Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంటి నిర్వహణ, కెరియర్లో సమస్యలు వచ్చినప్పుడు ఎదుటి వారు 'పాజిటివ్‌గా ఆలోచించు'.. 'ఈ సమస్య శాశ్వతం కాదు' అని చెబుతుంటారు. వాటిని విన్నప్పుడు నిజమనిపించదు. అయితే ఎవరు చెప్పినా సానుకూల ఆలోచనాధోరణితో ఉండటం మంచిది. ఇబ్బందులెదురైనప్పుడు డీలా పడిపోకూడదు. ఎలాగైనా పరిష్కరించే మార్గం ఉంటుందనే కోణంలో అడుగులేయాలి. సమస్యను అధిగమించగలమనే ఆలోచనే మెదడుకు కొత్త శక్తినిస్తుంది.
పరిష్కరించలేననే సమస్యలెదురైనప్పుడు ఒంటరిననే భావం మొదలవుతుంది. ఇది మిమ్మల్ని మరింత బలహీనపరుస్తుంది. అటువంటి సమయంలో మీ శక్తిని ఇతరులను సంతోషపెట్టే పనికి ఉపయోగించాలి. అందులోంచి పొందే ఆనందం, తృప్తి మనసును ఉత్సాహపరుస్తుంది. ప్రతికూల ఆలోచనలు క్రమేపీ దూరమవుతాయి. ఇతరుల కోసం మీరూ పనిచేయగలరనే ఆలోచన ఆనందాన్నివ్వడమే కాదు, మీ మనసుకు నచ్చిన పని తృప్తినీ.. అందిస్తుంది. దాంతో పాటు మీ సమస్యకు కారణమైన వాటిని కూడా గుర్తించగలిగే స్థాయికి చేరుకుంటారు. వాటిని ఛేదించి బయటకు రాగలిగే శక్తిని పొందుతారు. మీకేం కావాలి, ఏది మీ మనసును సంతోషంగా ఉంచుతుంది వంటి అంశాలన్నీ తెలుసుకుంటారు. అవే మిమ్మల్ని ఒంటరిననే భావం నుంచి దూరం చేస్తాయి.
ఆత్మవిశ్వాసం తగ్గినప్పుడు గతంలో మీరు సాధించిన విజయాలను ఓ పట్టికలా రాయాలి. పరీక్షల్లో ఉత్తీర్ణత, క్లిష్టమనుకున్న క్రీడలో అడుగుపెట్టి విజేతగా నిలవడం వంటివన్నీ ఒక పుస్తకంలో రాయాలి. వాటిని చూస్తూ, ఆ సమయంలో వాటినెలా సాధించ గలిగారో గుర్తుకు తెచ్చుకోవాలి. మీరు గర్వపడేలా చేసిన ఆ క్షణాలు తిరిగి ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. మీ నైపుణ్యాలు మీకు తెలుస్తాయి. నీవల్ల ఏదీ కాదు అని మనసు పదేపదే చెబుతూ, ఆత్మన్యూనత పెరుగుతుంటే దాన్ని అధిగమించగలగాలి. ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి. సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఇవన్నీ మానసిక బలాన్నిస్తాయి.