ఉన్న పిల్లలు చాలా మంది ఈ ఆధునిక కాలంలో తప్పుడు మార్గంలో పయనిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తన ఇద్దరు కుమార్తెలను పెంచడంలో తన అనుభవాలను ఐఏఎస్ అధికారి దివ్య మిట్టల్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. తల్లిదండ్రులకు కొన్ని సూచనలు ఇస్తున్నారు. ఇప్పటికే 16 వేల లైక్‌లను సంపాదించి అవి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వీటిని ఆమె తన తల్లి నుండి నేర్చుకున్నారు. అవేంటో మనమూ తెలుసుకుందాం...
ఏదైనా చేయగలరని చెప్పండి
పిల్లలతో మీరు ఏదైనా సాధించగలరు అని నిరంతరం భరోసా ఇవ్వాలి. దీని ద్వారా వారిపై వారికి నమ్మకం, సంకల్ప శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని బలోపేతం చేయాలని సూచించారు దివ్య అంటున్నారు. ''ఆ నమ్మకమే వారి భవిష్యత్‌ను ర్వచిస్తుంది'' అని ఆమె పేర్కొన్నారు.
వారిని పడిపోనివ్వండి
చాలామంది తల్లిదండ్రులు పిల్లలు ఎక్కడ పడిపోతారో అనే భయంతో పరిగెత్తవద్దు, ఎగరవద్దు అంటూ వారిస్తూ ఉంటారు. కానీ అలా చేయడం మంచి పద్ధతి కాదని ఆమె అంటున్నారు. పిల్లలు తప్పులు చేయనీయమని, పడిపోయి గాయపడనివ్వమని ఆమె తల్లిదండ్రులకు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే ప్రతి ప్రమాదం నుండి మీరు వారిని రక్షించలేరు. కాబట్టి పిల్లలు తమ జాగ్రత్తలో తాము ఎలా ఉండాలో చేసిన తప్పుల ద్వారానే అర్థం చేసుకుంటారు.
పోటీ
పాల్గొన్న ప్రతి పోటీలో ఓడిపోయినప్పటికీ మీ బిడ్డను ఆ పోటీలో కచ్చితంగా పాల్గొనమని కోరండి. ఆరోగ్యకరమైన పోటీతత్వ స్ఫూర్తి పిల్లలకు చాలా ముఖ్యం. ఇది పిల్లలను వైఫల్యాలకు గురి చేస్తుంది. ఎందుకంటే జీవితంలో గెలుపు, ఓటమి సర్వసాధారణం. ఓడిపోయినా ధైర్యంగా ఉండటం నేర్చుకుంటారు. మళ్ళీ గెలిచేందుకు తమను తాము సిద్ధం చేసుకుంటారు.
రిస్క్ తీసుకోనివ్వండి
మీ బిడ్డ చెట్టు ఎక్కడం లేదా సాహస క్రీడలలో పాల్గొన దలిస్తే పాల్గొననివ్వండి. అలాంటివి జీవితంలో రిస్క్ తీసుకోవడానికి వారికి అనుమతిస్తుందని దివ్య సిఫార్సు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ప్రమాదకర పరిస్థితుల్లో తగిన విధంగా ఎలా వ్యవహరించాలో నేర్చుకుంటారని ఆమె అభిప్రాయపడ్డారు.
సమృద్ధి మనస్తత్వం
పూర్వీకులతో పోల్చినపుడు ప్రతి తదుపరి తరానికి ఎక్కువ అవకాశాలు, మెరుగైన వనరులు అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరు అనుభవించిన సమస్యలను వారిపై బలవంతంగా రుద్దకండి అని ఆమె సలహా ఇస్తున్నారు.
రోల్ మోడల్‌గా ఉండండి
మీ నుండి పిల్లలు ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటారు. అలాగే మీరు కూడా నిరంతరం వారికి ఏదో ఒకటి చెబుతూ ఉంటారు. అయితే తల్లిదండ్రులు తమ పిల్లలకు బోధిస్తున్న దానికి విరుద్ధంగా ప్రవర్తించకూడదు లేదా మాట్లాడకూడదు. ''తల్లిదండ్రుల కపటత్వాన్ని చూడటం కంటే పిల్లల హృదయాన్ని ఏదీ విచ్ఛిన్నం చేయదు'' అని ఆమె అంటున్నారు.
చెడు ప్రవర్తనకు దూరంగా ఉండండి
దివ్య చెప్పిన ప్రకారం మీరు మీ బిడ్డను ప్రయత్నించి విఫలమైనా కూడా మీరు వారిపై కఠినంగా ఉండకూడదు. అలాగే వారి దుష్ప్రవర్తనను సహించకూడదు. అయితే వారు తప్పు చేసినప్పుడు మీరు వాటిని సరిదిద్దాలి.
మీ పిల్లలను విశ్వసించండి
ప్రతి ఒక్కరికీ ఆశ అనేది చాలా ముఖ్యం. అది పిల్లలకు కూడా చాలా ముఖ్యమైనది. తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. తాము అనుకున్నట్టు వారు లేకపోతే నిరాశ చెందుతారు. అయితే పిల్లల విషయంలో నిరాశ చెందవద్దని ఆమె గుర్తు చేస్తున్నారు. మీ పిల్లలపై మీరు ఎప్పుడూ నమ్మకం ఉంచాలని అంటున్నారు.
అనుభవాలు పంచుకోండి
పిల్లలు ఓపెన్ మైండ్‌గా ఉండేలా చూడాలి. ఇలా వారు ఉండటానికి వివిధ పరిస్థితులకు సమతుల్యంగా బహిర్గతం చేయమని ఆమె సూచిస్తున్నారు. ప్రపంచం గురించి వారు తెలుసుకోవల్సింది చాలా ఉంటుంది. కాబట్టి మీ అనుభవాలు వారితో పంచుకోండి.
వినండి
జీవితం ప్రారంభంలోనే వినడం అలవాటు చేసుకోవడం చాలా అవసరం. దివ్య చెప్పిన దాని ప్రకారం తల్లిదండ్రులు తమ పిల్లలు చెప్పిన దాన్ని ప్రశాంతంగా వినగలిగినపుడు మాత్రమే ఇది జరుగుతుంది. వారు చెప్పింది మీరు విన్నప్పుడే మీరు చెప్పింది వారు వింటారు.
పోల్చవద్దు
తల్లిదండ్రులు చేసే అత్యంత సాధారణ తప్పులలో పోలిక ఒకటి. మీ బిడ్డను ఎవరితోనూ ముఖ్యంగా వారి తోబుట్టువులతో పోల్చవద్దని దివ్య సలహా ఇస్తున్నారు. పిల్లలు పెద్దయ్యాక ఇది సమస్యగా మారవచ్చు.
సురక్షిత స్థలంగా ఉండండి
ప్రతి ఒక్కరికీ సురక్షితమైన స్థలం అవసరం. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆ స్థలంగా ఉండాలి. దివ్య ప్రకారం ''మీతో ఉంటే వారికి కొండంత అండ అనే అభిప్రాయం రావాలి. అప్పుడు మీరే వారికి పూర్తి భరోసా అని నమ్మి మీ నుండి కావల్సినంత ప్రేమను పొందుతారు''.