Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవితంలో ప్రతి దశలోనూ ఆర్థిక ప్రణాళిక అవసరం. లేదంటే.. సమయానికి చేతిలో డబ్బు లేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రసూతి సెలవు తీసుకునే ఆరు నెలల కాలమూ ఇందుకు మినహాయింపు కాదు. అయితే ఈ సమయంలో ఎలాగూ జీతం మొత్తం చేతికి అందుతుంది కదా అన్న ఉద్దేశంతో కొందరు డబ్బు ఖర్చు చేసే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేసే వారికి ప్రసూతి సెలవుల సదుపాయం కూడా లేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. మరి ఇలాంటి సమస్యలు లేకుండా అటు ప్రసూతి సెలవుల్ని, ఇటు అమ్మతనాన్ని ఆస్వాదించాలంటే ముందు నుంచే చక్కటి ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. అందుకోసం ఏం చేయాలో తెలుసుకుందాం...
'ప్రసూతి ప్రయోజనాల (సవరణ) చట్టం-2017' ప్రకారం ఉద్యోగినులు ఆరు నెలల పాటు వేతనంతో కూడిన సెలవు తీసుకోవచ్చన్న విషయం మనకు తెలిసిందే. ఇక ఆ తర్వాత కచ్చితంగా తిరిగి ఉద్యోగంలో చేరాల్సి ఉంటుంది. అయితే పాపాయి బాధ్యత రీత్యా ఆపై ఉద్యోగం కొనసాగించడం కుదరచ్చు.. కుదరకపోవచ్చు. బుజ్జాయిని చూసుకునే వారు ఎవరూ లేకపోతే.. కచ్చితంగా తల్లే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. అలాంటప్పుడు సెలవును పొడిగించుకునే అవకాశం మీ సంస్థ అందిస్తుందో, లేదో ముందుగానే తెలుసుకోండి. ఒకవేళ పొడిగించినా, పొడిగించకపోయినా ఈ సమయంలో వేతనం మాత్రం సంస్థలు చెల్లించవు. కాబట్టి ఈ సమయంలో ఆర్థికంగా కాస్త ఇబ్బందులు ఎదురుకావచ్చు. అలా జరగకుండా ఉండాలంటే గర్భం ధరించినప్పటి నుంచే కొంత డబ్బు వెనకేసుకోవాలి.
పొదుపు కొనసాగించండి
ప్రసూతి సెలవు సమయంలో అందే వేతనంలో నుంచి పొదుపును కొనసాగించాలి. దీనివల్ల మీరు పొడిగించుకున్న సెలవుల్లోనూ మీకు ఆర్థిక భరోసా ఉంటుంది. అలాగే మీ పేరు మీద ఉన్న రుణాలు, ఇతర ఖర్చులకు ఈ పొదుపు వల్ల ఆటంకం కలగకుండా జాగ్రత్తపడొచ్చు. దీంతో పాటు మీకు వీలుంటే, సంస్థ అంగీకరిస్తే ఇంటి నుంచి పనిచేసినా సరిపోతుంది. ఆ సదుపాయం లేకపోతే.. తక్కువ సమయం కేటాయించేలా పార్ట్‌టైమ్ ఉద్యోగాలు కూడా వెతుక్కోవచ్చు.
బీమా అవసరం
అత్యవసర సమయాల్లో ఆపద్బాంధవిలా ఉపయోగపడుతుంది బీమా. అందులోనూ ఆరోగ్య బీమా పథకం మనకు ఎంతో ఆపదలో ఆదుకుంటుంది. సాధారణంగా సంస్థలే తమ ఉద్యోగులకు ఇలాంటి బీమా పాలసీ సౌలభ్యాలు అందిస్తుంటాయి. ఒకవేళ మీరు అందులో భాగమైతే మీ పాలసీ ద్వారా మీరు ఏయే ప్రయోజనాలు పొందుతారో ముందే అడిగి తెలుసుకోండి. ముఖ్యంగా మీ పాలసీలో మెటర్నిటీ బెనిఫిట్ ఉందో, లేదో కనుక్కోండి. లేకపోతే ప్రసూతి ప్రయోజనాలు అందించే మరో పాలసీ బయట తీసుకోండి. దీనివల్ల ప్రసవ సమయంలో చాలా వరకు ఖర్చులు కలిసొస్తాయి. ఇలా మీకే కాదు డెలివరీ తర్వాత మీ చిన్నారికీ ఆరోగ్యపరంగా పలు అవసరాలు రావచ్చు. వాటిని దృష్టిలో పెట్టుకొని బుజ్జాయిని మీ పాలసీలో చేర్చుకోవడం, అది కుదరకపోతే వారి పేరు మీద విడిగా పాలసీ తీసుకోవడం వంటి ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషించాలి. తద్వారా డబ్బులకు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.
కొంత మొత్తం పక్కన పెట్టుకోండి
బిడ్డకు జన్మనివ్వడం మనకు మళ్ళీ జన్మనెత్తడం లాంటిదంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమందిలో ప్రసవానంతర సమస్యలు ఎదురుకావచ్చు. వాటి కోసం మరిన్ని డబ్బులు ఖర్చు పెట్టాల్సి రావచ్చు. ఇక పాపాయి విషయంలోనూ డైపర్లు, పాల పొడి, పాల డబ్బా, బేబీ కేర్ కిట్, వైప్స్.. ఇలా బోలెడన్ని అవసరాలుంటాయి. వాటన్నింటికీ కొంత మొత్తం ఖర్చవుతుంది. మరి వచ్చిన జీతం ఆయా ఖర్చులకు పోను.. ఈ అవసరాలన్నింటికీ అదనంగా డబ్బు కావాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు ఇబ్బంది పడకుండా ఉండేందుకు.. బేబీ కోసం ప్లాన్ చేసుకున్నప్పటి నుండే కొంత మొత్తం పక్కన పెట్టడం అలవాటుగా మార్చుకోవాలి. తద్వారా ప్రతి చిన్న విషయానికి మీ భాగస్వామి వద్ద చేయి చాచకుండా హ్యాపీగా ఆన్లైన్లోనే మీకు ఏది కావాలంటే అది బుక్ చేసుకోవచ్చు.
మళ్ళీ ఉద్యోగంలో చేరండి
చాలామంది ప్రసవం తర్వాత పిల్లల బాధ్యత రీత్యా తమ ఉద్యోగాలకు స్వస్తి పలుకుతున్నారు. కొంత గ్యాప్ తర్వాత తిరిగి జాబ్‌లో చేరదామంటే వారికి సరైన ఆదరణ, ప్రోత్సాహం దక్కట్లేదనే చెప్పాలి. అయితే కాస్త ఆలస్యమైనా సరే.. మహిళలు తమ రెండో ఇన్నింగ్స్‌ని ప్రారంభించడమే అన్ని విధాలా మంచిదని సలహా ఇస్తున్నారు నిపుణులు. పిల్లలు స్కూలుకెళ్లే వయసొచ్చాక.. అటు వారి బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. ఇటు ఉద్యోగంలో చేరడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకావు. ఎందుకంటే పిల్లలు ఎదిగే కొద్దీ చాలా అవసరాలుంటాయి.. ఖర్చులుంటాయి. చేతినిండా డబ్బుంటే ఏ అవసరానికైనా సులభంగా వాడుకోవచ్చు. అలాగే మీకు జీతం పెరిగే కొద్దీ వాళ్ల పేరు మీద చేసే పొదుపునూ పెంచుతూ పోవచ్చు. కెరీర్లో ఇంత గ్యాప్ వచ్చింది? తిరిగి ఉద్యోగం సంపాదించడం ఎలా? అని వెనకడుగు వేయకండి. ఎందుకంటే ఇలాంటి వారి కోసమే కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి. వారికి కావాల్సిన నైపుణ్యాల్ని నేర్పుతూ.. తిరిగి వారు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు కావాల్సిన కెరీర్ మార్గాల్ని చూపిస్తున్నాయి.