Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బరువు తగ్గాలనుకునేవారికి సూచించే వాటిలో ఓట్స్ ఒకటి. వీటిని రోజూ తినడం వల్ల బరువు అదుపులో ఉండటమే కాదు.. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో చూద్దాం.
వీటిలో ఫైబర్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ. ఇవి త్వరగా అరగవు. దీంతో ఎక్కువ సమయం ఆకలనిపించదు. దీంతో త్వరగా బరువు తగ్గుతారు. ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయులను నిలకడగా ఉంచుతుంది. రక్త పోటునూ దరిచేరనివ్వదు.
పిల్లలు పుట్టాక సహజంగానే మన ఎముకల్లో క్యాల్షియం తగ్గిపోతుంది. దీనిలోని మినరల్స్ ఎముకల ఆరోగ్యానికి సాయపడతాయి. మెనోపాజ్ తర్వాత చాలామంది మహిళల్లో ఎదురయ్యే ఆస్టియోపోరోసిస్నూ అడ్డుకుంటుంది.
అందరూ తిన్నాక తినడం, ఆలస్యంగా పడుకోవడం మనకలవాటే! దీనికితోడు మరుసటిరోజు చేయాల్సిన పనులతో బుర్రంతా నింపేసుకుంటాం. దీంతో గాఢనిద్ర త్వరగా దరిచేరదు. ఉదయానికి నీరసం. అందుకే ఉదయాన్నే ఓట్స్ తీసుకుంటే సత్తువనిస్తుంది. సాయంకాలం స్నాక్స్‌గా తీసుకుంటే.. దీనిలోని అమైనో యాసిడ్లు, ఇతర న్యూట్రియంట్లు మెలటోనిన్‌ను విడుదలయ్యేలా చేస్తాయి. ఇది గాఢనిద్రను అందిస్తుంది. దీనిలోని మినరల్స్ విటమిన్ బి6 ఒత్తిడిని దూరంచేసి, సెరటోనిన్‌ను ప్రేరేపిస్తాయి. దీంతో మనసుకి తేలికపడ్డ భావన కలుగుతుంది.
నెలసరి సమయంలో ఉండే కడుపుబ్బరం, మలబద్ధకం లాంటి సమస్యలనూ తగ్గిస్తుంది. మెనోపాజ్‌లో నీరసం, భావోద్వేగాల్లో మార్పులు మొదలైన ఎన్నో సమస్యలకూ చెక్ పెడుతుందట. దీన్ని బిస్కెట్, మీల్, వేఫర్.. ఇలా ఏ రూపంలోనైనా తీసుకోవచ్చు. తోడుగా పండ్లు, మల్టీగ్రెయిన్స్, తేనె, పాలు వంటివి జోడించుకుంటే అదనపు ప్రయోజనాల్నీ పొందొచ్చు.