Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రైతు అంటే మగవారే అని అందరూ అనుకుంటారు. కానీ జార్ఖండ్‌లోని కుంతీ జిల్లాలోని టోర్పా బ్లాక్‌లో మహిళా రైతులు తమ దిగుబడి పెంచుకునేందుకు కృషి చేస్తున్నారు. ఓ స్వచ్చంధ సంస్థ సహకారంతో విభిన్న పంటలు పండిస్తున్నారు. సామాజికంగా, ఆర్థికంగా తమ జీవితాల్లో మార్పును మనసారా ఆస్వాదిస్తున్నారు. ఆ మహిళా రైతుల కథ ఏమిటో మనమూ తెలుసుకుందాం.
ఇత్వారీ.. పుష్ప.. వీరిద్దరూ జార్ఖండ్‌లోని కుంతి జిల్లా టోర్పా బ్లాక్‌కు చెందిన రైతులు. ఇత్వారీ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ (FFO) చైర్‌పర్సన్‌గా కూడా ఉన్నారు. ఈ సంస్థ రైతులు తమ పంటలను పండించే విధానాన్ని మార్చడంలో, ఉత్పాదకతను పెంచడంలో, సామాజిక మార్పుతో పాటు మహిళా సాధికారతను సాధించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
గతంలో వలస వెళ్లేవారు
కొన్ని సంవత్సరాల కిందటి వరకు ఇత్వారీ, పుష్పతో పాటు ఇతర చిన్నకారు రైతులు తమ భూమి నుండి కేవలం నాలుగు నుండి ఆరు నెలల వరకు ఆదాయాన్ని పొందేవారు. వారు ఎక్కువగా ధాన్యాన్ని మాత్రమే పండిచేవారు. వ్యవసాయాన్ని మోనో క్రాప్ మోడల్‌కు పరిమితం చేశారు. ఆదాయం ఎక్కువగా వచ్చే కూరగాయల వంటి పంటలను పండించే అవకాశం వారికి తక్కువగా ఉండేది. మిగిలిన రోజుల్లో వారి కుటుంబాలను పోషించుకోవడానికి పంజాబ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలకు చివరకు గోవా వరకు కూడా చిన్న ఉద్యోగాల కోసం వెతుకుతూ వెళ్ళేవారు.
స్వయం సహాయక బృందాలు
పురుషులు గనులు, సొరంగాలు, పొలాల్లో పని చేయడం వంటి శ్రమతో కూడిన పనుల్లో చేరేవారు. మహిళలు తమ కుటుంబాలను పోషించడానికి ఇండ్లల్లో పని కోసం వెదుకుతుండేవారు. సొంత భూమి ఉండి కూడా వారు ఇలా పని కోసం ఇబ్బందులు పడుతుండేవారు. అయితే వారి భూమి ఎంతో సారవంతమైనది. ఈ ప్రాంతంలో వర్షపాతం కూడా తగినంత ఉంటుంది. కానీ దిగుబడి మాత్రం ఏడాదిలో కేవలం నాలుగు నెలలు మాత్రమే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్ల 90వ దశకం చివరిలో 2000వ దశకం ప్రారంభంలో PRADAN అనే స్వచ్చంధ సంస్థ ఈ ప్రాంతంలో మహిళా స్వయం సహాయక బృందాలను (SHG) ఏర్పాటు చేసింది. ఇది నేడు ఇత్వారీ దేవి, పుష్పా దేవి వంటి మహిళా రైతుల జీవితాలను మార్చింది.
మహిళా సాధికారత ద్వారా
''2020లో లాక్డౌన్ సమయంలో రైతులు పంటలు పండించలేకపోయారు. తమ ఉత్పత్తులను అమ్ముకోలేకపోయారు. మేము ప్రాజెక్ట్ లీప్ని ప్రారంభించాము. ఇది పుచ్చకాయల ఉత్పత్తిని పెంచడానికి, వారి పంట మొత్తం విక్రయించడంలో సహాయపడింది'' అని టోర్పాలోని ప్రదాన్ టీమ్ లీడ్ ప్రేమ్ శంకర్ వివరించారు. లీప్ మార్కెట్, మహిళా సాధికారత ద్వారా జీవనోపాధి పెంచే ప్రయత్నం జరిగింది. ఇది వాల్‌మార్ట్ ఫౌండేషన్ నుండి గ్రాంట్ ద్వారా అందించబడిన రెండు సంవత్సరాల ప్రాజెక్ట్. ఇది రాష్ట్రాల అంతటా 45,000 మంది మహిళా రైతుల (సుమారు 2,25,000 మంది జనాభా) జీవితాలను, జీవనోపాధిని ప్రభావితం చేసే లక్ష్యంతో ఉంది.
ఉత్పత్తి సమూహాలలో...
భారతదేశంలోని జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలను చేపట్టేందుకు LEAP SHG లలో భాగమైన మహిళలను అనధికారిక ఉత్పత్తి సమూహాలలో సేకరించడం ద్వారా వారికి మద్దతు ఇస్తుంది. ఈ అనధికారిక క్లస్టర్లు ప్రభుత్వ మద్దతు ఉన్న FPOలుగా పరిణామం చెందాయి. ''మహిళలు ఎఫ్‌పీఓలను ఏర్పాటు చేసుకునేందుకు వీలు కల్పించడం ద్వారా ప్రాంతీయ మార్కెట్లతో అనుసంధానం చేయడం, వారి ఇంటి వద్దనే నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయడం, ఉత్పత్తులను రవాణా చేసే విషయం కూడా సహాయం చేయడం ద్వారా వారి డబ్బు వారి ఖాతాల్లోకి సరైన సమయంలో చేరేలా చేశాము'' అని ప్రేమ్ శంకర్ జతచేశారు.
నిర్ణయాధికారం కల్పించడం
విలువైన పంటలను ప్రవేశపెట్టడం ద్వారా మహిళల జీవనోపాధిని పెంచడం, వైవిధ్యపరచడం అనే ఆలోచన ఉంది. ''మహిళలను చేరుకోవడం ద్వారా మేము వారి గృహాలపై కూడా ప్రభావం చూపుతున్నాము. నిర్ణయం తీసుకునే ప్రక్రియలో వారికి సాధికారత కల్పించడం ద్వారా వారికి లింగ వివక్షపై కూడా అవగాహనకల్పిస్తున్నాము. కుటుంబ ఆధారిత జీవనోపాధి ద్వారా మొత్తం ఇంటినే నడపగలిగే శక్తి మహిళల్లో ప్రారంభమైంది'' అని ప్రేమ్ శంకర్ పేర్కొన్నారు.
మార్పులో ముందున్న మహిళలు
ఇత్వారీ దేవి ఇప్పుడు బలీయమైన నాయకురాలు. 2,296 మంది సభ్యులతో కూడిన టోర్పా బ్లాక్ FPO నిర్వహణను పర్యవేక్షిస్తుంది. ఆమె 2005లో యువ వధువుగా కుంతికి మారిన సమయాన్ని ఇలా గుర్తుచేసుకుంది. ''అప్పట్లో మేము వరి, పప్పులను మాత్రమే పండించేవాళ్ళం. ఆదాయం చాలా తక్కువ వచ్చేది. మా జీవనోపాధి కొన్ని నెలలు మాత్రమే ఉండేది. ఉప్పు, నూనె కొనడానికి కూడా డబ్బు ఉండేది కాదు. రోజుకు రెండు సార్లు మాత్రమే కొద్ది కొద్దిగా తినేవాళ్ళం. వ్యవసాయ కుటుంబాల నుండి వచ్చిన మాకు వేరే ఉద్యోగం తెలియదు. మాలాంటి రైతులు జీవనోపాధి కోసం వలస వెళ్ళక తప్పేది కాదు''అని ఆమె చెప్పారు.
అన్ని రంగాలలో మద్దతు
''ప్రదాన్ జోక్యం తర్వాత మేము ధాన్యంతో పాటు అల్లం, టొమాటో, మొక్కజొన్న, బ్రోకలీ, ఇతర కూరగాయలను పండిస్తాము. శిక్షణా కార్యక్రమాలు మాకు సరైన పంట పద్ధతులు, హైబ్రిడ్ విత్తనాలు మంచి పంటల కోసం సహాయపడింది'' అని ఆమె జతచేస్తుంది. టోర్పా బ్లాక్ FPO ఛైర్‌పర్సన్‌గా ఇత్వారీ రైతులను జిల్లా పరిపాలనతో కలుపుతుంది. సహకార సజావుగా పనిచేయడానికి అన్ని రంగాలలో మద్దతునిస్తుంది. ఎనిమిది కుటుంబాలతో కూడిన తన ఉమ్మడి కుటుంబానికి చెందిన 84 ఎకరాల భూమిలో పుష్పాదేవి పనిచేస్తోంది. భూమి విభజన జరగకపోవడం, కుటుంబ సభ్యులు కలిసి పని చేయడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
పని పట్ల గౌరవం పెరిగింది
''ఇంతకుముందు మేము ఎక్కువగా ధాన్యం, పప్పుధాన్యాలు పండించాము, కానీ FPOలో చేరిన తర్వాత పచ్చి బఠానీలు, క్యాలీఫ్లవర్, ఆలూ, ఉల్లిగడ్డ, టమోటాలు పండించగలుగుతున్నాము'' అని ఆమె చెప్పింది. ఉత్పాదకత, ఆదాయంలో పెరుగుదల మాత్రమే కాకుండా కనిపించే ఇతర మార్పు ఏమిటంటే ఇప్పుడు మహిళలు ముందుండి వ్యవసాయాన్ని నడిపిస్తున్నారు. ఆ మహిళలు వారు చేస్తున్న పని పట్ల ఎంతో గౌరవం ఉందని ఇత్వారీ చెప్పారు.
బ్యాంకు ఖాతాలు తెరిచి
''ఇంతకుముందు వ్యవసాయం, పాలన విషయాలపై మహిళలు తమ అభిప్రాయాలను చెప్పలేకపోయేవారు. ఇప్పుడు మేము మా సొంత బ్యాంకు ఖాతాలను తెరిచి మా ఆదాయాన్ని కళ్ళారా చూసుకుంటాము. గ్రామసభలు, పంచాయతీల్లో కూడా మాకు ప్రాతినిథ్యం ఉంది'' అని పుష్ప చెప్పారు. ప్రేమ్ శంకర్ ప్రకారం టోర్ప బ్లాక్‌లోని మహిళలు ఇప్పుడు సామూహిక, సమకాలీకరించిన వ్యవసాయ ప్రయోజనాలను పొందుతున్నారు. రూ. 1 కోటి టర్నోవర్‌ను చూస్తున్నారు. ఈ స్త్రీలు తమ జీవితాలను మాత్రమే కాదు ఇతరుల జీవితాలను కూడా ఒక పంటగా మార్చుకుంటున్నారు.