Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మల్టీటాస్కింగ్ మనకు పెట్టింది పేరు కానీ.. ప్రెజెంటేషన్ దగ్గరికొచ్చే సరికి వెనకబడుతుంటాం. కెరియర్లో ముందుకు సాగాలంటే ప్రాజెక్టులు, వాటిని బృందంతో ఒప్పించడమేమో తప్పనిసరి. మరి ఎలాగంటారా? అందుకే ఈ సూచనలు...
వినేదెవరు? సగం విజయం ఈ ప్రశ్నకు సమాధానంపైనే ఆధారపడి ఉంటుందంటారు నిపుణులు. సమావేశానికి హాజరయ్యే వారెవరు, వాళ్ల పరిజ్ఞానం, ఎంతమంది ఉంటారు వంటివి తెలుసుకుంటే మీరెలా సిద్ధమవ్వాలన్న దానిపై స్పష్టత వస్తుంది. ఎక్కువ మంది ఉన్నారా.. సహజంగానే ఒత్తిడి, భయం ఆవరిస్తాయి. కానీ అక్కడ వాళ్లు మీ కోసం రావట్లేదు. మీరు అమ్మాయా, నైపుణ్యాలున్నాయా అని చూడటానికి రావడం లేదు. వాళ్లకు మీరు చెప్పే విషయం ప్రధానం. కాబట్టి దాన్ని ఎంతవరకూ ప్రభావవంతంగా, ఆకట్టుకునేలా చెబుతారన్న దానిపైనే దృష్టిపెట్టాలి.
ఉదాహరణలు.. సీరియస్గా చెప్పుకొంటూ పోతే కొంతసేపటికి బోర్ అనిపిస్తుంది. ఎంత ముఖ్యమైన విషయమైనా ఇది తప్పదు. కాబట్టి చిన్న చిన్న ఉదాహరణలు, అనుభవాలు జోడించండి. వినేవాళ్లకీ ఆసక్తికరంగా ఉంటుంది. అయితే ఒకవైపే చూస్తూ చెప్పడం లాంటివి చేయొద్దు. అది చదువుతున్న భావనను కలిగిస్తుంది. చుట్టూ ఉన్నవాళ్లని చూస్తూ చెబితే మీకూ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
రాసింది చూసి చదవడం వేరు. ఏమీ చూడకుండా నలుగురి ఎదుటా మాట్లాడటం వేరు. కంఠతా పట్టేస్తే సరిపోతుందనుకోకండి. అద్దం ముందు నిల్చొని మాట్లాడటం, హావభావాలు, శరీర కదలికలు వంటివి సాధన చేయండి. ఎంత సాధన చేస్తే మీకే అంత లాభం. సరిగా సిద్ధమయ్యా అన్నాక ఓసారి రికార్డు చేసుకొని వినండి. స్వరంలో హెచ్చుతగ్గులు, ఎక్కడ ఆగాలి, ఎక్కడ కొనసాగించాలన్నవి అర్థమవుతాయి.
నచ్చుతుందో లేదో అన్న ఆలోచనొద్దు. దృష్టి అంతా మీరనుకున్నది ఎదుటివారికి ఎంత వరకూ చేరవేయగలుగుతున్నారన్న దానిపైనే ఉండాలి. ఎంత ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారన్నదీ ముఖ్యమే. ఎవరినో అనుకరించడానికి ప్రయత్నించొద్దు. మీరు మీలానే ఉండండి. వేదికపై స్థలం ఉంటే కొద్దిగా నడుస్తూ మాట్లాడటానికి ప్రయత్నించండి. చివరగా ప్రశ్నలకూ అవకాశమివ్వండి. ఏమేం ప్రశ్నలు రావచ్చో ముందే ఆలోచించుకుంటే మంచిది. తెలిసిన వాటికి ఉదాహరణలతో సమాధానమివ్వండి. తెలియకపోతే నిజాయతీగా ఒప్పుకోండి. ఏదోఒకటి మాత్రం చెప్పొద్దు.