Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పురుషులతో పోలిస్తే 10-50 ఏండ్ల మధ్య వయసు మహిళలు పదాల్ని గుర్తుపెట్టుకోవడం, ఇతర రకాలైన అభిజ్ఞా నైపుణ్యాల్లో ముందుంటారు. మెనోపాజ్ దశ దాటాక మాత్రం క్రమంగా జ్ఞాపకశక్తి తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 60-70ల్లో ఈ సమస్య కనిపిస్తుందంటున్నారు. మెనోపాజ్‌తో ఈస్ట్రోడియల్(ఈస్ట్రోజన్ ప్రాథమిక రూపం)తో పాటు మరికొన్ని హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది. ఈస్ట్రోడియల్ మెదడులో పనిచేస్తుంది. దీని తగ్గుదల కారణంగా అక్కడ కణాల సృష్టి, వాటి అనుసంధానం, అంతరించడం.. ప్రభావితం అవుతాయి. తద్వారా జ్ఞాపకశక్తి తగ్గుతుంది.
ప్రధానంగా శారీరక వ్యాయామం, మెదడుకు మేత, సాంఘిక జీవనం మీద దృష్టి పెట్టాలి. మొదటి రెండూ మెదడులో కణాల పనితీరుని మెరుగు పరిస్తే.. సాంఘిక జీవనం కొత్త అనుభవాలతోపాటు భౌతికపరమైన అంశాల్ని గుర్తు పెట్టుకోవడంలో సాయపడుతుంది.
దీన్లో ఆహారానిదీ కీలక పాత్రే. కాయగూరలూ, పండ్లు, ఎండు పండ్లు, చేపలకు ప్రాధాన్యం ఉండే మెడిటేరియన్ డైట్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. తగినంత నిద్రా ముఖ్యమే. రాత్రుళ్లు కనీసం ఏడు గంటలు నిద్రపోవాలి. అనుభవాల్ని శాశ్వత సమాచారంగా మార్చడంలో నిద్ర పాత్ర చాలా కీలకం.
మహిళలందరూ ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు ఉన్నవాళ్లు వీటిని ముందునుంచే అనుసరించాలి. ఎందుకంటే వీరిలో ఆలోచించడం, నేర్చుకోవడం, చదవడం, గుర్తుపెట్టుకోవడం, ఏకాగ్రత తగ్గే ప్రమాదం మిగతా వారికంటే ఎక్కువ.