Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గతంలో పూచిక పుల్లలతో కుట్టిన విస్తరాకులలో భోజనం చేసేవారు. లేదంటే పచ్చటి అరిటాకు పరిచి పీటలు వేసి భోజనం వడ్డించేవారు. ఇప్పుడు కాలం మారింది. చెట్లు అందుబాటులో లేకపోవడం, వేగవంతమైన జీవితాల వల్ల మన జీవితాల్లోకి పేపర్ ప్లేట్లు వచ్చేశాయి. టిఫిన్లు, స్నాక్స్, స్వీటు హాటు వంటివన్నీ పేపర్ ప్లేట్లలోనే పెట్టేస్తున్నారు. ఇలా మన జీవితాల్లోకి వచ్చిన చిన్న చిన్న పేపర్ ప్లేట్లు ప్రతి ఇంటా కనిపిస్తున్నాయి. వీటి తయారీ కూడా కుటీర పరిశ్రమలుగా వర్ధిల్లుతున్నాయి. వక్కచెట్లతో, అరటినారతో తయారయ్యే భోజన ప్లేట్లు మిషన్ల మీద తయారవుతున్నాయి. అనేక చెట్లనారతో తాళ్ళు తయారయినట్టు ప్లేట్లు కూడా తయారవుతున్నాయి. బఫేలలో మాత్రం పలచని ప్లేట్లతో ఇబ్బంది పడుతున్నారు. ప్లేటు పట్టుకొని ఆహార పదార్థాలు వెతుక్కుని తినటమనేది ఒక యుద్ధంలా అనిపిస్తుంది. మనం మాత్రం ఈ పేపర్ ప్లేట్లతో కొన్ని కళాత్మక కృత్యాలు చేసేద్దాం.
తోరణం
ఒకప్పుడు మామిడి ఆకులు, బంతిపూలు ద్వారాలకు తోరణాలుగా కట్టుకునేవారు. ఇప్పుడేమో పూసలు, తళుకులు, గవ్వలు వంటి వాటితో ఎన్నో రకాల హ్యాండీ క్రాఫ్ట్స్ తయారు చేసి అమ్ముతున్నారు. ప్లాస్టిక్ మామిడి ఆకులు, ప్లాస్టిక్ బంతిపూలు దొరుకుతున్నాయి. లేపాక్షిలో కూడా బోలెడు రకాలు దొరుకుతున్నాయి. మనమయితే పేపర్ ప్లేట్లతో తోరణాలు తయారు చేద్దాం. ఏడెనిమిది పేపర్ ప్లేట్లను తీసుకోవాలి. గాజులు తీసుకొని దాని చుట్టూ బట్టతో చుట్టేయాలి. మంచి డిజైను బట్టను ఉపయోగిస్తే బాగుంటుంది. ఒక్కొక్క ప్లేటులో మధ్యలో ఒక్కో గాజు చక్రాన్ని అతికించాలి. ఇప్పుడు పేపర్ ప్లేటు చుట్టూతా స్కెచ్ పెన్నుతో డైమండ్ ఆకారంలో రంగును వేయాలి. అదొక డిజైన్ అవుతుంది. ఇప్పుడు గాజు చుట్టూతా ముత్యాలు, పూసలు అతికించుకోవాలి. ప్లేటంతా డిజైన్ వచ్చేలా చేసుకోవాలి. ఆ తర్వాత న్యూస్ పేపర్‌ను వెడల్పుగా మడవాలి. బాగా మందంగా మడవాలి. దీనిపైన డిజైన్ గిఫ్ట్పేపర్ను చుట్టి అతికించుకోవాలి. ఇప్పుడు పేపర్ ప్లేట్లను వరసగా దాని మీద పెట్టి అతికించుకోవాలి. న్యూస్ పేపర్ రెండు చివర్లు దారంతో కట్టాలి. ఊలు దారానికి గంటలు పూసలు ఎక్కించి పేపర్ ప్లేటుకు కింద వేలాడేలా కుట్టాలి. చాలా బాగుంటుంది.
ఫొటో ఫ్రేమ్
రెండు నలుచదరపు గట్టి అట్టల్ని తీసుకోవాలి. ఒక అట్టకు నలుపు రంగు డ్రాయింగ్ షీటును అతికించాలి. మరో అట్టకు మధ్యలో ఫొటో పట్టేంత స్థలాన్ని కత్తిరించి తీసేయాలి. దీనికి కూడా నలుపు రంగు డ్రాయింగు షీటును అతికించుకోవాలి. కత్తిరించిన అట్టను, పూర్తి అట్ట పైభాగాన పెట్టి రెండూ కలిపి అతికించేయాలి. ఇప్పుడు నాలుగైదు పేపర్ ప్లేట్లను తీసుకొని వాటికి ఫెవిక్రిల్ కలర్స్ వేసుకోవాలి. అంటే ఎరుపు, పసుపు వంటి రంగులైతే బాగుంటుంది. రంగులు బాగా ఎండాక ఒక్కొక్క ప్లేట్‌ను వలయాకారంలో కత్తిరించడం మొదలుపెట్టాలి. ఎక్కడా తెగిపోకుండా చివరి దాకా కత్తిరించాలి. చిన్నతనంలో మనమంతా ఉట్టిని తయారు చేసి ఆడుకునే వాళ్ళం కదా! అదే రకంగా కత్తిరించుకోవాలి. ఇలా కత్తిరించాక ఆ చీలికను వరసగా చుట్టుకుంటూ రావాలి. ముద్ద గులాబీలా కనిపిస్తుంది. మిగతా ప్లేట్లను కూడా ఇలాగే చుట్టుకోవాలి. ఐదారు పువ్వులు చేసి పెట్టుకున్నాం కదా! ఇందాక తయారైన నల్లటి షీటుతో కప్పబడిన అట్ట మీద పేపర్ ప్లేట్ల పువ్వుల్ని అతికించాలి. అక్కడక్కడ రాళ్ళు, తళుకులు, పూసలు అతికించాలి. మధ్యలో ఫొటో కోసం వదిలిన స్థలంలో ఫొటోను పెట్టుకొని టేబుల్ మీద పెట్టుకోవచ్చు. బాగుందా ఫొటో ఫ్రేమ్.
పూలు
పేపర్ ప్లేట్ చుట్టూ రెక్కల్లాగా కత్తిరించి దానికి లేత గులాబీ, లేత నీలం వంటి రంగులు వెయ్యాలి. మరొక ప్లేట్‌ను తీసుకొని పేపర్ ప్లేట్ మధ్య భాగం ఉంచి చుట్టూ ఉన్న భాగాన్ని కత్తిరించాలి. ఇప్పుడు దీనికి కూడా రెక్కలు కత్తిరించాలి. పెద్ద ప్లేట్ మధ్య భాగంలో దీన్ని పెట్టి అతికించాలి. మధ్య భాగంలో ఏదైనా విత్తనాలు అతికించాలి. లేదా రంగు కాగితాలను చిన్న ముక్కలకుగా కత్తిరించి వాటిని అతికించాలి. ఇలా నాలుగైదు పువ్వులు చేసి గోడకు అతికించుకుంటే బాగుంటుంది.
గడియారం
ఇది చాలా సులభంగా చేయవచ్చు. పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని మనం చేస్తూ వాళ్ళతో చేయిస్తూ ఉంటే పిల్లలకు కూడా అలవాటవుతాయి. వాళ్ళకు క్రియేటివిటీని నేర్పించినట్టవుతుంది. గట్టి కార్డ్బోర్డును తీసుకుని దానిని గుండ్రంగా కత్తిరించి పెట్టుకోవాలి. గుండ్రని పేపర్ ప్లేటును తీసుకొని దానికి ఎరుపు రంగును వేయాలి. రెండు వైపులా రంగును వేయాలి. దీని మీద గుండ్రంగా ఒకటి రెండు మూడు అంటూ పన్నెండు అంకెలు పెయింట్ చెయ్యాలి. రెండు కాగితం ముళ్ళను కత్తిరించాలి. అంతే గడియారం తయారవుతుంది.
ముత్యపు చిప్పలు
ఇది కూడా పిల్లలతో చేయిస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలా సులభంగా చేయవచ్చు. పిల్లలతో తయారు చేయించి వాళ్ళకి ముత్యపు చిప్పల గురించి విజ్ఞాన విషయాలు చెప్పినట్లైతే రెండు విధాలుగా నేర్చుకున్నట్టు అవుతుంది. సముద్రంలో ఉండే ముత్యపు చిప్పల నుంచి ముత్యాలు తయారవుతాయనీ, అవి కూడా ఒకర రకం జీవులనీ తెలుస్తుంది. ఇప్పుడు పేపర్ ప్లేటును సగానికి మడిచి దాని మీద ముత్యపు చిప్ప ఆకారంలో కత్తిరించుకోవాలి. ఇది రెండు పొరల్లో వస్తుంది. దీని మీద లైన్లుగా గీతలు గీసుకొని స్కెచ్ పెన్‌తో సున్నాలు చుట్టి రంగులు నింపుకోవాలి. ఆ రంగు తడిగా ఉండగానే దానిపై బంగారు రంగు చెమ్కీ చల్లుకుంటే మెరుస్తుంటుంది. ముత్యపు చిప్ప మధ్యలో ముత్యం ఉన్నట్టుగా కాగితం ఉండను పెట్టాలి.
పర్సు
కొద్దిగా లోతు ఉన్న పేపర్ ప్లేటును తీసుకొని మధ్యకు కత్తిరించాలి. దీనిని మరొక లోతు ప్లేటుకు అతికించాలి. అంటే పర్సులా ఉంటుందన్న మాట. వెనక నున్న ప్లేటుకు రెండు చెవులు అతికించాలి. ముందున్న సగం ప్లేటుకు 'కళ్లు,ముక్కు, నోరు పెట్టాలి. అంటే కుందేలు అకారంలో తయారయ్యిందన్నమాట. కుందేలు ఆకారపు పర్సు అమరింది. దీంట్లో చిన్న చిన్న సామాన్లు పెట్టుకోవచ్చు. దువ్వెనలు, క్రీములు వంటివి పెట్టుకుంటే బాగుంటుంది.