Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లేడీ డాక్టర్ అనగానే ''మహిళలు వైద్య విద్య చదువుకుని డాక్టర్లయ్యారు, అందులో ప్రత్యేకత ఏముంది'' అనిపిస్తుంది ఈ తరానికి. కానీ ఆనాటి సమాజంలో లింగ వివక్ష, స్త్రీ విద్యపై నిషేధం, బాల్య వివాహాలు, సమాజ కట్టుబాట్లు వాళ్ళను ఎలా అణచివేయాలని ప్రయత్నించాయో తెలుసుకుంటే ఆ ప్రత్యేకత ఏమిటో అర్థమవుతుంది. ఒక్క మనదేశంలో మాత్రమే కాదు వివిధ దేశాలలోని లేడీ డాక్టర్లు చదువుకుని ఆ స్థితికి చేరుకోవడానికి ఎలాంటి అవరోధాలను అధిగమించారో తెలుసుకోవాలి. వైద్య విద్య కోసం ఆనాడు స్త్రీలు ఎంత ఆరాటపడ్డారో తెలిపే ఒక అద్భుతమైన సంఘటన ఇంగ్లాండులో జరిగింది. స్త్రీగా జన్మించి కూడా, వైద్య విద్య కోసం, వైద్యుడిగా పని చేయడం కోసం ఆజన్మాంతం పురుషుడిగా చలామణీ అయిన మహిళా డాక్టర్ జేమ్స్ బారీ అలాగే విద్యను అభ్యసించినా వైద్య సేవలు చేయనీయకుండా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్న డా.ఎలిజబెత్ బ్లాక్ వెల్ స్ఫూర్తి దాయక జీవిత పరిచయం...
19వ శతాబ్దం మధ్యలో ఇంగ్లండులోని ప్రముఖ సర్జన్లలో డా.జేమ్స్ మిరండా బారీ ఒకరు. పెడసరంగా ప్రవర్తించే ఈ మిలిటరీ డాక్టర్ ముక్కోపి అనే పేరుతో పాటు తను చేసిన సేవలకు ఉత్తమ సర్జన్‌గా అభినందనలు అందుకున్నారు. 1965లో బారీ మరణానంతరం ఆ డాక్టర్ 'మగ' కాదు 'ఆడ' అనే రహస్యం బయటపడింది. బారీ ఎందుకంత సాహసం చేయవలసి వచ్చింది.
మహిళలకు ప్రవేశం లేదు
బారీ అసలు పేరు మార్గరెట్ ఆన్ బల్కిలీ. సుమారు 1792 ప్రాంతాలలో ఐర్లాండ్‌లో పుట్టింది. తల్లి మేరీ ఆన్ బల్కిలీ భర్త నుంచి విడిపోయి ఒంటరిగా జీవిస్తోంది. ఆ కాలంలో వైద్య కళాశాలల్లో మహిళలకు ప్రవేశం లేదు. ఆమెకు వైద్య విద్య అభ్యసించాలని, వైద్య సేవలు అందించాలని అమితమైన ఆసక్తి. అందుకే ఆమె తన కోరిక నెరవేర్చుకోవడానికి పురుషుడిగా నటించక తప్పలేదు.
ఎవర్నీ అనుమతించేది కాదు
బారీ ఎడింబరో విశ్వవిద్యాలయంలో చేరినపుడు వామన రూపంతో చుబుకం మీద రోమాలు లేకుండా జాగ్రత్తపడి అసలు వయసుకంటే చిన్నవాడిలా కనిపించడానికి ప్రయత్నించింది. ఈ విషయంలో ఆమెకు మేనమామ, ఆయన స్నేమితులు తగిన సాయం చేశారు. బట్టలు మార్చుకునేటప్పుడు తన గదిలోకి ఎవర్నీ అనుమతించేది కాదు. 50 ఏండ్లపాటు ఆమె తనకు విశ్వాసపాత్రుడైన ఒక సేవకుణ్ణి నియమించుకుంది. అతను ప్రతిరోజూ బారీ దేహాన్ని కప్పుకోవడానికి ఆరు చిన్న తువాళ్ళు అందించేవాడు. మరణానంతరం తన దేహాన్ని ఎవరూ పరిశీలించడానికి వీల్లేదని, ఒక దుప్పట్లో చుట్టి పూడ్చి పెట్మనీ ముందుగానే ఆదేశించింది. బారీ అనూహ్యంగా తన లక్ష్యాన్ని సాధించింది. భారత్, కేప్ టౌన్, కెనడాలలో ఉద్యోగం చేసింది. 1826లో ఆఫ్రికాలో మొదటి శస్త్రచికిత్స చేసింది. 1865లో మరణించింది.
మొదటి లేడీ డాక్టర్
జేమ్స్ బారీ మరణశయ్యపై ఉన్న రోజుల్లోనే మరో దేశంలో అష్టకష్టాలూ పడి చదివిన డిగ్రీతో మొదటి లేడీ డాక్టర్ రోగుల కోసం పడిగాపులు కాస్తోంది. వాళ్ళు రావడం లేదు. ఆమె పట్టు విడవడం లేదు. ఆమె పేరే ఎలిజబెత్ బ్లాక్ వెల్. అమెరికాలో పుట్టింది. తండ్రి పోవడంతో కుటుంబ భారం మోసింది. రోజుకు 12 గంటలు పని చేసేది. 29 కళాశాలలు వైద్య విద్యను తిరస్కరించాయి. ఏదోలా సీటు సంపాదిస్తే పునరుత్పత్తి వ్యవస్థపై అధ్యాపకుల తుంటరి భాష, ఒక పాపకు కంటివైద్యం చేస్తూ తన కన్ను కోల్పోవడం, ప్రేమ విఫలం కావడం, మహిళా డాక్టర్లు గర్భస్రావాలు చేస్తారనే ప్రచారంతో ప్రాక్టీస్ లేకపోవడం వంటి సమస్యలెన్నో ఆమెను వేధించాయి. అయినా గెలిచింది. ఒక వైద్య కళాశాలలో ప్రొఫెసర్ ఉద్యోగం సంపాదించుకుంది. ఆద్యంతం ఆసక్తికరమైన చరిత్ర ఎలిజబెత్‌ది.
ఛాందస భావాలకు అతీతంగా
ఈమె 1821లో బ్రిస్టల్‌లో హనా, శామ్యూల్ బ్లాక్వెల్ దంపతులకు పుట్టిన 11 మంది పిల్లల్లో నాలుగో సంతానం. ఆమె తల్లిదండ్రులకు క్రైస్తవ మతాచారాల పట్ల భక్తి శ్రద్ధలు ఎక్కువైనా సంఘసంస్కరణ భావాలు గలవారు. వారు పిల్లల్ని ఛాందస భావాలకు అతీతంగా పెంచాలని 1832లో అమెరికా వెళ్లిపోయారు. ఆ కాలంలో బానిస విముక్తి గురించి ప్రస్తావించడం న్యూయార్క్‌లో చాలా ప్రమాదం. అలాంటి రోజుల్లో శామ్యూల్ బానిసత్వ సమూల నిర్మూలన వాదిగా మారిపోయాడు.
కుటుంబానికి ఆసరాగా
తర్వాత కాలంలో అతని కుటుంబ ఆర్థిక పరిస్థితి దిగజారింది. వ్యాపారం దెబ్బతింది. 1838లో 20 డాలర్లనూ, ఆరేళ్ళ పసిబిడ్డనూ కుటుంబానికి అప్పజెప్పి ఆయన కన్నుమూశాడు. మహిళలకు ఉపాధి అవకాశాలు అరకొరగా ఉన్న ఆ రోజుల్లో ఆ కుటుంబానికి ఆసరాగా నిలవాల్సిన బాధ్యత కుటుంబానికి పెద్దపిల్ల ఎలిజబెత్‌పై పడింది. అందరూ ఆడపిల్లలే. అక్కచెల్లెళ్ళంతా కలిసి పాఠశాల పెట్టారు. అప్పట్లో మహిళలకున్న ఒకే ఒక్క అవకాశం అంది. ఎలిజబెత్‌కు అప్పుడు సుమారు పదిహేడేళ్ళు. తర్వాత కాలంలో ఆమె సోదరులలో ఇద్దరికి ఉద్యోగాలు దొరకడంతో ఆమె చదువుకునే వెసులుబాటు దొరికింది. సరిగ్గా అప్పుడే ప్రాణాంతక గర్భాశయ కేన్సర్ సోకిన స్నేహితురాలికి సపర్యలు చేయాల్సి వచ్చింది. ఆ సంఘటనతో ఎలిజబెత్ జీవితం అనూహ్యమైన మలుపు తిరిగింది.
వెన్నులో వణుకు పుట్టేది
ఆ స్నేహితురాలు 'ఒక లేడీ డాక్టర్ తనకు వైద్యం చేసి ఉంటే తనకింత బాధ కలిగి ఉండేది కాదు' అని వాదించి ఎలిజబెత్‌ని మెడిసిన్ చదవమని ప్రోత్సహించింది. తనకు నైతిక, ఆధ్యాత్మిక విషయాలపైనే తప్ప అశాశ్వతమైన మానవ దేహంపై ఆసక్తి లేదని ఇంతకాలమూ భావిస్తూ వచ్చింది. పైగా 1845 నాటి చికిత్సా విధానం తెలుసుకుంటే వెన్నులో వణుకు పుట్టుకొస్తుంది. మత్తుమందులు లేవు. రోగులు పూర్తి స్పృహలో ఉండి గిలగిలా తన్నుకుంటూ ఉండగానే శస్త్ర చికిత్సలు జరిగేవి. సర్జన్లు శస్త్ర చికిత్సకు ముందు పరికరాలు శుభ్రం చేసేవారు కాదు. కనీసం చేతులు కూడా కడుక్కునే వారు కాదు. అన్ని కేసులకూ ఒకే కోటు ధరించేవారు.
పెండ్లిని తిరస్కరించి
ఆ సమయంలో ఆమెకు పెళ్లి సంబంధం కుదిరింది. కానీ తన లక్ష్యానికి మగాళ్ళు అవరోధం కల్పిస్తారని భావించి ఆ వరుణ్ణి తిరస్కరించి మెడిసిన్ చదవాలని నిర్ణయించుకుంది. 1846లో ఆమె ఫిలడెల్ఫియా వెళ్లి బోర్డింగ్ స్కూల్లో పాఠాలు చెబుతూ అనాటమీ చదువుకుంది. సమర్థులైన ఇద్దరు డాక్టర్లు ఆమె మెడికల్ కళాశాలలో చేరడానికి సాయం చెయ్యాలని ప్రయత్నించారు. కానీ అది సఫలం కాలేదు. కొంతమంది భుజం తట్టినా ఎక్కువమంది ఒక మహిళ మెడిసిన్ చదవాలనుకోవడాన్ని విచిత్రంగా చూశారు. మగాడి వేషంలో పారిస్ వెళ్లి చదువుకోమని సలహా ఇచ్చారు. కానీ తన లక్ష్యాన్ని అడ్డదారిలో చేరుకోవడం ఆమెకు ఇష్టం లేదు. అన్ని విధాలా తనకు మెడిసిన్ చదివే హక్కు ఉందని ఆమె ప్రగాఢ విశ్వాసం. తనది నైతిక యుద్ధంగా ఆమె అభివర్ణించింది. ఆ యుద్ధాన్ని బహిరంగంగానే చెయ్యాలనుకుంది.
చిక్కు సమస్య మొదలు
1846లో 29 కళాశాలలు ఆమె అభ్యర్థనను తిరస్కరించాయి. చివరకు 1847లో జెనీవా మెడికల్ కళాశాల ఆమెకు ప్రవేశం కల్పించింది. అక్కడ కొన్ని రోజుల వరకు అందరి కళ్ళూ ఆమెపైనే ఉండేవి. ఆమె మాత్రం ఎప్పటిలాగే ధైర్యంగా హుందాగా గంభీరంగా ఉండేది. జెనీవా పట్టణంలో జనం తనపై విసిరే చిట్టీలను, వెకిలి మాటలను, తీక్షణమైన చూపులనూ పట్టించుకోవడం మానేసింది. 1847 నవంబరులో కళాశాలలో ఆమెకు ఓ చిక్కుసమస్య ఎదురైంది. డా|| వెబ్ స్టర్ తరగతి గదిలో పునరుత్పుత్తి వ్యవస్థ గురించి చర్చ మొదలు పెట్టాడు. తుంటరి మాటలకూ, మతదూషణకూ ఆయన పెట్టింది పేరు. కానీ అదృష్టవశాత్తూ ఎలిజబెత్ ఇబ్బందిపడటాన్ని గమనించి ఆ పాఠాలను సొంతగా చదువుకోమని సలహా ఇచ్చాడు. 1848లో మెడిసిన్‌లో పట్టభద్రురాలరైన మొట్టమొదటి మమిళ ఎలిజబెత్. అప్పటికి ఆమె వయసు 28 ఏండ్లు. పట్టభద్రులను 'సర్' అని సంబోధించడమే అలవాటున్న కళాశాల అధ్యక్షుడు మొదటి సారి ఎలిజబెత్‌ని మేడమ్ అని సంబోధించాడు.
విషాద సంఘటన
ఎలిజబెత్ ఇంట గెలిచినా రచ్చ గెలవలేకపోయింది. కళాశాలలో విద్యార్థుల గౌరవాన్నైతే సంపాదించుకుంది గానీ బయట ఉద్యోగం మాత్రం సంపాదించలేకపోయింది. ఆ రోజుల్లో అమెరికా ఆసుపత్రులు మహిళా డాక్టర్లను అనుమతించేవారు కాదు. అందుకని పారిస్ వెళ్ళిపోయింది. అక్కడ 12 గంటల పాటు విధులు నిర్వర్తిస్తూ పురుళ్ళు పోసేది. ఫ్రెంచ్ భాషనూ, మెడికల్ పదజాలాన్నీ నేర్చుకునేది. రాత్రుళ్ళూ 11 మంది ఆడపిల్లలతో కలిసి ఓ వసతి గృహంలో తలదాచుకునేది. అక్కడ తనకంటే పదేళ్ళ జూనియర్ అయిన స్థానిక యువకుడితో ప్రేమలో పడింది. అప్పుడే ఓ విషాద సంఘటన జరిగింది. 1849 నవంబరు 4న ఒక చిన్నపిల్ల కంటికి వైద్యం చేసేటపుడు ఒక చుక్క రసాయనం ఎలిజబెత్ ఎడమ కంట్లో పడింది. పని ఒత్తిడిలో దాన్ని చేత్తో తుడిచేసుకుంది. ఆ తర్వాత అంటువ్యాధి సోకి ఆ కన్ను, దానితో బాటు అప్పుడే చిగురులు వేస్తున్న ఆమె ప్రేమ అంతమైపోయాయి.
ఓ యువతిని కలిసింది
మరింత అనుభవాన్ని సంపాదించాలని 1850లో ఎలిజబెత్ లండన్ వెళ్ళింది. అక్కడ తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా ఎలాగైనా నర్సుగా పనిచేయాలని తపిస్తున్న ఒక యువతిని కలిసింది. ఆమె ఎవరో కాదు ఫ్లారెన్స్ నైటింగేల్. ఎలిజబెత్ ఫ్లారెన్స్తో కలిసి 'వైద్య పారిశుద్ధ్యంలో అతివాది'గా మారిపోయింది. ఆ తర్వాత మహిళా డాక్టర్లకు న్యూయార్క్‌లో మంచి అవకాశాలుంటాయని తెలిసి ఎలిజబెత్ అమెరికా వెళ్ళింది. అక్కడ ఓ గది అద్దెకు దొరకడం ఆమెకు గగనమైపోయింది. ఎందుకంటే ఆ రోజుల్లో మహిళా డాక్టర్లు గర్భస్రావాలు చేస్తారనే నమ్మకం అక్కడ ఉండేది. ఎలాగోలా గది సంపాదించగలిగినా రోగులు మాత్రం ఆమెవైపు కన్నెత్తి చూసేవారు కాదు. దాంతో ప్రత్యామ్నాయాన్ని వెతుక్కుంది. ప్రజల మధ్యకు వెళ్లి వరుసగా ఉపన్యాసాలిచ్చింది. అవి ప్రజాదరణ పొంది తర్వాత అచ్చయ్యాయి. దాంతో చిన్నా పెద్దా ఆడా మగా అనే వ్యత్యాసం లేకుండా రోగుల సందర్శన మొదలయింది.
కీలకమైన ప్రొఫెసర్‌గా
1859లో బ్రిటిష్ మెడికల్ రిజిస్టర్లో తొలి మహిళా వైద్యురాలిగా ఎలిజబెత్ పేరు నమోదైంది. బ్రిటన్‌లోని మహిళా లోకాన్ని ప్రభావితం చేసిన గొప్ప సంఘటన ఇది. అమెరికా అంత్యర్యుద్ధం చివరి దశకు చేరే సందర్భంలో ఎలిజబెత్ చేసిన పోరాట ఫలితంగా 1868లో మహిళా వైద్యకళాశాల ఏర్పడి ఆ కళాశాలలో ఆమె కీలకమైన ప్రొఫెసర్ ఆఫ్ హైజిన్ ఉద్యోగంలో నియమించబడింది. 1874లో ఎలిజబెత్ పూర్వవిద్యార్థి ఒకామె 'లండన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఫర్ ఉమెన్' స్థాపించింది. ఎలిజబెత్ అందులో పాఠాలు బోధించింది. చివరిగా ఉద్యోగ విరమణ చేసి లండన్‌లోని గ్రామీణ ప్రాంతంలో స్థిరపడి ఎన్నో పుస్తకాలూ, వ్యాసాలూ రాసింది. ఉత్తమ పారిశుద్ధ్యం గురించి ప్రచారం చేసింది. ఆజన్మాంతం స్వేచ్ఛా జీవితం గడిపిన ఎలిజబెత్ 1910లో ఒంటరిగా కన్ను మూసింది.