Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవితంలోకి పిల్లలు వచ్చాక తల్లిదండ్రులుగా బాధ్యతలు పెరుగుతాయి. కేవలం పిల్లల అవసరాలు తీర్చడం మాత్రమే కాకుండా వారిని మంచి నడవడిక కలిగిన వారిగా తీర్చిదిద్దడం తల్లిదండ్రులకు ఒక సవాల్. కొంచెం ఎదిగిన పిల్లలకు అయితే ఏదైనా చెప్పడం, వారికి తగిన విధంగా మార్గాలు వెతకడం కొంచెం ఓపిక తెచ్చుకుంటే సాధ్యమవుతుంది. కానీ ఐదేండ్ల లోపు పిల్లలకు ఏ విషయమైనా అర్థం చేసుకునే సామర్థ్యం ఉండదు. వారిని ఓ మంచి నడవడికలోకి తీసుకెళ్లాలన్నా, ఆరోగ్యపరంగా జాగ్రత్తగా చూసుకోవాలన్నా ప్లే స్కూల్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే పిల్లలు ప్లే స్కూల్‌కి వెళ్ళిపోతే ఇక వారు దారిలోకి వచ్చేసినట్టే అనుకోవడం చాలా పొరపాటు.
పిల్లలను ప్లే స్కూల్‌కి పంపడానికి ముందు వారిని ఇంట్లోనే సన్నద్ధం చెయ్యాలి. వారితో ఆటలు ఆడించడం, చిన్న చిన్న మెథడ్స్ పూర్తి చేయడం, కార్డ్ బోర్డ్‌లతో పజిల్స్ చేయించడం, బొమ్మలు చూపించి వాటిని గుర్తుపట్టించడం వంటివి చెయ్యాలి.
ప్రతి ఒక్కరికీ వయసుకు తగ్గట్టు నిద్ర చాలా అవసరం. అయితే ఈ కాలం పిల్లలు అంత త్వరగా పడుకోరు. తల్లిదండ్రులు పనులలో పడి అర్ద రాత్రులు వరకు మేలుకుని ఉండటంతో పిల్లలు కూడా వారినే అనుకరిస్తారు. అందుకే పిల్లలకు సరైన నిద్రలేకపోవడం చాలా సమస్యలు తెచ్చి పెడుతుందని పిల్లల ఆరోగ్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పెద్దలు చేస్తున్న పనులలో పిల్లలు అడ్డు వస్తున్నారనో, అల్లరి చేస్తున్నారనో, వారిని కనిపెట్టుకుని ఉండటం కష్టమవుతోందనో ఇలా బోలెడు కారణాలు ఉన్నాయి. దీంతో తల్లిదండ్రులు చేస్తున్న పని మొబైల్స్ పిల్లల చేతికి ఇవ్వడం. మొబైల్స్‌లో ఏ కార్టూన్ ఛానెల్ నో ఓపెన్ చేసి వారి చేతిలో పెట్టేసి పెద్దవాళ్ళు వారి మానాన వారు పనులు చేసుకుంటూ ఉంటారు. అయితే పెద్దలు గమనించాల్సిన విషయం ఒకటుంది. పిల్లలు తమ జీవితంలోకి వస్తున్నారని తెలిసినప్పటి నుండే వారికంటూ సమయాన్ని ఇవ్వగలిగేలా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే పిల్లల విషయంలో పెద్దలు న్యాయం చేసినట్టు అవుతుంది.
పిల్లల విషయంలో పెద్దవాళ్ళు తీసుకోవలసిన జాగ్రత్తల్లో వారి ఆహారం, నిద్ర చాలా ముఖ్యమైనవి. పిల్లలకు తిండి, నిద్ర మాత్రమే ముఖ్య అవసరాలు. అలాగని పిల్లలు తిండి తినట్లేదని కుర్కురే, బిస్కెట్స్ వంటి స్నాక్స్‌ను ఇవ్వకూడదు. వండే సమయం ఉండట్లేదనే కారణంతో ప్యాకింగ్ చేయబడిన ఆహారాన్ని ఎంపిక చేసుకుంటే చాలా పెద్ద తప్పు చేసినట్టే. ఇన్స్టంట్ ఫుడ్స్ పిల్లలకు అసలు ఇవ్వకూడదు. పిల్లలకు పొరపాటున ఆ తిండి అలవాటు అయిపోతే ఇక వారిని సాధారణ ఆహారం వైపుకు తీసుకురావడం చాలా కష్టమవుతుంది. అందుకే పిల్లలకు ఎప్పుడూ ఆరోగ్యకరమైన, పోషకాలు ఉండే తాజా ఆహారాన్ని మాత్రమే ఇవ్వాలి.
ఇక నిద్ర విషయానికి వస్తే ఇప్పటికాలం భార్యాభర్తలకు ఎన్ని పనులున్నా ఎవరో ఒకరు రాత్రి తొమ్మిది గంటలలోపు పిల్లలతో కలసి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. పెద్దవాళ్ళు పక్కన ఉంటే పిల్లలు తొందరగా నిద్రపోతారు. అలాగే పిల్లలకు చిన్న చిన్న నీతి కథలు చెబుతూ నిద్రపుచ్చవచ్చు. అదే వారిలో నైతిక వ్యక్తిత్వానికి బీజమవుతుంది.
అందరూ తెలుసుకోవలసిన మరొక ముఖ్య విషయం ఏమిటంటే పిల్లలు ప్రతిరోజు కనీసం 10 గంటల పాటు నిద్రపోతే వారు ప్లే స్కూల్‌కు వెళ్ళాక చాలా చురుగ్గా అన్ని నేర్చుకుంటారు. శాస్త్రజ్ఞుల పరిశోధనల్లో ఈ విషయం నిరూపితమైంది కూడా. ఇలా పిల్లలకు వారి వయసుకు తగినట్టుగా మంచి ఆహారం, మంచి నిద్ర ఇవ్వగలిగితే, వారికి కొంత సమయం కేటాయించి వారిలో నైతిక విలువలు పెంపొందించగలిగితే వారి భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా ఉండదు అనే మాట అక్షరాల నిజం.