Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముగ్ధా కల్రా... ఒక ఆటిజం కార్యకర్త.. న్యూరోడైవర్స్ కొడుకుకు తల్లి.. ఓ పాత్రికేయురాలు.. చీఫ్ కంటెంట్ ఆఫీసర్.. కార్పొరేట్ ట్రైనర్.. 'నాట్ దట్ డిఫరెంట్' అనే ఆమె పుస్తకం న్యూరోడైవర్సిటీపై కామిక్ స్ట్రిప్‌ను పిల్లల నేతృత్వంలోని సృజనాత్మక వేదిక బుకోస్మియాతో కలిసి ఆమె ప్రారంభించింది. ప్రస్తుతం ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల సంరక్షకులు, వారి తల్లుల సాధికారత కోసం విశేష కృషి చేస్తుంది. అందుకుగాను ఆమె BBC100Women 2021 గుర్తింపును పొందింది.
పిల్లలు న్యూరోడైవర్సిటీని స్వీకరించడంలో సహాయపడటం ముగ్ధా కల్రా లక్ష్యం. ఓ కామిక్ పుస్తకంలో 12 ఏండ్ల సారా ఆటిజంతో బాధపడుతున్న కొత్త స్నేహితుడైన మాధవ్‌ను కలుసుకున్నప్పుడు ఆమె ప్రయాణం కొనసాగుతుంది. న్యూరోడైవర్సిటీ అనేది డైస్లెక్సియా, డిస్ప్రాక్సియా, డైస్కాల్క్యులియా, ఆటిజం, అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ADHD) వంటి ప్రత్యామ్నాయ ఆలోచనా శైలులను వివరించడానికి ఉపయోగించే ఒక పదం. ఆటిజంతో బాధపడుతున్న ఒక బిడ్డకు తల్లి కావడంతో ముగ్ధ అందుకు సంబంధించిన కష్టాలను దగ్గరగా చూసింది.
పూర్తిగా భిన్నమైనది
''నా కొడుకు పుట్టాక జీవితం పూర్తిగా మారిపోయింది. బాబుకు నాలుగేండ్లు ఉన్నప్పుడు ఆటిజం స్పెక్ట్రమ్‌లో ఉన్నట్టు నిర్ధారణ అయింది. అప్పుడు తల్లిదండ్రులుగా మా బాధ వర్ణనాతీతం. అప్పటి నుండి ప్రపంచాన్ని వేరే కోణం నుండి చూడటం ప్రారంభించాను'' అని ముగ్దా చెప్పారు. అప్పటి నుండి ఆటిజం కొడుకుతో ముగ్ధ అంగీకార ప్రయాణం ప్రారంభమైనప్పటికీ ఓ తల్లిగా ప్రత్యేక అవసరాలు గల పిల్లల సంరక్షణకు పూర్తిగా భిన్నమైన పట్టుదల అవసరమని గ్రహించారు.
సవాళ్లను అంగీకరించడం
''చాలా కాలం నేను ఇక ఎప్పటికీ పని చేయలేనని, నా కెరీర్ ముగిసిందని అనుకున్నాను. చివరకు నా అనుభవాలు పంచుకుంటూ ఓ బ్లాగ్ ప్రారంభించాను'' అంటూ ముగ్ధ గుర్తుచేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఇతర తల్లులు ముగ్ధ బ్లాగ్ పట్ల ఆకర్షితులయ్యారు. అక్కడ సహాయక బృందాలు ఉన్నాయని ఆమె గ్రహించారు. వారి సొంత మార్గంలో తమ వంతు కృషి చేస్తున్నారు. ఇది సామూహిక మానవత్వ శక్తిపై ఆమెకున్న నమ్మకాన్ని కూడా ప్రోత్సహించింది. ''కేవలం నా బిడ్డపై దృష్టి కేంద్రీకరించడం నుండి నేను మొత్తంగా న్యూరోడైవర్సిటీ గురించి మరింత తెలుసుకోవడానికి, సంరక్షకుని కోసం ఏమి చేయవచ్చు అనే విషయాలను ఆలోచించడం మొదలుపెట్టాను'' అని ముగ్ధ చెప్పారు.
స్త్రీల మానసిక ఆరోగ్యం గురించి
''ఇలాంటి పిల్లల పట్ల శ్రద్ధ వహించే లేదా సంరక్షించే స్త్రీల మానసిక ఆరోగ్యం గురించి ఎవరూ పట్టించుకోరు. దీన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే ఒక తల్లిగా, ఒక మహిళగా బిడ్డను సంరక్షించడం మీ పని అని ఎవరైనా చెప్పడం సులభం'' అంటున్నారు ఆమె. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల కోసం చాలా ఏర్పాట్లు జరుగుతున్నాయని ముగ్ధ భావిస్తునానఉ. ఇంటర్వెన్షన్లు, మెడికల్ థెరపీ వంటివి ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేక అవసరాలు గల తల్లి జీవితంలో ఎన్నో ఆందోళనలు ఉంటాయి. ముగ్ధ కొడుకు మాధవ్‌కు ఇప్పుడు 12 ఏండ్లు. ముంబైలోని ఒక ప్రత్యేక పాఠశాలలో చదువుతున్నాడు.
అన్నింటిపై అవగాహన
ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు ప్రారంభమైనప్పుడు ఆమె వీడియోలు చేయడం మొదలుపెట్టింది. ఆటిజం పిల్లలను సంరక్షించే కమ్యూనిటీకి అవగాహన, మద్దతును పెంచడానికి సహకారులు, వాటాదారులతో పాలుపంచుకుంది. ముగ్ధతో పాటు ఆమె స్నేహితురాలు ఫేస్బుక్లో సహాయక బృందాన్ని కూడా నడుపుతున్నారు. అక్కడ వారు ఆత్మహత్యకు పాడ్పడేవారికి అవగాహనతో పాటు మరిన్నింటి గురించో మాట్లాడతారు. తల్లులు, ఇతర మహిళా సంరక్షకులను వారి సమస్యల గురించి మాట్లాడటానికి తమని సంప్రదించమని ప్రోత్సహిస్తారు. త్వరలోనే ఇది ఓ సామాజిక ఉద్యమంగా మారబోతుందని ముగ్దా నమ్ముతున్నారు. ఆమె సంకల్పం, కృషి వల్ల అనుకున్నదానికంటే ఎక్కువ ఫలితాలను ఇస్తుంది.
అవకాశాలకు సవాళ్లు
బీబీసీ 2021లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100 మంది స్ఫూర్తిదాయకమైన మహిళల జాబితాను విడుదల చేసినప్పుడు ఆ జాబితాలోకి వచ్చిన ఇద్దరు భారతీయుల్లో ముగ్ధా ఒకరు. ''నేను షాక్ అయ్యాను. మొదట్లో వారు ఎవరినైనా ఇంటర్వ్యూ చేయడానికి నన్ను సంప్రదించారని అనుకున్నాను. కానీ గుర్తింపు గురించి తెలుసుకున్నప్పుడు ఇది ఒంటరి పోరాటం అయినప్పటికీ ఆ పని అంతా అర్ధవంతమైనదని ధృవీకరించబడింది'' అని ఆమె చెప్పారు. బీబీసీ నుండి వచ్చిన గుర్తింపు అనేక తలుపులు తెరిచింది. విజయాన్ని సాధించిన మొదటి ప్రాజెక్ట్‌లలో మొదటి ఉద్యమం 'నాట్ దట్ డిఫరెంట్' అనే కామిక్ పుస్తకం చిన్న పిల్లలకు ఆటిజం గురించి వివరించడానికి ఉద్దేశించబడింది. ''ప్రత్యేక అవసరాల పిల్లల తోబుట్టువులు, తల్లిదండ్రుల కోసం కూడా ఇది ఆటిజం వంటి కష్టతరమైన కాన్సెప్ట్ గురించి మాట్లాడటం సులభతరం చేస్తుంది'' అని పిల్లల కోసం డిజిటల్ ప్లాట్‌ఫారమ్ బుకోస్మియాతో కలిసి పుస్తకాన్ని రాసిన ముగ్ధ చెప్పారు.
సాధారణ పాఠశాలకు వెళ్లొచ్చు
ముగ్ధా ఇప్పుడు పాఠశాలలకు చేరుకోవడానికి, వారితో కలిసి న్యూరోడైవర్స్ పిల్లల గురించి అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ''ఈ రకమైన పిల్లలు కూడా సాధారణ పాఠశాలలకు వెళ్ళవచ్చు. తల్లిదండ్రులు కూడా దీనికి సిద్ధంగా ఉన్నారు. చాలా సార్లు తల్లిదండ్రులు తమ పిల్లలు అవాంఛిత విషయాలను నేర్చుకుంటున్నారని ఫిర్యాదు చేస్తారు'' అని ముగ్ధ చెప్పారు. యుకే నుండి మరో ఆటిజం కార్యకర్త డేమ్ స్టెఫానీ కూడా ముగ్దాతో కలిసి పని చేస్తున్నారు. ఆమె ప్రాజెక్ట్‌లలో ఒకదానికి నిధులు సమకూర్చారు. ''ఆమె చాలా సీనియర్ అయినప్పటికీ ఇప్పటికీ చాలా కూల్‌గా ఉంటారు. డేమ్ స్టెఫానీ తన 40 ఏండ్ల వయసులో తన ఆటిస్టిక్ కొడుకును కోల్పోయారు. కాబట్టి ఆమె, ఆమె బృందం ఆటిజంలో చాలా లోతుగా దిగబడి పని చేస్తున్నారు'' అని ముగ్ధ వివరించారు.
ఎంతో మందిని చూస్తుంటాము
బిజినెస్ జర్నలిస్ట్‌గా ఉన్న ముగ్దా అనేక మంది కార్పొరేట్ వాటాదారులు, సీఈఓలు, ఇతర నాయకులను కలుస్తుంది. ఇక్కడే ముగ్ధ పెద్ద మార్పును కోరుకుంటున్నారు. కార్పొరేట్ సర్కిల్‌లలో తాను ఎల్లప్పుడూ న్యూరోడైవర్సిటీ అంశాన్ని తీసుకువస్తానని ఆమె చెప్పారు. ''వికలాంగుల సంఘాలకు కార్పొరేట్ల నుండి అవకాశాలు దొరకడానికి సంవత్సరాలు పడుతుంది. కానీ రోజువారీ ప్రాతిపదికన, అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రులు/భార్యభర్తల సంరక్షణ లేదా ప్రత్యేక అవసరాల పిల్లలను కలిగి ఉన్న చాలా మంది వ్యక్తులను మీరు ఆఫీసుల్లో చూస్తారు. మెరుగైన సంరక్షకులను చేర్చుకోవడం మాత్రమే మహిళలు పనికి వెళ్లడానికి లేదా మెరుగ్గా పని చేయడానికి ఏకైక మార్గం'' అని ముగ్ధ అంటున్నారు.
వికలాంగుల సంక్షేమం కోసం
వైద్య ప్రయోజనాలు, అనువైన సమయాలు, రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు, కౌన్సెలింగ్ సెషన్‌ను విరాళంగా ఇవ్వడం వంటివన్నీ మహిళల వర్క్‌స్పేస్‌ను నిర్మించడంలో సహాయపడతాయని ముగ్ధ చెప్పారు. 2021లో ప్రభుత్వం వికలాంగుల కోసం కొత్త ముసాయిదా విధానాన్ని విడుదల చేసింది. ఇది వికలాంగుల సంక్షేమం కోసం బహుళ చర్యలను ప్రతిపాదిస్తుంది. అంతకుముందు వికలాంగుల హక్కుల చట్టం 2016 వైకల్యాల సంఖ్యను ఏడు నుండి 21కి పెంచింది. ఇందులో ఆటిజం, ఇతర న్యూరోడైవర్స్ పరిస్థితులు ఉన్నాయి. ముగ్దా పని ఇప్పుడు తల్లిదండ్రులతో కలిసి పనిచేయడం, వారితో వికలాంగుల అవకాశాల గురించి మాట్లాడటం.
ప్రతి ఒక్కరికీ ప్రత్యేక గుర్తింపు కార్డు
''UDID గురించి అవగాహన కల్పించడానికి మేము చాలా కృషి చేస్తాము. ఉద్యోగం చేయాలనుకునేవారు దరఖాస్తు ఎలా చేసుకోవాలి, దాని కోసం ఏం చేయాలి అనే విషయాలపై కూడా అవగాహన కల్పిస్తాము'' అని ముగ్ధ చెప్పారు. దివ్యాంగుల కోసం జాతీయ డేటాబేస్‌ను రూపొందించడానికి, వైకల్యం ఉన్న ప్రతి వ్యక్తికి ప్రత్యేక వికలాంగ గుర్తింపు కార్డును జారీ చేయడానికి అమలు చేయబడుతోంది. సంరక్షకుల కోసం పని చేయడం నుండి ఆ పిల్లల కోసం పుస్తకాలు తీసుకురావడం ఆమె రోజువారి పనిలో భాగంగా మారిపోయింది. ''ఒక తల్లి తాను చేసే యుద్ధంలో ఒంటరినని భావించకుండా నేను చేయగలిగినంత సాయం చేస్తాను'' అని ముగ్ధ ముగించారు.