Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల స్వాతిరెడ్డి పేరు సోషల్ మీడియాలో హోరెత్తిపోయింది. ఎందుకంటారా... అర్థరాత్రి సమయంలో తను ప్రయాణిస్తున్న రైల్లో ఓ మహిళ పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతుంది. వైద్య విద్యార్థి అయిన ఆమె ధైర్యంగా ఆ మహిళకు పురుడు పోసింది. పండంటి ఆడబిడ్డను ఆ తల్లి చేతిలో పెట్టి అందరి ప్రశంసలూ అందుకున్న ఆమె పరిచయం నేటి మానవిలో...
స్వాతి సొంతూరు ప్రస్తుత పల్నాడు జిల్లా నరసరావుపేట. తండ్రి కేసరి కోటిరెడ్డి, అమ్మ జ్ఞానసుందరి. వారిద్దరూ సమాజానికి సేవ చేయాలన్న దృక్పథం గలవారు. స్వాతి పుట్టిన నాటికి నరసరావుపేటలో సరైన విద్యాలయాలు లేవు. తండ్రికేమో ఆ ప్రాంతంలో ఎలాగైనా మంచి స్కూలు పెట్టాలని ఉండేది. కూతురు చిన్నగా ఉన్నప్పుడే కేర్ పబ్లిక్ స్కూలును స్థాపించారు. నామమాత్రపు ఫీజు తీసుకుంటూ ఆ స్కూలును నిర్వహించేవారు.
చిన్న వయసులోనే
తండ్రి స్థాపించిన పాఠశాలలోనే స్వాతి పదో తరగతి వరకు చదువుకుంది. ఆ వయసులోనే పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనేది. ప్రత్యేక రోజులు వచ్చినప్పుడు అందరికంటే ముందుండి ఏర్పాట్లు చేసేది. తన సేవా కార్యక్రమాల్లో తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సహించేవారు. తర్వాత ఇంటర్‌ను నరసరావుపేటలోనే ఇంటివద్దే ఉండి పూర్తి చేసింది. నీట్ రాసి వైద్య విద్య కోసం విశాఖలోని గీతం మెడికల్ కాలేజీలో చేరింది. అక్కడ కూడా కళాశాల ఆధ్వర్యంలో చేపట్టే సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. హౌస్ సర్జన్‌గా గీతం మెడికల్ కాలేజ్‌లోని గైనిక్ విభాగంలో నెలన్నర పాటు శిక్షణ పొందింది. ఆ సమయంలో రోజూ ఆపరేషన్లు, సాధారణ ప్రసవాలకు డాక్టర్లతో పాటు సహాయకురాలిగా వెళ్లేది. ఆ అనుభవంతోనే రైలులో సత్యవతికి ప్రసవం విషయంలో సహాయం చేయగలిగింది.
పరిస్థితి విషమించింది
సెప్టెంబర్ 13న స్వాతి విజయవాడలో రైలు ఎక్కింది. సికింద్రాబాద్ నుంచి విశాఖకు వెళ్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్ అది. తను బి6 కోచ్‌లో ఉంది. రైలు ఎక్కగానే నిద్రపోయింది. రాజమండ్రి దాటేసరికి అర్ధరాత్రి దాటి మూడున్నర గంటలైంది. ఆ సమయంలో ఓ వ్యక్తి ఆమెను నిద్రలేపారు. తన భార్య సత్యవతి తీవ్రమైన నొప్పితో విలవిల్లాడుతుందని చెప్పాడు. అవి పురిటినొప్పులని ఆయన గుర్తించలేదు. ఆమెకు అంతకు ముందు నుండే వెన్ను నొప్పి ఉంది. దాంతో భార్య ఆ నొప్పితోనే బాధపడుతుందనుకున్నాడు. సత్యవతికి అప్పుడు ఎనిమిదో నెల. డెలివరీకి మరో నెలపడుతుందని అతను అనుకున్నాడు. పరిస్థితి రానురాను అత్యవసర స్థితికి మారింది. ఆమెకు నొప్పి తీవ్రమయింది. అప్పటికే ఆ బోగీలో ఉన్న ఆడవాళ్లందరూ సత్యవతి చుట్టూ చేరారు. వారిలాగే తనూ ఆమె వద్దకు వెళ్ళింది. స్వాతి వైద్య విద్యార్థి అని అక్కడెవరికీ తెలియదు.
ముందు ఆమెను నమ్మాలి
స్వాతి అక్కడకు వెళ్లేసరికే బిడ్డ తల సగం బయటకు వచ్చేసింది. కానీ తల్లి ఆ బిడ్డను బయటకు పుష్ చేయలేకపోతోంది. సాధారణంగా ప్రసవ సమయంలో తల్లులే బిడ్డను వీలైనంత మేర బయటకు తోస్తుంటారు. కానీ ఆమె బాగా నీరసంగా ఉండడంతో ఆ పని చేయలేకపోతోంది. స్వాతి వెళ్లి పుష్ చేస్తే ఆమె ప్రసవానికి కొంచెం సాయం చేసినట్టు అవుతుందని భావించింది. అయితే ముందు స్వాతిని ఆమె నమ్మాలి. అలాగే చుట్టూ ఉన్న ప్రయాణికులు విశ్వసించాలి. సమయం గడుస్తున్న కొద్దీ పరిస్థితి విషమంగా మారుతోంది. అందుకే వెంటనే తను మెడికల్ స్టూడెంట్‌నని అందరికీ చెప్పేసింది. దాంతో అక్కడి వారందరికీ స్వాతిపై కాస్త నమ్మకం వచ్చింది. సత్యవతి భర్త తన దగ్గరకు వచ్చి ఏదైనా చేసి తన భార్య, బిడ్డను రక్షించమంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో ఆమె వద్దకు వెళ్లి బిడ్డను బయటకు పుష్ చేయడం ప్రారంభించింది.
సత్యవతికి ధైర్యం చెబుతూ
సాధారణంగా ప్రసవ సమయంలో బిడ్డ తల ఇరుక్కుపోయే పరిస్థితులు కొందరికి ఎదురవుతాయి. అప్పటికే సగం తల బయటకు వచ్చేసి ఉండటంతో పుష్ చేస్తే ప్రసవం జరిగిపోతుందని తెలుసుగానీ, తల ఇరుక్కుపోవడం వల్ల బిడ్డ బయటకు రాలేక ఆగిపోయిందా అనే అనుమానం స్వాతిలో మొదలైంది. సత్యవతికి ధైర్యం చెబుతూనే తన పని తాను చేసింది.
ప్రయాణికులు సంతోషించారు
ఆ సమయంలో బిడ్డ బొడ్డు కోసేందుకు కనీసం తన దగ్గర కత్తెర కూడా లేదు. బయట వర్షం, లోపల ఏసీతో మరో సమస్య. ఆ టెన్షన్ వాతావరణం ఐదు నిమిషాలు గడిచే సరికి బిడ్డ ఏడుపు వినిపించింది. ఆడపిల్ల పుట్టింది. దీంతో రైలులోని ప్రయాణికులు సంతోషించారు. అప్పుడు సమయం ఉదయం 5.35 గంటలు. రైలు అనకాపల్లికి దగ్గరలో ఉంది. అక్కడ ఎటువంటి వైద్య పరికరాలు లేకపోవడంతో బొడ్డు తాడును కట్టేసి కవర్లో పెట్టేసింది. కానీ మరో సమస్య వచ్చింది. వాళ్ళు ప్రయాణం చేస్తున్నది థర్డ్ ఏసీ కంపార్ట్మెంట్. సాధారణంగా పిల్లలు పుట్టగానే వారిని కాస్త వెచ్చని వాతావరణంలో ఉంచాలి. లేదంటే బిడ్డ రంగు మారిపోయి ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు స్వాతికి ఓ ఆలోచన వచ్చింది. వెంటనే రైల్వే సిబ్బందిని అడిగి వారు వాడని బెడ్ షీట్స్ తీసుకుని పాపకు చుట్టింది. ఇంతలో మిగతా ప్యాసింజర్లు, అనకాపల్లి రైల్వే స్టేషన్‌కు సమాచారం అందించి ట్రైన్‌ను అనకాపల్లిలో ఆపాలే చేశారు. టిటిఇ వెంటనే స్పందించి రైలు ఆగే విధంగా ఏర్పాట్లు చేయడంతో పాటు స్టేషన్ బయట 108 వాహనాన్ని కూడా ఏర్పాటు చేశారు.
వారితో పాటు ఆస్పత్రికి వెళ్లింది
వర్షం జోరుగా కురుస్తుండటంతో ప్యాసింజర్లంతా తల్లీబిడ్డపై వర్షం పడకుండా రెయిన్ కోట్లు, బెడ్స్ షీట్లతో అంబులెన్స్ వరకు తోడు వచ్చారు. 108 వాహనంలో అనకాపల్లిలోని ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి తల్లి, బిడ్డను తీసుకెళ్లారు. వాస్తవానికి స్వాతి వైజాగ్‌లో ట్రైన్ దిగాలి. కానీ తను కూడా ఆ తల్లీబిడ్డతో పాటు అనకాపల్లిలోనే దిగింది. వారితో పాటు ఆసుపత్రికి వెళ్లింది. తల్లిని గైనిక్ విభాగంలోని వైద్యులకు అప్పగించి బిడ్డను తీసుకుని పిల్లల వార్డుకు వెళ్లింది. బిడ్డకు పల్స్, హార్ట్ బీట్, వెయిట్ వంటివి సాధారణంగానే ఉన్నాయో లేదో పరీక్షించిన తర్వాత పాపను తండ్రికి అప్పగించి తను తిరిగి వైజాగ్ బయలు దేరింది.
ప్రశంసల వర్షం
స్వాతి ఆరు గంటలకు వైజాగ్‌లో రైలు దిగాలి. ఆ సమయానికి తల్లిదండ్రులు ఆమెకు ఫోన్ చేశారు. కానీ తను అనకాపల్లిలో ఉన్నానని జరిగిన విషయం మొత్తం వారికి వివరించింది. కూతురు చేసిన సాయానికి వారెంతో సంతోషించారు. రైల్వే అధికారులూ, స్నేహితులు, పెద్దపెద్ద వాళ్లూ ఫోన్లు చేసి స్వాతిని అభినందించారు. చంద్రబాబునాయుడు, కెటీఆర్‌తో పాటు పలువురు ఐఏఎస్ అధికారులు స్వాతి సేవను ట్వీట్లు చేశారు. గీతం అధ్యక్షులు శ్రీభరత్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. సత్యవతి భర్త సత్యనారాయణ ఆనందానికైతే అవధుల్లేవు. ఇలా అందరూ మెచ్చుకుంటుంటే ''సమాజ సేవలో ఇంతటి ఆనందం ఉందా'' అంటూ ఆమె ఆశ్చర్యపోయింది. మున్ముందు వైద్య వృత్తిలో కొనసాగుతూ ప్రజలకు సేవచేస్తానంటుంది స్వాతి.