Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. ఇది అక్షరాల నిజం అని రుజువు చేసున్నారు మేఘన. పాత చీరలకు కొత్త హంగులు అద్దుతున్నారు. ఫ్యాషన్ ప్రపంచంలో తనదైన ముద్రవేసుకున్నారు. వస్త్ర వ్యర్థాలను తగ్గించడం తన లక్ష్యంగా పెట్టుకుని వ్యాపారాన్ని ప్రారంభించారు. పాత చీరలను కొత్తగా రూపొందించాలనే ఆలోచన అసలు ఆమెలో ఎలా వచ్చిందో, తన వ్యాపారం ఎలా కొసాగుతుందో మనమూ తెలుసుకుందాం.
కోల్‌కతాకు చెందిన మేఘనా నాయక్ అనే ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ పదేండ్ల కిందట తన వార్డ్‌రోబ్‌ని చూసిన తన తల్లి మాటల నుండి ఇది గ్రహించింది. మేఘనా అమ్మమ్మ నుండి ఆమె తల్లికి వచ్చిన ప్రత్యేక వారసత్వ చీర ఆమె దృష్టిని ఆకర్షించింది.
కట్టుకోని చీరలు ఏం చేయాలి?
''ఆ చీర దశాబ్దాల నాటిది. కానీ దానిపై చేసిన వర్క్, వస్త్రం చూసినపుడు ఆశ్చర్యంగా అనిపించింది. అప్పటి ఆ కళ ఇప్పుడు అందుబాటులో లేదు. నేను వార్డ్రోబ్ చూసునప్పుడు మా అమ్మ అప్పటి వరకు కట్టుకోని వందలాది చీరలు ఉన్నాయి'' అని చెప్పింది మేఘన. కట్టుకోని ఆ చీరలను ఏం చేయాలనే ఆలోచనలో పడింది మేఘన. 'లతాసీత' ఆవిర్భావ ఆలోచన అప్పుడే మేఘన మెదడులో పుట్టింది. అలా లతాసీత అనే డిజైన్ స్టూడియో 2012లో ప్రారంభమైంది.
పాత చీరలను కొత్తగా
ఇది పాత చీరలను జీరో-వేస్ట్, నైతికంగా ఉత్పత్తి చేయబడిన క్లాసిక్ దుస్తులను మహిళల కోసం రూపొందించడానికి అలాగే వస్త్ర వ్యర్ధాల నుండి దేశాన్ని కాపాడే ప్రయత్నంలో అప్‌సైకిల్ చేస్తుంది. రూ. 5 లక్షల పెట్టుబడితో ప్రారంభించిన లతాసీత ప్రస్తుతం జాకెట్లు, కిమోనోలు, ష్రగ్‌లు, కుర్తాలు, డ్రెస్‌లు వంటి రకరకాల దుస్తులను తయారు చేస్తోంది. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని పాత బట్టలకు కొత్త జీవితాన్ని అందిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటుంది.
వ్యాపారాన్ని నిర్మించడం
పదేండ్ల కిందట మేఘనా ఈ వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు 'అప్‌సైక్లింగ్' అనేది ఒక ఫ్యాన్సీ పదం. దీనికి అంతగా ఆదరణ లేదు. 2012 నుండి 2015 వరకు తన వ్యాపారానికి బలమైన పునాదిని నిర్మించుకోవడానికి ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసింది. తనను తాను నిలబెట్టుకోవడానికి ఫ్రీలాన్స్ ఎన్విరాన్మెంట్ జర్నలిస్ట్‌గా కూడా పనిచేస్తోంది. ''నా ఆలోచనను అందరూ మెచ్చుకున్నారు. అయితే వేరొకరు ఉపయోగించిన దుస్తులను ధరించడానికి చాలా మంది ఇష్టపడరు. ముఖ్యంగా మూఢనమ్మకాలు దీనికి ఆటంకంగా నిలిచాయి. ఇవి కస్టమర్లను వెనుకాడేలా చేస్తున్నాయి. వారు తమ పాత చీరల నుండి ఏదైనా పునర్నిర్మించడాన్ని ఇష్టపడినప్పటికీ, అప్‌సైకిల్ ఫ్యాబ్రిక్ ధరించడం వల్ల పర్యావరణ ప్రయోజనాలపై అవగాహన కల్పించడానికి నాకు చాలా సమయం పట్టింది'' అని మేఘన గుర్తుచేసుకున్నారు.
పాత బట్టలను పునర్నిర్మించడం
స్త్రీల వార్డ్‌రోబ్‌లలో ఉపయోగించబడని పాత చీరలు లతాసీత దుస్తులకు ప్రధాన వనరులు. 2021లో మేఘన కోల్‌కతా అంతటా దుర్గాపూజ పండల్లలో ఉపయోగించిన చీరల కోసం స్కౌట్ చేసింది. తద్వారా టన్నుల కొద్దీ బట్టలను తిరిగి తయారు చేసింది. లేకపోతే అవన్నీ నగర శివార్లలో వ్యర్థంగా మారేవి. లతాసీత రెండింటికి ప్రాముఖ్యత ఇస్తుంది. ఒకటి అందం, రెండవది అనుకూలం. తమ పాత చీరలకు కొత్త అందాలను ఇచ్చేందుకు మహిళలల్లో అవగాహన కార్యక్రమాలు కూడా ఆమె చేస్తుంది. థ్రెడ్, సాగే, జిప్, హుక్, బటన్ వంటి కొత్త ఫిక్చర్లు ప్రజలకు అందుబాటులో ఉంచుతుంది. 'పాత' విషయంలో ప్రతికూల భావాలు ఉన్న మహిళలతో నేను చర్చలు జరుపుతున్నాను'' అని మేఘన చెప్పారు.
ముడి పదార్థాలను అన్వేషించడం
''చీర నాకు ఎన్నో మార్గాలను చూపించింది. ఎంతో స్ఫూర్తినిస్తుంది. ఉపయోగించని చీరను ముడి పదార్థంగా అన్వేషించడానికి నేను ఎదురుచూస్తున్నాను'' అని ఆమె చెప్పింది. చీరలను పునర్నిర్మించడంతో పాటు లతాసీత ఇతర ఫ్యాబ్రిక్లను కూడా తయారు చేస్తుంది. ఇటీవల స్టూడియో టస్సార్ కర్టెన్ల నుండి షేర్వాణీలను తయారు చేసింది. ఇది డెనిమ్ జాకెట్లలో కస్టమర్‌కు అనేక పాత జతల జీన్స్‌లను కూడా పునర్నిర్మించింది.
ఇతర దేశాల్లోనూ...
లతాసీత నెలకు 30-40 ఆర్డర్లను అందుకుంటుంది. ప్రీట్ సేకరణ ప్రదర్శనలపై దృష్టి సారించింది. దీని కోసం స్టూడియో సంవత్సరానికి 750 వస్త్రాలను తయారు చేస్తుంది. మేఘనా తైవాన్, ఇంగ్లాండ్, కెన్యా, శ్రీలంక, జర్మనీ, స్వీడన్, బెల్జియం నెదర్లాండ్స్‌లో ప్రదర్శనలకు కూడా తన దుస్తులను తీసుకెళ్లింది. లతాసీత బట్టల ధర రూ. 2,500 మరియు రూ. 25,000 మధ్య ఉంటుంది. రూ.3,000 నుంచి రూ.8,000 రేంజ్లో ఉన్న ఉత్పత్తులు బెస్ట్ సెల్లర్‌గా ఉన్నాయి.
అభివృద్ధితో పాటే సవాళ్లు
గత ఐదారు సంవత్సరాలలో I Was A Saree, Pitara, Dooglage వంటి బ్రాండ్లు, హౌస్ ఆఫ్ వాండరింగ్ సిల్క్, బోడెమెంట్స్ వంటి అంతర్జాతీయ లేబుల్లు అప్‌సైకిల్ ఫ్యాషన్ విభాగంలో ఉద్భవించాయి. ఎదురవుతున్న అనేక సవాళ్ల వల్ల చీరను అప్‌సైకిల్ చేయడానికి సమయం పడుతుందని, డిజైన్‌ను పునరావృతం చేయలేమని మేఘన అంటుంది. కంపెనీ ప్రారంభమైనప్పటి నుంచి లాభాల్లోనే నడుస్తోందని మేఘన చెప్పింది. మహమ్మారి సమయంలో మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. అయితే డి2సి వెబ్‌సైట్‌ను ప్రారంభించిన తర్వాత ఈ సంవత్సరం తన వ్యాపారం 25-30శాతం వృద్ధి చెందుతుందని మేఘన నమ్మకంగా ఉంది.
ఒక క్లోజ్డ్ లూప్ ఉత్పత్తి
మేఘనా ప్రకారం లతాసీతకు సంబంధించి గొప్ప విషయం ఏమిటంటే దాని ప్రక్రియ పారదర్శకంగా ఉంటుంది. ఇది ''క్లోజ్డ్-లూప్ ప్రొడక్షన్ చైన్''ని కలిగి ఉంది. అంటే కస్టమర్‌కు తమ దుస్తులను ఎవరు తయారు చేశారో కచ్చితంగా తెలుస్తుంది. వారు వ్యక్తిగతంగా స్టూడియోకి వచ్చి బట్టలు ఎలా తయారు చేస్తారో చూసే అవకాశం కూడా ఉంటుంది. ''అనవసరంగా ఆన్లైన్లో షాపింగ్ చేయడం కంటే ప్రజలు తమకు ఇష్టమైన విధంగా తమ బట్టలను రూపొందించుకునేలా చేయాలనేే ఆలోచన ఉంది'' అని మేఘన చెబుతుంది.
స్థిరమైన భవిష్యత్తు వైపు
మేఘన చెప్పిన దాని ప్రకారం వ్యాపారం చేసేవారు ఆర్థిక కోణం నుండి మాత్రమే లాభం, నష్టం గురించి మాట్లాడతారు. అయితే సామాజిక, పర్యావరణ దృక్కోణాల నుండి కూడా లాభనష్టాలు ఉన్నాయి. అవి పరిగణించబడవు. వస్త్ర కర్మాగారాల్లో పనిచేసే కార్మికులు దుర్మార్గమైన పని పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అతి తక్కువ వేతనాలతో జీవితాన్ని కొనసాగిస్తున్నారు. రసాయన రంగులు, భారీ మొత్తంలో వ్యర్థాలు పర్యావరణాన్ని దెబ్బతీస్తాయి. వ్యాపారాలు ఈ నష్టాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. లాభం ఆర్థిక శాస్త్రానికి మించి ఉండాలి. కానీ సామాజిక, పర్యావరణ లాభాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి అని మేఘన అంటుంది.
సమగ్రతను కాపాడుకోవడం కష్టం
''నేను H&M లేదా జారా అవ్వాలనుకోలేదు. ఎందుకంటే అప్‌సైక్లింగ్, భారీ ఉత్పత్తి సమగ్రతను కాపాడుకోవడం కష్టం. నేను వ్యాపారాన్ని స్కేల్ చేయాలనుకుంటున్నాను కానీ పర్యావరణానికి సంబంధించిన ఖర్చుతో కాదు. నేను నా కస్టమర్లతో సంభాషణను ప్రారంభించడానికి లతాసీతని ఉపయోగించాలనుకుంటున్నాను. వీరిలో చాలా మందికి పర్యావరణం, సుస్థిరతపై ఆసక్తి లేదు'' అని ఆమె చెప్పింది.