Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఆకులో ఆకునై కొమ్మలో కొమ్మనై ఈ అడవి దాగిపోనా'' అన్నాడు భావకవి సినీకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి. ప్రస్తుత వాతావరణంలో నగరాలలో జీవించేవారికి ఆ అవకాశమే లేదు. కుండీల్లో పెరిగే బోనసారు చెట్లు, ఎడారి మొక్కలు తప్ప. ఈ మధ్య ఆ కాస్త ఖాళీని సైతం ఆకుకూరలు పెంచుకోవటానికి ఉపయోగిస్తున్నారు. మొలకలు ఆకుకూరలు ట్రేలలో పెంచుకుంటూ తాజా కూరగాయలు తింటున్నామని ఆనందపడుతున్నాం. ఆకుకూరల్ని రోడ్డు పక్కనున్న మురికి కాలవల్లో కడిగి అమ్ముతున్నట్టు నెట్లో వీడియోలు చూసి అందరూ భయపడుతున్నారు. నులి పురుగులు, ఏలిక పాములు వంటివన్నీ అపరిశుభ్ర ఆహారాన్ని తినటం వల్ల కడుపులో చేరి నష్టాన్ని కలగజేస్తాయి. ఎక్కువగా పిల్లలకు కడుపునొప్పి ఇలాంటి పురుగులతోనే వస్తుంది. ఆకుకూరల్ని జాగ్రత్తగా కడిగి కూరలు వండుకోవాలి. సరే ఈరోజు ఆకులతో చిత్రాలు చేద్దామా!
పూర్వం ఆర్ట్లన్నీ ఇంట్లో దొరికే వస్తువులతోనే చేసేవారు. పెరట్లో ఉండే చెట్టు చేమలతో, వంటింట్లో ఉండే పప్పు దినుసులతో రకరకాల ప్రయోగాలు స్కూల్లోనూ చేయించే వాళ్ళు. వాటికి కొంత సృజనాత్మకత జోడించి ఎవరికి వాళ్ళు కొత్తదనాన్ని సృష్టించేవారు. తల్లులు పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని ఇలాంటి బొమ్మలు తయారు చేస్తుంటే పిల్లలకు విజ్ఞానం కలుగుతుంది. కేవలం ఆకులతో బొమ్మలు చేస్తే విజ్ఞానం ఏం వస్తుందా అనుకుంటున్నారా! రకరకాల చెట్ల ఆకుల్ని గమనిస్తే ఒక్కొక్కటి ఒక్కోరకంగా ఉంటుంది. ఆకుల ఆకారాలు చెప్తూ, ఆ చెట్టుకు ఎలాంటి పూలు పూస్తాయో వాటి విశిష్టతల్ని చెబుతూ ఉంటే వాళ్ళకు తెలియకుండా సైన్స్‌ను బోధించినట్టే.
పెయింటింగ్
కోలగా ఉన్న ఒక ఆకును తీసుకుని డ్రాయింగ్ షీటుపై పెయింటింగ్ చేద్దాం. తెల్లని డ్రాయింగ్ షీటును తీసుకొని దానిపై ఆకులతో రంగులు అద్దాలి. కోలగా కొద్ది పొడవుగా ఉండే ఆకుల్ని మూడు కలిపి ఉండే ఆకుల్ని దానితో పాటు ఒకే ఆకును తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆకు వెనుక భాగాన రంగును అద్ది పేపర్‌పై అద్దాలి. ఎరుపు రంగుతో అద్దాలి. మూడు ఆకులున్న దానికి ఆకుపచ్చ రంగును పులిమి కాగితంపై మూడు వరసల్లో అద్దాలి. ఇప్పుడు మందారం ఆకుని తీసుకొని ఎరుపు రంగును వేసి కాగితంపై అక్కడక్కడా అద్దాలి. ఇలా అక్కడక్కడా అద్దుతూ పోతే చివరకు ఆకుపచ్చ ఆకుల్లో ఎర్రని పువ్వులు పూసే చెట్టులా తయారవుతుంది.
సీతాకోకచిలుక
మందారం ఆకుల చివర్లు రంపంలా ఉంటుంది. ఇదొక ప్రత్యేక లక్షణం. ఇప్పుడు మందార ఆకులతో సీతాకోక చిలుకను చేద్దాం. ఊరికే సీతాకోక చిలుకను చేస్తే ఎలా? పూల మీద వాలి మధువును గోలుతున్నట్టుగా చిత్రీకరిస్తే బాగుంటంఉది కదా! అందుకే కొద్దిగా దోసగింజ ఆకారంలో ఉన్న ఆకుల్ని తీసుకుని ఎరుపు రంగును పూసి కాగితంపై అద్దాలి. ఇలా వరసగా ఆకులతో రంగుల్ని అద్దాలి. అప్పుడు అది పువ్వులా కనిపిస్తుంది. ఇప్పుడు రెండు సైజుల్లో మందార ఆకుల్ని తీసుకుని రంగుల్ని పూయాలి. పెద్ద మందార ఆకుతో పైవైపు రెక్కలు, చిన్న మందార ఆకుతో కిందివైపు రెక్కల్ని చిత్రించాలి. బ్రష్‌తో సీతాకోక చిలుక పొట్ట, తల, శృంగాలు గీసుకోవాలి. ఇప్పుడు పూలపై వాలిన సీతాకోక చిలుక చిత్రం రెడీ అయింది.
మనిషి బొమ్మ
నాలుగు ఎండు పుల్లలు, రెండు పండిపోయి రాలిపోయిన ఆకులు, ఎండిపోయిన విత్తనాలు, కాయలు సేకరించుకుంటేచాలు. బోలెడు బొమ్మలు చేయవచ్చు. నేను రెండు బొమ్మల్ని చూపిస్తాను. ఇంట్లో కుండీల్లో పెరిగే ఆకుల్నైనా సేకరించవచ్చు. లేదంటే రోడ్డుమీద డివైడర్ మీద ఎన్నో చెట్లను నాటుతున్నారు. ఆ ఆకుల్ని తెచ్చుకోవచ్చు. కావల్సిందల్లా న్యూ విజన్ మాత్రమే. దేంట్లోనైనా సౌందర్యం కనిపిస్తుంది. పత్తి ఆకులా మూడు విభాగాలుగా విభజించబడిన ఎరుపు రంగు ఆకును తీసుకోవాలి. మరొక పండిపోయిన మందార ఆకును తీసుకోవాలి. మా ఇంట్లో మందారాలు ఎక్కువ ఉన్నాయి. అందుకే ఎక్కువగా వాటితోనే చేస్తున్నాను. మందార ఆకుకు కళ్ళు, నోరు అతికించాను. ఎలా అంటే ఎండిన కాయలు, విత్తనాల సహాయంతో. ఇప్పుడు ఎండు పుల్లల్ని కాళ్ళు చేతుల్లా అమర్చాను. చూడండి పసుపు పచ్చని మనిషి తయారయ్యాడు. రెండోది పండిపోయిన మేపుల్ ట్రీ చెట్టు ఆకును తీసుకున్నాను. దీనికి అదే విధంగా అమర్చాను. నల్లని కాయల్ని కళ్ళుగా అమర్చాను. తోలు తీసిన కాయల విత్తనాలను పళ్ళుగా అమర్చాను. కాళ్ళ కోసం పుల్లలు పెట్టాను. చూడండి ఎంత బాగున్నాయో!
సీనరీ
దీనికి కొన్ని చెక్క పేళ్ళను, చెక్కను చెక్కేటపుడు వచ్చే సన్నని చీలికలను తెచ్చుకోవాలి. చెక్క పని చేసేవారి దగ్గర బోలెడు చెత్త దొరుకుతుంది. మా ఇంట్లో ప్రస్తుతం చెక్కపని వాళ్ళు రిపేర్లు చేస్తున్నారు. వాటిలో వచ్చిన సన్నని చీలికలను తీసుకొని పక్కన పెట్టుకున్నాను. చెత్తను పారబోస్తూ నాకొకసారి చూపించారు. ''ఏమైనా బొమ్మలు చేసుకుంటావా అమ్మా'' అని. నా బొమ్మ విషయం నా దగ్గర పనికి వచ్చే వాళ్ళందరికీ తెలుసు కదా! మొన్ని మధ్య తోలు పనులు చేసే షాపుకు వెళ్ళినపుడు అక్కడ గుండ్రంగా కత్తిరించిన ముక్కలు భలే అందంగా కనిపించాయి. వెంటనే వాళ్ళనడిగి ఇంటికి తెచ్చుకున్నాను. దాంతో బొమ్మలు చేశాక మీకూ వివరిస్తారు. సరే ఇప్పుడు కుండీల్లో పెరిగే క్రోటన్ ఆకుల్ని సేకరించాలి. చెక్కపేళ్ళను నేల లాగా పరిచి అతికించేయాలి. ఒకవేళ ఇవి దొరక్కపోతే ఆలోచించవచ్చు. ఆ భాగాన్ని రంగులతో పెయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు క్రోటన్ ఆకుల్ని నిలువుగా పెట్టి అతికించాలి. ఇవి అశోక చెట్ల ఆకారంలో కనిపిస్తాయి. పక్కనొక గుబురు చెట్టు ఉన్నట్టుగా ఆకుల్ని సెట్ చేయాలి. ఓ పక్కన గడ్డి నేలలాగా ఆకుల్ని ఏటవాలుగా అతికించాలి. దాని మీద ఇల్లు కట్టినట్టుగా ఎండు ఆకుల్ని కత్తిరించి వాడుకోవాలి. ఇంటి వెనక అరటిచెట్టు ఉన్నట్టుగా కూడా నేను ఆకుల్ని అతికించాను. సీనరీ రెడీ అయింది.
పెద్ద వృక్షం
రోడ్డు పక్కన ఉండే పెద్ద వృక్షాల్ని సైతం ప్రింట్ చేయవచ్చు. ఈ బొమ్మలకు మనకు డ్రాయింగ్ రానవసరం లేదు. పిల్లలతోనూ చేయించవచ్చు. దీనికోసం పెద్ద ఆకులతో వృక్షాన్ని తయారు చేయాలి. చివర్న పూలున్నట్టుగా పసుపు రంగును అద్దాలి.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్