Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొలకెత్తిన విత్తనాలు తింటే బోలెడు పోషకాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. అన్ని ప్రయోజనాలు ఉన్న మొలకలను నేరుగా తినడానికి చాలా మంది ఇష్టపడరు. కాబట్టి వీటితో రకరకాల వంటలు కూడా చేసుకోవచ్చు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇంకెందుకు ఆలస్యం... వీటిని ప్రయత్నించి చూడండి.
పెసర మొలకల సలాడ్
కావల్సిన పదార్థాలు: పెసర మొలకలు - అర కిలో, ఉల్లిగడ్డ - ఒకటి, టమోట - ఒకటి సన్నగా తరగాలి, పచ్చిమిర్చి - ఒకటి సన్నగా తరగాలి, కారం - పావు టీ స్పూను, చాట్ మసాలా - టీ స్పూను, నిమ్మరసం - టీస్పూను, ఆలూ లేదా మోరంగడ్డ - ఒకటి ఉడికించుకోవాలి, ఉప్పు - తగినంత.
తయారు చేసే విధానం: ముందుగా మొలకల్ని శుభ్రంగా కడగాలి. నీళ్లు పోసి ఉడకబెట్టాలి. వీటికి పైన చెప్పిన పదార్ధాతలన్నీ చేర్చి బాగా కలపాలి. చివర్లో నిమ్మరసం, ఉప్పు, కొత్తిమీర కూడా చేర్చి కలిపి సర్వ్ చేయాలి.
మొలకల చట్నీ
కావల్సిన పదార్థాలు: పెసర మొలకలు - కప్పు, వెల్లుల్లి - రెండు రెబ్బలు, చింతపండు - నిమ్మకాయంత, అల్లం - చిన్నముక్క, ఉల్లిగడ్డ - ఒకటి, కందిపప్పు - మూడు టేబుల్ స్పూన్లు, ధనియాలు - టీ స్పూను, పండు మిర్చి - నాలుగు, కరివేపాకు - కొద్దిగా, ఉప్పు, నూనె - సరిపడా.
తయారు చేసే విధానం: ఉల్లిగడ్డ, అల్లం, వెల్లుల్లి సన్నగా తరగాలి. బాండీలో నూనె వేడి చేసి కందిపప్పు, ధనియాలు, పండు మిర్చి, కరివేపాకు వేసి వేయించి పక్కనుంచాలి. బాండీలో మొలకలు వేసి దోరగా వేయించి తీయాలి. అన్నీ చల్లారాక మొదట కందిపప్పు, ధనియాలు, పండు మిర్చి, కరివేపాకు, చింతపండు, ఉప్పు మిక్సీలో వేసి తిప్పాలి. తర్వాత వెల్లుల్లి, అల్లం, ఉల్లిగడ్డ మిశ్రమం వేసి తిప్పాలి. చివర్లో మొలకలు వేసి పలుకుగా మారాక తీసి వేడి అన్నంతో తినాలి.
శనగ మొలకల వడ
కావల్సిన పదార్థాలు: శనగ మొలకలు - పావుకిలో, బియ్యంపిండి - అరకప్పు, ఉల్లిగడ్డ - రెండు, పచ్చిమిర్చి - మూడు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ - రెండు టీ స్పూన్లు, కొత్తిమీర - కొద్దిగా, కరివేపాకు - కొన్ని ఆకులు, ఉప్పు, నూనె - సరిపడా.
తయారు చేసే విధానం: ఉల్లిగడ్డ సన్నగా తరగాలి. శనగ మొలకలు, పచ్చిమిర్చి, కారం మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. దీనికి ఉల్లి గడ్డ ముక్కలు, బియ్యం పిండి, అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు కలపాలి. బాండీలో నూనె వేడిచేసి ఈ పిండిని చిన్న ముద్దలుగా తీసుకుని వడల్లా వేసి వేయించుకోవాలి.
చపాతి
కావల్సిన పదార్థాలు: పెసర మొలకలు - కప్పు, గోధుమపిండి - రెండు కప్పులు, పనీర్ తురుము - పావు కప్పు, పచ్చిమిర్చి - రెండు, వెల్లుల్లి - మూడు రెబ్బలు, ఉప్పు, నెయ్యి, నూనె - తగినంత.
తయారు చేసే విధానం: గోధుమ పిండి, ఉప్పు, నెయ్యి, నీళ్లు చేర్చి పిండిని ముద్దగా కలిపి పెట్టుకోవాలి. మొలకల్ని ఉడికించి పలుకుగా రుబ్బి పక్కనుంచాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. పాన్లో నూనె వేడి చేసి అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి మొలకల ముద్ద, పనీర్, ఉప్పు వేసి కలిపి పొయ్యి నుంచి దింపాలి. తర్వాత పిండితో చపాతీలు ఒత్తుకోవాలి. రెండు చపాతీల మధ్య చేసి పెట్టుకున్న మొలకల మిశ్రమం ఉంచి అంచులు మూసేయాలి. పెనం మీద నూనె వేసి ఈ చపాతీలు రెండు వైపులా కాల్చుకుని సర్వ్ చేయాలి.
పెసర మొలకలు మన శరీరానికి ప్రోటీన్లను అందించడంతోపాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా లభించే వీటిని తరచూ తింటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతమవుతుంది.
పెసల మొలకలలో ఫైబర్ చాలా అధికంగా లభిస్తుంది. ఫైబర్ ఇందులో ఎక్కువగా ఉండటం వల్ల వీటిని తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. అప్పుడు అతిగా ఆహారం తినబుద్ధి కాదు. ఆకలిదప్పులు కూడా తీరుతాయి. ఫలితంగా బరువు తగ్గడం సాధ్యమవుతుంది.
వీటిలో విటమిన్ బి, ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలను నిలయం.
ఈ మొలకల్లో అధికంగా లభించే ఐరన్ శరీరంలోని హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. ఫలితంగా రక్తహీనత సమస్య చాలా వరకు తగ్గుతుంది.