Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పని, వేళలు అన్నీ సమానమైనా సంస్థల్లో అవకాశాలకొచ్చేసరికి ఇప్పటికీ మనం వెనకే ఉన్నాం. ఈ పరిస్థితుల్లో నెమ్మదిగా మార్పు మొదలైంది. వాటిని అందుకోవాలంటే మన నుంచీ కొంత ప్రయత్నం కావాలంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.
'మన పని మనం చేసుకుంటూ వెళదాం.. గుర్తింపు అదే వస్తుంది' మనలో చాలామంది ధోరణి ఇదే. కానీ ఇది తగదు. సంస్థ చిన్నదైనా, పెద్దదైనా మీ లక్ష్యంపై మీరు స్పష్టంగా ఉండాలి. ఎదుటివారి దగ్గర వ్యక్తపరచడానికీ వెనకాడొద్దు. అభిప్రాయాలు చెప్పడానికి వెనకాడొద్దు. ఏమనుకుంటారో అని మొహమాటపడటమే మనల్ని వెనక్కి లాగే అంశమంటారు నిపుణులు. మీ పని గురించి మీరే చెప్పుకోవాలి. సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. ఇవే మిమ్మల్ని పోటీలో నిలబెట్టి కోరుకున్న స్థాయికి చేరుస్తాయి.
ఆలోచనలున్నా వ్యక్తపరచడమెలాగో తెలీయడం లేదా? అంటే కమ్యూనికేషన్లో వెనుకబడ్డట్టే.. ముందు ఈ నైపుణ్యాన్ని పెంచుకునే దారుల్ని వెతకండి. మాటలతో మాయ చేయనక్కర్లేదు కానీ.. ఒప్పించడమెలాగో తెలుసుకోండి. మీ బృందంలో ఎవరైనా ఉంటే వారిని గమనించండి. ప్రాజెక్టు, మీటింగ్కు సిద్ధమయ్యే ముందే మీరు చెప్పాలనుకున్న విషయం, దానికి సంబంధించి ఎదురయ్యే ప్రశ్నలు ఆలోచించుకొని సమాధానాలు సిద్ధం చేసుకోండి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
ఒక పరిశోధన ప్రకారం..ఉన్నత స్థానానికి దరఖాస్తు చేసుకోవడానికి 60 శాతం అర్హత ఉన్నా మగవాళ్లు ప్రయత్నిస్తారట. కానీ మహిళలు మాత్రం 100 శాతం అర్హత ఉన్నా వెనకడుగు వేస్తారట. కారణం.. ఇంకా ఏమిలేవు అనేదే వెతుకుతూ, ఆలోచిస్తూ వెనకడుగు వేస్తారట. బలహీనతలు ఎవరిలో ఉండవు? ఎంతసేపూ మీ దృష్టి మీ బలాలను ప్రమోట్ చేయడంపైనే ఉండాలి. అప్పుడే ముందుకు వెళ్లగలుగుతారు. లేదూ కొన్ని నైపుణ్యాలు తప్పనిసరి అనిపించిందా.. వాటిని నేర్చుకోవడానికి ప్రయత్నించండి.
నెట్వర్కింగ్.. అవకాశాలను చేరువ చేసే మంత్రం. స్థాయి, హోదాతో సంబంధం లేకుండా అందరితో సత్సంబంధాలను నెరపండి. ఎవరినో మెప్పించాలనే ప్రయత్నం వద్దు. ప్రొఫెషనల్ చర్చలు కొనసాగించినా చాలు. కావాలంటే మీ అభిప్రాయాలను పంచుకోవచ్చు లేదూ వాళ్ల అనుభవాల గురించి తెలుసుకోవచ్చు.