Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవితంలో జరిగినట్టే ఉద్యోగంలోనూ ఎప్పుడైనా కొన్ని పొరపాట్లు జరగడం సహజం. వ్యక్తిగతంగా జరిగితే నష్టం ఇంటివరకే పరిమితం అవుతుంది. ఉద్యోగ విధుల్లో పొరపాటు వల్ల సంస్థ ప్రతిష్ఠపైనో, వ్యాపారం పైనో చెడు ప్రభావం పడే ప్రమాదం ఉంది. ఒక్కో సారి సంస్థ చట్టపూర్వకంగానూ బదులు చెప్పాల్సిన అవసరం రావచ్చు. ఇలా జరగకుండా ఉండాలంటే దాన్ని సరిదిద్దుకునేందుకు వెంటనే ప్రయత్నించాలి.
సమస్యను పరిష్కరించుకునే మార్గం గురించి మీ ఆలోచనను పై అధికారికి చెప్పాలి. దాని వల్ల పొరపాటును కొంతైనా సరిదిద్దుకునే అవకాశం ఉందని వివరించి చూడాలి. ఆ తర్వాత వారి ఆలోచనలనూ జోడిస్తే పరిష్కారం లభించొచ్చు. ఇలాంటి సమయంలోనే మెదడు చురుగ్గా పనిచేయాల్సి ఉంటుంది. మీ ఆలోచన సమస్యను తీర్చేలా ఉండాలి. ఈ పొరపాటువల్ల ప్రభావితమైన క్లైంట్తో మాట్లాడటానికి ప్రయత్నించాలి. అది సంస్థ నిర్లక్ష్యంతో చేసిన పొరపాటు కాదని వివరించాలి. దాన్ని సరిచేయడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారో చెప్పాలి. బృంద సభ్యులకూ వివరించి దీన్నుంచి బయటపడే సలహా ఇమ్మని కోరాలి. వీలైనంత త్వరగా పరిష్కారాన్ని వెదకడం మంచిది.
జరిగిన పొరపాటుకు బాధ్యత తీసుకోవడమే కాదు, దీనివల్ల ప్రభావితమైన వారికి సంస్థ తరఫున క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. కెరియర్లో అప్పటివరకు జరగని తప్పు ఇప్పుడెందుకు జరిగిందో గుర్తించాలి. కారణాన్ని కనిపెట్టి, పరిష్కారాన్ని రాబట్టాలి. మరొకసారి ఇటువంటి సందర్భం చోటు చేసుకోకుండా ఆచితూచి అడుగులేయాలి. దీని నుంచి కొత్త పాఠాలను నేర్చుకోవాలి. అత్యంత జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించడం నేర్చుకోవాలి.