Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భర్తకో.. పిల్లలకో చిన్న జలుబు చేసినా హడావుడి పడిపోయే మహిళలు తమ గుండెకు చిల్లు పడుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటారు. పరీక్షలు చేయించుకోవడానికి వెనుకాడుతుంటారు. తెల్లవారు జాము నుంచి అర్ధరాత్రి వరకూ పనిచేసి అలసిన వాళ్లు వ్యాయామానికి టైం లేదంటారు. కానీ... తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటేనే కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోగలమన్నది మరిచిపోతారు. అలాంటి మహిళల గుండెను పట్టించుకోవాల్సిన బాధ్యత కుటుంబానిదే. నేడు 'ప్రపంచ గుండె దినోత్సవం' సందర్భంగా మహిళలు గుండె సమస్యల రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం...
''స్త్రీలకు భావోద్వేగాలను భరించే శక్తి సహనం ఎక్కువే. ఓర్పు ఒర్చుకోవడం స్త్రీల ప్రవృత్తి. అందుకే ఆమె గుండె గట్టిది'' అంటూ ఉంటారు. అందుకే చాలామంది ఆడవాళ్లకు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉండవని, ఉన్నా అతి తక్కువే అని భావిస్తూ ఉంటారు. ఇది చాలా తప్పుడు అభిప్రాయంగా చెప్పవచ్చు. నిజానికి పురుషులతో పాటు సమానంగా మహిళలలో కూడా గుండె జబ్బుల అవకాశం ఎక్కువే. సాధారణంగా మహిళలలో క్యాన్సర్ బాధితులు అదీ రోమ్ముక్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్, ఎక్కువగా వస్తూ ఉంటాయి. అది వాస్తవమే అయినప్పటికీ క్యాన్సర్ల కన్నా గుందేజబ్బుల వల్ల మరణించిన వాళ్ళే ఎక్కువ అని ఒక అధ్యయనంలో తేలింది.
ఇలా గుర్తించొచ్చు
మాములుగా గుండెపోటు అంటే ఛాతిలో నొప్పి ఉంటుందని అనుకుంటారు. నిజానికి గుండెపోటు వచ్చినపుడు వచ్చే నొప్పి ఛాతి మధ్యలో పట్టేసినట్టు అనిపిస్తూ నొప్పి క్రమంగా మెడ, భుజం, దవడ వరకు పాకుతుంది. అంతేకాదు విపరీతంగా చెమటలు రావడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కూడా ఉంటుంది. ఇటువంటి లక్షణాలు మనం పురుషులకు గుండెపోటు వచ్చినపుడు చూస్తుంటాం. అయితే స్త్రీలలో గుండె పోటు వచ్చినపుడు 50 శాతం మందిలో ఈ లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. కానీ కొందరిలో ఈ లక్షణాలు కనిపించకపోవచ్చు. ఎక్కువ నీరసంగా ఉండటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అజీర్తిగా ఉండడం, పొట్టపై భాగంలో అసౌకర్యంగా ఉండడం, దవడ నొప్పి, గొంతు నొప్పి, భుజం నొప్పి వంటివి ఉంటాయి. ఎటువంటి ఛాతినొప్పి ఉండకపోవచ్చు కూడా. అందువల్ల చాలా మంది దీన్నీ అశ్రద్ధ చేస్తారు. ఇది గుండెపోటు కాదని అనుకుంటారు. మామూలుగా గుండెపోటులో ఉండే లక్షణాలు కనిపించక పోవడం వల్ల మహిళల్లో గుండె సమస్యలు గుర్తించడంలోనే జాప్యం జరుగుతోంది.
గుండె జబ్బుకు కారణాలు
స్త్రీలు మధుమేహం, స్థూలకాయం, గుండె పనిచేయకపోవటం, కిడ్నీలు పనిచేయకపోవటం, డిప్రెషన్, పక్షవాతం వంటి వాటి బారిన ఎక్కువ పడుతుంటారు. శాస్త్రవేత్తలు మన భారతీయుల జన్యువులలోనే గుండెజబ్బులు వంశపారంపర్యంగా వస్తుంటాయని చెప్తున్నారు. ఇతర కారణాలు పొగతాగటం, అధిక కొలెస్ట్రాల్, మాంసం తినటం వంటివి కూడా గుండె జబ్బులకి కారణమవుతాయి. భారతీయులకి సాధారణంగా మెటబాలిక్ సిండ్రోమ్, అంటే గుండె జబ్బుల రిస్క్ ను పెంచే మెటబాలిక్ అనారోగ్య స్థితి సహజంగా ఎక్కువగా వస్తుంది. కానీ మీ గుండె జబ్బు వచ్చే రిస్క్‌లను పెంచేవి కేవలం ఈ కారణాలే కాదు. ఇదిగో స్త్రీలలో గుండె జబ్బుల రిస్క్‌ను పెంచే కారణాలు ఇవే.
త్వరగా రజస్వల కావడం: ఎంత తొందరగా కౌమార దశలోకి అడుగుపెడితే అంత గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుందని ఇటీవలి అధ్యయనంలో తేలింది ఏమనంటే మొదటిసారి రుతుక్రమం 12 ఏండ్ల వయసు కన్నా ముందే వస్తే వారికి 13 ఏండ్ల వయసు తర్వాత రజస్వల అయ్యే స్త్రీల కన్నా 10 శాతం ఎక్కువ గుండె జబ్బులు వచ్చే రిస్క్ పెరుగుతుంది. ఎందుకంటే జీవితకాలంలో ఈస్ట్రోజెన్ స్థాయి పెరిగి రక్తం గడ్డటం మరియు గుండెపోట్లకి దారితీయవచ్చు.
ఇటీవల తీవ్రంగా ఫ్లూ వచ్చివుండటం: తీవ్రంగా ఫ్లూ జ్వరం రావటం కూడా మున్ముందు గుండె జబ్బులు వచ్చే అవకాశం పెంచుతుందంట. ఫ్లూ జ్వరం తీవ్రంగా అపాయకరమైన బ్యాక్టీరియా, వైరస్లు సోకటం వలన వస్తుంది. అవి మీ గుండెలోకి ప్రవేశించి గుండె పనిచేయకపోవటానికి కూడా కారణమవ్వచ్చు. అందుకని మీకు ఫ్లూ జ్వరం తీవ్రంగా ఉంటే వైద్యున్ని తప్పక సంప్రదించండి.
డైట్ మందులు తీసుకోవడం: చాలా వరకు డైట్ మందులు పనిచేయవని తెలిస్తే ఆడవారు షాకవుతారు. ఈ మందులు ప్రాణాంతకం కూడా అవుతాయి. ఎందుకంటే వాటిలో ఉండే స్టిమ్యులెంట్ ప్రభావం మీ గుండెకి మంచిది కాదు. ఈ డైట్ మందులు మీ రక్తపోటును పెంచి, గుండె వేగాన్ని పెంచి గుండెపై ఎక్కువ వత్తిడిని పెంచుతాయి. చాలాకాలంపాటు ఈ డైట్ మందులు వాడటం వలన మీ గుండెకి శాశ్వత నష్టం కలుగుతుంది.
మనసు విరిగిపోవటం: మీకు చాలా బాధగా ఉండి, మానసికంగా కుంగిపోయి ఉన్నట్టయితే మీకు గుండెజబ్బులు వచ్చే అవకాశం ఉంది. మనసు విరిగిపోయే సిండ్రోం మానసిక వత్తిడి తీవ్రంగా ఉండటం వలన వస్తుంది. ఇది దగ్గరివారు చనిపోవటం, బ్రేకప్, ఆర్థిక పరిస్థితులు లేదా విడాకులు దేనివల్లనైనా రావచ్చు. ఈ కారణాలు గుండె జబ్బు రిస్క్‌ను పెంచుతాయి. అందువల్ల మీరు వ్యాయామం, ధ్యానం, యోగా, థెరపీతో మీ సమస్యలను పరిష్కరించుకోండి.
వాపుకి సంబంధించిన వ్యాధి ఉన్నట్టు తెలియడం: రుమటాయిడ్ ఆర్థరైటిస్ స్త్రీలలో ఎక్కువగా వచ్చి గుండె జబ్బుల రిస్క్‌ను పెంచుతుంది. ఇది శరీరంలో వాపులను కలిగించి రక్తనాళాలకు నష్టం కలిగిస్తుంది. గోడలు మందంగా మారేట్లు, కొవ్వు పేరుకునేలా చేస్తుంది. మీరు వాపును పెంచని ఆహారపదార్థాలను తినాలి. దానిద్వారా గుండె జబ్బులను నివారించవచ్చు లేదా మీ స్థితి గురించి డాక్టర్‌తో మాట్లాడండి.
క్రమం తప్పకుండా గుండె పరీక్షలు
గుండె నొప్పి లక్షణాలు కూడా మహిళల్లో వేరు వేరుగా ఉంటాయి. సాధారణ గుండేనొప్పి లాగా నొప్పి పాకుతూ ఉంటుంది. సాంప్రదాయిక గుండె నొప్పి లక్షణాలు ఏవి ఉండక పోవచ్చు. ఆయాసంగా ఉండడం, చమట పట్టడం వంటి లక్షణాలు గుండె నొప్పి అన్న విషయాన్ని కలిగించవు. నీరసం, బలహీన పడి పోవడం కూడా గుండె జబ్బు అన్న అనుమానాన్ని కలిగించవు. నీరసం బలహీన పడి పోవడం కూడా గుండె జబ్బు లక్షణంగానే బహిర్గతం అవుతాయి. కాని అవి సాధారణ అనారోగ్యపు లక్షణాలుగా భావించడం వల్ల ఒక్కోసారి గుండె జబ్బును కనిపెట్టడం మిస్ అవుతారు. ఇలాంటి సమయంలో చిన్న బ్లాక్ ఉన్నా అది హటాత్తుగా విచ్చినం చెందవచ్చు. దాంతో అకస్మాతుగా గుండెపోటు వచ్చి కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. ఫలితంగా ప్రాణాల మీదకు వస్తుంది. అలా కాకుండా క్రమం తప్పకుండా గుండె పరీక్షలు చేయించుకుంటే ఇలా అకాస్మాతుగా గుండె పోటుకు గురి అయ్యే అవకాశాలు ఉండవు. అందుకే మెనో పాజ్ దశలో లక్షణాల లో అశ్రద్ధ చేయవద్దని 40 ఏళ్ళు దాటినా గుండెకు సంబందించిన అన్ని పరీక్షలను క్రమం తప్పకుండా చేయిన్చుకోవాలి.అవగాహన ఉన్న వాళ్ళు కూడా క్యాన్సర్ కోసం పాప్‌స్మియర్ టెస్ట్ లు మమ్మో గ్రామ్ మామో గ్రఫీ, చేయించు కోవడం లేదు. చాలా మందికి మొదటి సారి గుండెపోటు రావడమే ప్రాణా పాయానికి దారి తీస్తుంది.
నివారణ
సమస్య వచ్చిన తర్వాత ఏ చికిత్స మంచిదని ఆలోచించే కంటే సమస్య రాకుండా నివారించడం చాలా మంచిది. గుండె ఆరోగ్యాన్ని కాపాడే దిశగా ప్రతి ఒక్కరు తమ జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి.
క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యాలి. రోజు 30 నిమిషాల వాకింగ్ లేదా జాగింగ్ వారంలో కనీసం ఐదు రోజులైనా చెయ్యాలి. శరీర బరువును క్రమబద్ధం చేసుకోవాలి.
సమతుల ఆహారం తీసుకోవాలి. ఆకు కూరలు, పండ్లు తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలి. కొవ్వు పదార్థాలు, నూనె పదార్థాలు తినకూడదు. నెలకు ఒకరికి అర లీటరుకు మించి నూనె వాడకూడదు.
గుండె పోటుకు ఆస్కారం ఉన్న కుటుంబంలోని వారు తరచుగా పరీక్షలు చేయించుకోవడం, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్‌లను అదుపులో ఉంచుకోవడం తప్పనిసరి.
ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలి. పరీక్షలు రెండు రకాలు. ఎటువంటి లక్షణాలు కనిపించక పోయినప్పటికీ చేయించుకునే పరీక్షలు. వీలైనంత తొందరగా గుండెలో సమస్యలను గుర్తిస్తే గుండెపోటును నివారించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గుండె పోటు రావడానికి అవకాశాలు ఉన్నాయా లేదా అని గుర్తించే పరీక్షలు ఉదాహరణకు షుగర్, బీపీ, కొలెస్ట్రాల్‌లు అదుపులో ఉన్నాయా లేదా తెలుసుకునే పరీక్షలు.