Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'బతుకమ్మ' అనే మాటలో బతుకు ఔచిత్యం దాగి ఉంది. బతుకునిచ్చే తల్లి బతుకమ్మగా తెలంగాణ రాష్ట్ర పండుగ. తెలంగా ప్రాంతంలో అద్భుతంగా జరుపుకునే బతుకమ్మ. గల్లీ నుండి ఢిల్లీదాకా, దేశ విదేశాల్లో ఇక్కడి ప్రజలు నివసించే ప్రతి చోట జరుపుకుంటూ, మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని, మన ఆచార వ్యవహారాలను ప్రపంచానికి చాటడం విశేషం. బతుకమ్మ బతుకు పండుగ. మన బతుకుల్లోంచి పుట్టిన పండుగ. మనుషుల మధ్య మానవ సంబంధాల్ని పెంచుతూ ప్రకృతి ఆరాధనగా సాగే బతుకమ్మ పండుగకు ఎంతో విశిష్టత ఉంది.
జానపద విజ్ఞానంలో గేయ సాహిత్యానికి ప్రాధాన్యం ఉంది. జానపద గేయ సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన ఘనత బతుకమ్మ పాటకే దక్కింది. జానపదులు, పల్లీయులు, వ్యవసాయ ప్రధాన వృత్తిగా జీవించే వారు. నేల తల్లిని నమ్మి బతికేటోళ్ళు. వర్షాలు చిరు జల్లులుగా కురవడమే కాదు, వాగులు, కుంటలు, చెరువులు నీటితో నిండి కళకళలాడే భద్రపద, ఆశ్వజమాసాల్లో బొడ్డెమ్మ, బతుకమ్మ పండుగలు జరుపుకోవడం విశేషం. ప్రకృతిలో విరగబూసిన రకరకాల పూలతో బతుకమ్మను పేర్చడంలో పూలనీ దేవతగా కొలవడం గమనిస్తాం.
స్త్రీ సృష్టి రూపం
ఇక బతుకమ్మ పండుగ స్త్రీల పండుగ. స్త్రీ మూర్తికి చేసిన పట్టాభిషేకం బతుకమ్మ. బతుకమ్మ రూపాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం. బతుకమ్మ త్రికోణ ఆకారంలో పూలగోపురంగా ఉంటుంది. త్రికోణం సంతానసాఫ్యలత సంకేతం. దేవి భాగవతం, మార్కండేయపురాణం లాంటి పురాణాలే కాదు, మనిషి జీవ పరిణామ క్రమాన్ని సిద్ధాంతాలను గమనిస్తే 'సృష్టి' దేవి ద్వారా సృష్టించబడింది. తొలి యుగాల్లోని పురాతన వస్తువులపై, కట్టడాల్లోని బొమ్మల ఆధారంగా కూడా స్త్రీ సృష్టి రూపంగా, సంతాన ప్రధాతగా కనిపిస్తుంది. ఇక దేవి పలు అవతారాల్లో దుష్టసంహారం చేయడం, శిష్టులను రక్షించడం జరిగింది. దసరా పండుగ దేవీ శరన్నవరాత్రుల వెంట బతుకమ్మ పండుగ సాగడం పల్లీయులు, ఆచార వ్యవహారాలపట్ల నమ్మకం ఉన్న కుటుంబాలు బతుకమ్మకు తమ వంతుగా పలు నైవేద్యాలను తాము పండించే పంటలైన సజ్జ, జొన్న, వరి, నువ్వులతో చేస్తూ అర్పించడం, ప్రకృతి నుండి పొందిన పూలను, పాడి పంటలను తిరిగి ప్రకృతికి బతుకమ్మ రూపంలో అర్పించడమే నిండైన మనసుతో, కల్లాకపటం ఎరుగని మనస్తత్వంతో జీవించే పల్లెజనం. ముఖ్యంగా స్త్రీలు బతుకమ్మ పండగను, బతుకమ్మ ఆటపాటల్ని ఎంతో ఆహ్లాదంగా, ఆనందంగా జరుపుకుంటారు.
ప్రత్యేక చిహ్నం
బతుకమ్మ స్త్రీల సంగీత, సాహిత్య, నృత్య కళారూపంగా చెప్పవచ్చును. బతుకమ్మ పండుగొచ్చిందంటే ముందు రోజు నుంచే ఇంటిల్లిపాదికి సందడి. ఇంటి మగవారు ఊరి బయటికి వెళ్ళి తంగేడు, జిల్లేడు, గునుగు, ముత్యాలపూలు, పాటుకట్ల, కాకర, గుమ్మడి, గుల్మాల, సీతజడ, బంతి... ఇలా అన్ని పూవులు ఏరుకొచ్చే హడావిడిలో ఉంటారు. ఆ ఇంటి ఇల్లాలు, బిడ్డలు వంటలు, నైవేద్యాల తయారు చేయడంలో బిజీగా ఉంటారు. అయితే తెలంగాణ రాష్ట్ర పండుగ, తెలంగాణ ప్రత్యేక చిహ్నమైన బతుకమ్మ పండుగ (భద్రపద బహుళపంచమి నుండి అమావాస్యకు ముందు రోజు వరకు 'బొడ్డెమ్మ' పండుగగా కొన్ని జిల్లాలో ప్రత్యేకంగా జరుపుకుంటే) అమావాస్య రోజు 'పెత్రమావాస్య'గా ''ఎంగిలిపూవు బతుకమ్మ'గా జరుపుకుంటారు. దీన్నే పితృ అమావాస్యగా అని కూడా అంటారు. తరాలు మారుతున్న కొద్ది పెద్దవారిని మరిచి పోతున్న కాలంలో తెలంగాణ ప్రజలు 'ఎంగిలిపూవు బతుకమ్మ' రోజు పెద్దలను పూజించడం ఇక్కడి స్త్రీల, ప్రజల సంప్రదాయ నిబద్ధత ఆదర్శనీయం.
స్త్రీని ఉన్నతంగా నిల్పుతూ
ఒక స్పష్టమైన ఆలోచనా విధానాన్ని, పద్ధతులను ఒక తరం ఇంకొక తరానికి అందించేది 'ఆచారం'. బతుకమ్మ పండుగ ఆచారానికి ప్రతీక. తమ సౌభాగ్యాన్ని, సంతానాన్ని, ఆయురారోగ్యాలను, ధన సంపదలను కాపాడుతూ, పెంపొందించాలని బతుకమ్మ పండుగ వేళ లక్ష్మీ, గౌరీ, వాణి, త్రిశక్తి రూపిణిగా కొలువబడుతుంది. సున్నితమనస్కులైన స్త్రీలను పూమాలలతో పోల్చినవారున్నారు. బతుకమ్మ పండుగ, బతుకమ్మ పేర్చే విధానం, ఆటపాటలు అన్నీ స్త్రీని ఉన్నతంగా నిల్పుతూ ఉన్నతోన్నత కేతనాన్ని ఎగురవేసింది.
ఉయ్యాల పాటలుగా...
బతుకమ్మ పండుగ వేళ పాడే బతుకమ్మ పాటలు ఆశువుగా స్త్రీల ద్వారా ప్రచారమైన మౌఖిక సాహిత్యం. దారి జీవితంలో ఎదురయ్యే, ఆచరించే విధివిధానాలతో పాటు, వారు విన్న పౌరాణిక, చారిత్రక, సామాజిక అంశాలతో పాటు వాస్తవ సంఘటనలు బతుకమ్మ ఉయ్యాల పాటలుగా మలుచుకుంటారు. బతుకమ్మ పాటలో సంగీతం ఉంది. చిక్కని చక్కని సహజమైన సాహిత్యం ఉంది. 'ఉయ్యాల' అనే ఆవృతం ఈ పాటలకు శృతిలయను అందిస్తుంది. 'ఉయ్యాలలో' ఆవృతంతో పాటు 'కోల్', 'చందమామ' మొదలైన ఆవృతాలను చూడవచ్చు. అందరూ కలిసి ఎంతో మనోరంజకంగా పాడే ఈ పాటల్లో వ్యవసాయం, కలుపు పాటలతో పాటు వృత్తిపరమైన గేయాలున్నాయి. అన్నాచెల్లెళ్ళ అనుబంధాలను, కుటుంబ బాంధవ్యాలను తెలిపే పాటలు కోకొల్లలు.
స్త్రీల సమైక్యతకు నిదర్శనం
బతుకమ్మ స్త్రీల నృత్యవిన్యాసాన్ని సహజంగా, ఏ గురువు దగ్గర కూడా నేర్వని క్రమశిక్షణ కల్గిన అడుగుల సవ్వడి. చప్పట్ల దురువు. ఒక్కటేమిటి, ఇద్దరేంటి ఊరి వారంతా లేదా కాలనీవాసులంతా కలిసి సమిష్టిగా ఊరేగింపుగా ఒక చోట చేరి ఆడిపాడటం నిజంగా అద్భుతమైన విషయం. అంతేకాదు 'బతుకమ్మ పాటను' రాగ యుకత్తంగా పాడే స్త్రీల ఏ వయసు వారైనా, ఏ ఇంటి వారైనా వారికే పెద్దపీట వేయడం స్త్రీల సమైక్యతకు, సమిష్టి శక్తికి తార్కాణం. ఎన్నో స్త్రీల పత్యేకతల గుర్తింపుకు నిదర్శనం బతుకమ్మ పండుగ. ఆట, పాటలతో పండుగ జరుపుకునే విధానం.
విజేతగా నిల్పిన ఉద్యమస్ఫూర్తి
సంతోషం, కోరికలే కాదు మహిళలకు, కన్నె పిల్లలకు ఎదురయ్యే ఎన్నో సమస్యలు ఈ పాటల్లో చోటు చేసుకున్నాయి. నిజామ్ కాలం నుండి నేటి వరకు వీళ్ళు ఎదుర్కొంటూ ఎదిరించి విషయాలు, పరిష్కారాలు కూడా ఉండటం కేవలం జానపద మనసున్న స్త్రీలకు మాత్రమే సాధ్యం అనవచ్చు. ఒక పూల పరిమళం బతుకమ్మ. పంటల పరవశం బతుకమ్మ. విజేతగా నిల్పిన ఉద్యమస్ఫూర్తి బతుకమ్మ. నిజంగా బతుకునిచ్చే బతుకమ్మ తల్లికి వందనం. అభివందనం. మన ప్రతి ఆడపిల్లను పుట్టనిద్దాం.. బతకనిద్దాం... చదవనిద్దాం.. ఎదగనిద్దాం...
కన్యాశుల్కం, సతీసహగమనం నుండి బయటికి వచ్చిన మహిళకు చదువు కావాలని పూనుకోవడం జరిగింది. నేడు స్త్రీలు ఎంతో పెద్దపెద్ద వాణిజ్యాలలో, అన్ని రంగాల్లో ముందుకు వచ్చారు. అయినప్పటికి పెండ్లి సంతలో, కట్పను బేరానికి బలి అవుతూనే ఉన్నారు.
ఎన్ని చదివిన గాని ఉయ్యాలో ఏమి చేసిన గాని ఉయ్యాలో
ఏ చోట చూసిన ఉయ్యాలో కట్పను హత్యలు ఉయ్యాలో
మారాలి మారాలి ఉయ్యాలో మనమంత మారాలి ఉయ్యాలో
ఈ ఇంటి బిడ్డ ఉయ్యాలో ఓ ఇంటి కోడలు ఉయ్యాలో
ఒక ఇంటి బిడ్డ ఉయ్యాలో మన ఇంటి కోడలు ఉయ్యాలో
ఈనాటి అత్త ఉయ్యాలో ఓనాటి కోడలు ఉయ్యాలో
ఇంటికి వెలుగంటు ఉయ్యాలో కంటికి వెలుగంటు ఉయ్యాలో
పెద్దలు చెప్పిన ఉయ్యాలో మాట తప్పుకాదు ఉయ్యాలో
కట్నంబు పేరిట ఉయ్యాలో హింసింపరాదు ఉయ్యాలో
తరుణి కంట నీరు ఉయ్యాలో పెట్ట నివ్వగరాదు ఉయ్యాలో
ఆడవారు అయినా ఉయ్యాలో మగవారు అయిన ఉయ్యాలో
అన్నింట ఇద్దరు ఉయ్యాలో సమానమేయమ్మ ఉయ్యాలో
కట్నంబు పేరిట ఉయ్యాలో హింసించ చూసిన ఉయ్యాలో
చట్టంబు చేతిలో ఉయ్యాలో శిక్షంపబడుదురు ఉయ్యాలో
ఆడపిల్లకు రక్ష ఉయ్యాలో చట్టంబు ఉన్నది ఉయ్యాలో
ఈ విధంగా స్త్రీ సమాజంలో ఎదుర్కొనే అనేక సమస్యలు బతుకమ్మ పాటలుగా కూర్చుకొని పాడుతుంటారు.
పల్లవి: పచ్చపచ్చగా నవ్వుతుంటది
బాట వెంట బహుసక్కగుంటది
తెలంగాణ తల్లికి సిగపూవునంటది
బతుకమ్మ ఒడిలోన ఓలలాడుతది
అనుపల్లవి: తంగేడు పూవు తల్లిపూవురా
తరతరాల మన కలల పంటరా ||పచ్చ||
చరణం: తీరొక్క పూలతో బతుకమ్మ పేర్చండి
పూవులన్నింటా రారాణి వంటది
సౌభాగ్యమిచ్చేటి పసుపువన్నెతో
తలచిన తల్లికి కొరతలేదంటది
తంగేడు పూవు తల్లిపూవురా
తరతరాల మన కలల పంటరా ||పచ్చ||
చరణం: విత్తనాలు నాటి సాగు ఎంతో చేసే
రెక్కల కష్టంబు వలదు అంటది
మట్టిని నమ్మి మొలకలేస్తది
ఎన్నెన్ని వరాలు ప్రకృతిలో వున్నా
పచ్చంగ నవ్వంగ పసుపునంటది ||తంగేడు|| ||పచ్చ||
చరణం: పిల్లపాపల్లా, పాడిపంటలా
పారేటి చెరువుల్ల, సాగేటి వాగుల్ల
నిండైనరూపమే తానని అంటది
బతుకమ్మ తల్లికి పిలిచి ఏటమేసి
సంక్రాంతి వేళల్ల సాగుతుంటది ||తంగేడు|| ||పచ్చ||
వ్యవసాయ ప్రధానమైన తెలంగాణ ప్రాంతంలో పంటపండితేనే పొట్టడుస్తుంది. ఆడపిల్ల తన పుట్టింల్లు పాడిపంటలతో ఉండాలని కోరుకుంటూ ఇలా పాడుతుంది.
కట్టెంటబోయేటి ఉయ్యాలో బండ్లెవరిబండ్లు ఉయ్యాలో
కట్టెంటబోయేటి ఉయ్యాలో జొన్నాల బండ్లు ఉయ్యాలో
జొన్నాల బండ్లమ్మ ఉయ్యాలో అన్నాల బండ్లు ఉయ్యాలో
అంటూ సాగే పాటలో ప్రతి పనిలో తాను నిలబడతానని తెలుపుతుంది.
- డాక్టర్ బండారు సుజాత శేఖర్
9866426640