Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళా సాధికారత గురించి అందరూ మాట్లాడతారు. కానీ వారిని సాధికారత వైపు నడిపించడంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తారు. అవకాశాలు కల్పించడం గురించి మాత్రం ఆలోచించరు. ఆ ప్రయత్నమే చేస్తుంది నిఖిత కొండూరి. మహిళలకు ఆర్థిక విషయాలపై అవగాహన కల్పించి సొంత కాళ్ళపై నిలబడే ధైర్యాన్ని ఇస్తుంది. దీని కోసమే తల్లీ, చెల్లీ సహకారంతో లీడ్హర్ అనే ఫౌండేషన్ కూడా స్థాపించింది. ఆ వివరాలేంటో తన మాటల్లోనే తెలుసుకుందాం...
మాది హైదరాబాద్. అమ్మ ప్రియ, గృహిణి. నాన్న శేఖర్ వ్యాపారం చేస్తారు. ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగాను. మా అమ్మకు ఉద్యోగం చేయాలని చాలా కోరిక ఉండేది. కానీ ఉమ్మడి కుటుంబ వల్ల చేయడానికి ఎవ్వరూ ఒప్పుకోలేదు. అది నాపై బాగా ప్రభావం పడింది. మా కుటుంబంలో అసలు మహిళలు బయటకు వెళ్ళి ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ చేయడదు అని బాగా ఉండేది. ఆడవాళ్ళంటే కేవలం వంటింటికే పరిమితం అనే భావన ఉండేది. ఇన్నేళ్ళయినా ఇలాంటి ఆలోచన ఉండడం నాకు నచ్చేది కాదు.
డిగ్రీ చదువుతున్నప్పుడే
ఇంట్లో పరిస్థితి చూసిన తర్వాత డిగ్రీలో ఉన్నప్పుడే మహిళా సాధికారత కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఉమెన్ క్లబ్ ప్రారంభించాము. నేను అరోర డిగ్రీ కాలేజీలో చదివాను. కాలేజీలో కూడా చాలా సపోర్ట్ చేసేవారు. సక్సెస్ అయిన మహిళలను పిలిపించి వారి స్ఫూర్తి దాయకమైన జీవితాలను పరిచయం చేసేవాళ్ళం. షీ టీమ్స్‌తో కలిసి కూడా కొన్ని కార్యక్రమాలు చేశాం. వీటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. నాకూ మంచి మోటివేషన్ వచ్చింది. ఇంకా చాలా చేయాలనే ఆలోచన కలిగింది.
నన్ను ఎవ్వరూ నమ్మలేదు
దాంతో ఫౌండేషన్ ప్రారంభించాను. దీనికి పేరు లీడ్ హర్ అని పెట్టాము. నాయకులంటే అందరూ మగవాళ్ళే అనుకుంటారు. మహిళలు అస్సలు గుర్తుకురారు. మహిళలు కూడా నాయకులే అని గుర్తించాలనే ఉద్దేశంతో దీనికి ఈ పేరు పెట్టాము. అయితే దీన్ని ప్రారంభించే ముందుకానీ, ప్రారంభించిన రెండు సంవత్సరాల వరకు నన్ను ఎవ్వరూ నమ్మలేదు. ''ఇదంత నీకు అవసరమా? ఫౌండేషన్ నడపడమంటే చాలా కష్టం. నువ్వు చేయలేవు'' అంటూ ఎన్నో అన్నారు. అయినా నేను చేయాలని నిర్ణయించుకున్నాను. ముందు నేను ఉద్యోగం సంపాదించాలని అనుకున్నాను. కానీ నేను ఉద్యోగం చేయడానికి కూడా ముందు ఇంట్లో ఒప్పుకోలేదు. ఎలాగో ఒప్పించగలిగాను. మా అమ్మ, చెల్లి నాకు సపోర్ట్ చేశారు. అందుకే మేం ముగ్గురం కలిసి ఫౌండేషన్ ప్రారంభించాము.
కరోనా సమయంలో ప్రారంభించాము
2020 ఆగస్టులో ఫౌండేషన్ ప్రారంభమయింది. అప్పుడు కరోనా సమయం. ఆ సమయంలో మహిళలకు ఉద్యోగాలు లేక, ఉపాధి పోయి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళకు ఏం చేయాలో తెలియదు. ఆ సమయంలో వాళ్ళకు వివిధ పెట్టుబడి పెట్టే స్కీమ్‌ల గురించి, సుకన్య సమృద్ధి స్కీమ్ గురించి అవగాహన కల్పించాము.
రుతుశుభ్రతపై అవగాహన
శానిటరీ ప్యాడ్స్ పంపిణీ కూడా చేశాము. ఇప్పటికీ చాలా స్లమ్ ఏరియాల్లో అమ్మాయిలు ఇంకా గుడ్డనే వాడుతున్నారు. దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాంటి వారికి అవగాహన కల్పించి ప్యాడ్స్ పంచుతున్నాము. ఇప్పటికీ చాలా మంది అమ్మాయిలు రుతుస్రావం గురించి బయటకు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. వారిలో అలాంటి భావన పోగొట్టాలనే ఉద్దేశంతో అవగాహన కార్యక్రమాలు పెడుతున్నాము.
మహిళలకు అవగాహన లేదు
గత ఉమెన్స్ డే రోజు మహిళలు ఫిక్స్డ్ డిపాజిట్ ఎలా చేసుకోవ, దాని వల్ల ఎంత లాభం వస్తుంది అనే విషయాలపై అవగాహన కల్పించాము. ఇప్పటికీ చాలామంది బ్యాంక్ లావాదేవీలు అంటే మగవారే చూసుకుంటారు. పెట్టుబడులంటే మగవారే చూడాలి అని అనుకుంటారు. చివరకు ఉద్యోగం చేసే మహిళలు కూడా చాలా మంది ఏటీఎంలు వాడడం లేదు. అలాగే షేర్స్ ఎలా పెట్టాలి. లాభం ఎలా వస్తుంది. వీటి గురించి తెలియదు. వీటన్నింటిపై వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నాము. ఉద్యోగం చేసే మహిళలకు ఆన్లైన్లో, స్లమ్ ఏరియాల్లో వారికి ఆఫ్‌లైన్‌లో శిక్షణ ఇస్తున్నాము.
ఆర్థిక లావాదేవీలపై
అనాథశ్రమాల్లోని అమ్మాయిలకు మైక్రోసాఫ్ట్ ఎక్స్ఎల్లో శిక్షణ ఇచ్చాము. దీని వల్ల వాళ్ళు ఎక్కడైనా ఉద్యోగం సంపాదించవచ్చు. మా ఫ్రెండ్, చెల్లి దీనికి చాలా సపోర్ట్ చేశారు. ప్రస్తుతం అస్సలు ఎలాంటి అవకాశాలు లేని చోట శిక్షణ ఇస్తున్నాము. గన్‌రాక్, టోలీచౌకీ దగ్గరిలో ఉన్న స్లమ్ ఏరియాల్లో కార్యక్రమాలు చేశాము. అలాగే ఆక్సీలియం నవచేతన అనే అనాథాశ్రమం గాంధీ హాస్పిటల్ వద్ద వుంది. అక్కడ అవగాహన కల్పిస్తున్నాము. సోషల్‌మీడియా ద్వారా చాలా ప్రాచారం చేశాము. ఆర్థిక విషయాల గురించి అవగాహన కల్పించేందుకు జూమ్ మీటింగ్‌లు చాలా ఏర్పాటుచేశాము. లైన్స్ క్లబ్‌తో కలిసి కొన్ని కార్యక్రమాలు చేశాము.
నమ్మకం వచ్చిన తర్వాత
స్టాక్‌మార్కెట్ అంటే ఏంటీ, షేర్ అంటే ఏమిటి అనేవి చెబుతున్నాము. ఇందులో రిస్క్ ఉంటుందని చాలా మందికి షేర్స్ అన్నా, స్టాక్ మార్కెట్ అన్నా భయం. ఆ భయం పోవడానికి మా కార్యక్రమాలు ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుతం స్టాక్ మార్కెట్‌పై నెలకు మూడు సెషన్లు నిర్వహిస్తున్నాము. ఇప్పటి వరకు 30 సెషన్లు జరిగాయి. ఒక్కో దాంట్లో 50 మంది వరకు ఉంటారు. ముందే డబ్బులు పెట్టి పెట్టుబడి పెట్టే అవసరం లేకుండా అవగాహన కోసం పేపర్ ట్రేడింగ్ ద్వారా అవగాహన కల్పిస్తున్నాము. వారిపై వారికి నమ్మకం వచ్చిన తర్వాత డబ్బు పెట్టుబడి పెడతారు.
మాకు తెలిసిన ప్రతీది
ఆర్థిక విషయాలపై ఇంకా ఎక్కువ మంది మహిళలకు అవగాహన కల్పించాలి. మహిళలు తమ కాళ్ళపై తాము నిలబడేలా చేయాలి. సిల్క్ దారాలతో గాజులు తయారు చేయడం గురించి మా అమ్మ ఆన్లైన్లో ట్రైనింగ్ ఇచ్చింది. అలాగే మా చెల్లి ప్రణిత చాక్లెట్లు తయారు చేయడం వచ్చే. తాను అందులో ట్రైనింగ్ ఇస్తుంది. అలా మాకు తెలిసిన ప్రతీది పేద మహిళలకు నేర్పిస్తున్నాము. ఇవి వారికి ఆదాయ వనరుగా మారుతుందనే ఆశతో ఇదంతా చేస్తున్నాము. అలాగే సీజనల్ బిజినెస్ ఆలోచనలు కల్పింస్తున్నాము అంటే దీపావళి, వినాయక చవితి వంటివి వచ్చినపుడు వాటి ద్వారా వ్యాపారం ఎలా చేయవచ్చు అనేది చెబుతున్నాము.
సంతోషంగా అనిపించింది
ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు, బంధువులు కూడా నన్ను నమ్ముతున్నారు. సపోర్ట్ చేస్తున్నారు. ఫౌండేషన్ ప్రారంభించిన నాలుగైదు నెలలకు ఎవరో మాకు తెలియని వారు 15వేలు డొనేషన్ మా ఫౌండేషన్ అకౌంట్లో వేశారు. నేను షాకయ్యి వాళ్ళకు ఫోన్ చేసి మీరు పొరపాటున వేశారా లేదా మాకే వేశారా అని అడిగాను. వాళ్ళు మేము చేస్తున్న కార్యక్రమాల గురించి చాలా గొప్పగా చెబితే చాలా సంతోషంగా అనిపించింది. మా ఫౌండేషన్ ఇంత ప్రచారం అయినందుకు చాలా గర్వంగా అనిపించింది. ఇప్పుడు మా అమ్మ కూడా ఆన్‌లైన బిజినెస్ చేస్తుంది. కరోనా వ్యాక్సిన్‌పై పెట్టుబడి పెట్టి మంచి ఇన్‌కం సంపాదించింది.
ధైర్యంగా బతుకుతారు
అంతకు ముందు నేను అమెజాన్‌లో జాబ్ చేశాను. ఇప్పుడు జనోటిక్ కంపెనీలో చేస్తున్నాను. మాకులా పని చేసే ఫౌండేషన్లు చాలా ఉన్నాయి. కానీ ఆర్థిక విషయాలపై అవగాహన కల్పించే సంస్థలు తక్కువగా ఉన్నాయని నా అభిప్రాయం. ఫైనాల్షియల్ ఎడ్యుకేషన్ పెరిగితే మహిళలు ధైర్యంగా బతకగలుగుతారు. అందుకే మేము ఈ కృషి చేస్తున్నాము. ప్రస్తుతం మా ట్రైనింగ్ మొత్తం ఆన్లైన్లో జరుగుతుంది. త్వరలో వీటిని ఆఫ్‌లైన్‌లో జరపాలనుకుంటున్నాము. వాట్సాఫ్ గ్రూపులు కూడా ఉన్నాయి. ఇంటర్వ్యూలకు ఎలా ప్రిపేర్ కావాలి, జాబ్ ఎలా తెచ్చుకోవాలి వంటి వాటిపై కూడా అవగాహన కల్పిస్తున్నాము.
- సలీమ