Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గర్భధారణలో నెలనెలా పెరిగే పొట్టే కాదు.. హార్మోనుల్లో మార్పులూ కాబోయే అమ్మకు కునుకు లేకుండా చేస్తాయి. కంటి నిండా నిద్రపోవాలా.. వీటిని పాటించేయండి.
గర్భధారణలో హార్మోనుల్లో మార్పులు సాధారణంగానే గ్యాస్, గుండె పట్టేసినట్టు అనిపించడం లాంటి వాటికి దారితీస్తాయి. వీటికితోడు కూల్‌డ్రింక్‌లు, సిట్రస్ ఫలాలు, పెప్పర్మింట్, టొమాటో వంటివి తీసుకున్నారో సమస్య పెరగొచ్చు. ఫలితమే రాత్రుళ్లు సరిగా నిద్రపట్టకపోవడం. వీటికి వీలైనంత దూరంగా ఉండండి. కారం, ఎక్కువ కొవ్వులు ఉన్నవాటినీ తీసుకోవద్దు.
నెలలు నిండేకొద్దీ అరుగుదల మందగిస్తుంది. పడుకోవడానికి కనీసం మూడు గంటల ముందు ఏమీ తినకపోవడం మంచిది. ఆకలేస్తే త్వరగా జీర్ణమయ్యే పండ్లను తీసుకోవడం మేలు.
ప్రతి రెండు గంటలకోసారి కొద్దికొద్దిగా తీసుకోవడం మంచిది. తినేప్పుడు మంచినీరు తాగొద్దు. తప్పనిసరి అయితే కొద్దిగా తీసుకోవచ్చు. భోజనం పూర్తయ్యాక అరగంట తర్వాతే తాగాలి. అప్పుడే ఆహారం తేలిగ్గా జీర్ణమవుతుంది. పడుకోవడానికి కనీసం గంట ముందు నీళ్లు తాగకుండా ఉంటే మంచిది. మూత్రానికి పదే పదే లేవాల్సిన బాధ ఉండదు.
కాఫీకి వీలైనంత దూరంగా ఉండండి. ఇది నిద్రకు భంగం కలిగించడమే కాదు.. చిన్నారి ఎదుగుదలపైనా ప్రభావం చూపుతుంది.