Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మీల్ మేకర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తక్కువ సమయంలో వంట చేయాల్సి వచ్చినప్పుడు మనల్ని ఆదుకునేది ఇదే. దీంతో చేసిన వంటకాలను పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. నాన్‌వెజ్‌కు దూరంగా ఉండేవారు దీన్ని మరింత ఇష్టంగా తీసుకుంటారు. ఇందులో పోషక విలువలు కూడా ఎక్కువేనని నిపుణులు చెబుతుంటారు. అలాంటి మీల్మేకర్తో కొన్ని రుచికరమైన వంటలు మీకోసం.
దాల్చా
కావల్సిన పదార్థాలు: మీల్ మేకర్ - వంద గ్రాములు, కందిపప్పు - 50 గ్రాములు, కొబ్బరి - చిన్న ముక్క, కొత్తిమీర - నాలుగు రెమ్మలు, టమాటాలు - నాలుగు, చింతపండు రసం - కప్పు, ఉల్లి తరుగు - అర ఉల్లిగడ్డ, ఉప్పు - అర టీస్పూను, కారం - టీ స్పూను, ధనియాల పొడి - మూడు టీ స్పూన్లు, పసుపు - చిటికెడు.
తయారు చేసే విధానం: ముందుగా మీల్ మేకర్ ఉడికించి పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి చిన్న మంట మీద ఉడికించిన మీల్మేకర్, ఉప్పు, పసుపు, రెండు రెమ్మల కొత్తిమీర తరుగు వేసి నిమిషం సన్నని సెగ మీద తిప్పాలి. ఆ తర్వాత టమాట ముక్కలు వేసి మెత్తగా ఉడకనివ్వాలి. కొబ్బరి మిశ్రమం, కంది బేడల మిశ్రమం, చింతపండు రసం వేసి బాగా పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి. కమ్మని మీల్ మేకర్ దాల్చా రెడీ. ఇది అన్నం, రోటీ, పూరీ ఎందులోనైనా రుచిగా ఉంటుంది. ఆయిల్ లేకుండా కూడా దీన్ని తయారు చేసేకోవచ్చు.
ఖీమా హల్వా
కావల్సిన పదార్థాలు: మిల్ మేకర్ ఖీమా - అర కిలో, చక్కెర - కప్పు, క్యారెట్ లేదా బీట్రూట్ తురుము - ఒదక కప్పు, నెయ్యి - వంద గ్రాములు, ఇలాచీ పొడి - చిటికెడు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష - 25 గ్రాములు, పాలు - రెండు కప్పులు.
తయారు చేసే విధానం: ముందుగా మీల్ మేకర్లో కొద్దిగా ఉప్పు వేసి ఐదు విజిల్స్ వచ్చే దాకా ఉడికించి జార్లో ఖీమా బ్లేడ్ పెట్టి ఖీమాలాగా చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద బాణలి పెట్టి నెయ్యి వేసి డ్రైఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి. క్యారెట్ తురుము వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో పాలు పోసి బాగా వేడి చేసి అందులో వేయించిన క్యారెట్, ఉడికించిన మీల్ మేకర్ ఖీమా వేసి తిప్పుతూ బాగా మెత్తగా ఉడకనిచ్చి ఇలాచీ పొడి వేసి నెయ్యి తేలేలాగా దగ్గర కానివ్వాలి. దించే ముందు వేయించిన డ్రైఫ్రూట్స్ వేసి దించాలి. ఇది కొద్దిగా చల్లారాక సర్వ్ చేసుకోవాలి. ఇది వెరైటీగా, రుచిగా ఉంటుంది.
పులావ్
కావల్సిన పదర్థాలు: మీల్ మేకర్ - 250 గ్రాములు, బాస్మతి బియ్యం - 250 గ్రాములు, నెయ్యి, నూనె - వంద గ్రాములు, ఉప్పు - ఒక టేబుల్ స్పూను, దాల్చిన చెక్క - ఒక ముక్క, అల్లం - 25 గ్రాములు, వెల్లుల్లి రెబ్బలు - ఒక గుప్పెడు, యాలకులు - మూడు, లవంగాలు - 15, బిర్యానీ ఆకులు - రెండు, పుదీనా - నాలుగు రెబ్బలు, పచ్చిమిర్చి - నాలుగు, కొత్తిమీర - నాలుగు రెబ్బలు, ఉడికించిన గ్రీన్‌పీస్ - 50 గ్రాములు, ఆలుముక్కలు - ఒక చిన్న కప్పు, ఉల్లి తరుగు - చిన్న కప్పు.
తయారు చేసే విధానం: ముందుగా ఆలు ముక్కలు, గ్రీన్‌పీస్, మీల్మేకర్ విడివిడిగా ఉడికించుకోవాలి. స్టవ్‌పై చిన్న గిన్నెపెట్టి నెయ్యి, నూనె పోసి కొద్దిగా వేడి చేయాలి. ఇలాచీ, దాల్చిన చెక్క, సంగం అల్లం, సగం వెల్లులి పేస్ట్ వేసి వేయించాలి. అందులోనే బిర్యానీ ఆకులు, కొత్తిమీర, పుదీనా, ఉల్లి తరుగు వేసి వేయించాలి. ఆ తర్వాత మిగతా అల్లం, వెల్లులి పేస్ట్ వేసి మంచి వాసన, రంగు, రుచి వచ్చేదాకా వేయించి ఉడికించిన గ్రీన్‌పీస్, ఆలు ముక్కలు, మీల్ మేకర్ ముక్కలు వేసి వేయించి తగినంత నీరు (రెండు కప్పులు), ఉప్పు వేసి కడిగిన బియ్యం వేసి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. అంతే మీల్ మేకర్ పులావ్ రెడీ. దీన్ని మీల్ మేకర్ ఖుర్మా లేదా బఠానీ ఖుర్మా లేదా పుదీనా చట్నీతో తినవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. త్వరగా అయిపోతుంది.