Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయవంతమైన వారిని మీరు ఎవరినైనా పరిశీలించండి. వారి నుంచి వచ్చే ఒక మాట 'ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉంటాం'. ఈ మాట ఎన్నోసార్లు వినుంటాం కదా. కెరియర్లో ముందుకు వెళ్లాలన్నా, ఆత్మవిశ్వాసం పెంపొందాలన్నా ఈ సూత్రం పాటించాల్సిందే అంటారు నిపుణులూ..
రోజురోజుకీ సాంకేతికతలో ఎన్నో మార్పులు. నిరంతరం మారిపోయే ప్రపంచంతో పోటీ పడాలంటే మనమూ ఆ వేగాన్ని అందుకోక తప్పదు. అందుకే కొన్ని సంస్థలు ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. కానీ అందరికీ ఆ ఆస్కారం ఉండదు. పైగా అవీ తమకు కావాల్సిన నైపుణ్యాలే నేర్పిస్తాయి. మనలో చాలా మంది నాయకురాలై నడిపించాలనుకుంటున్నారు. దాన్ని అందుకోవాలనుకుంటే నేర్చుకోవడంలో రాజీపడొద్దు.
'మహిళలు నాయకత్వ హోదాకు పోటీపడక పోవడానికి.. వాళ్లకి వాళ్లు తక్కువన్న భావనతో ఉండటమే కారణం'.. అనేది ఓ పరిశోధన సారాంశం. పక్కవాళ్లకు ఎక్కువ తెలుసు అనుకున్నప్పుడే కదా ఈ సమస్య. ఆ పరిజ్ఞానాన్ని మనమే పెంచుకుంటే ఆత్మవిశ్వాసం అదే వస్తుంది. కాబట్టి, తాజా ధోరణులను గమనించండి. అప్పుడిక మన కెరీర్ నల్లేరు మీద నడక కాదు.
'మహిళల్లో సమస్యా పరిష్కార నైపుణ్యాలు ఎక్కువ' అని చాలా పరిశోధనలు రుజువు చేశాయి. చిన్నతనం నుంచీ నేర్చుకునే పనులు, తెలుసుకోవాలనే తపన సహజంగానే ఈ నైపుణ్యాన్ని అలవరుస్తాయి. అందుకే ఇంట్లో చిన్నచిన్న సమస్యల్ని ఇట్టే పరిష్కరిస్తాం. కెరియర్ విషయంలోనూ దీన్ని పాటించగలగాలి. చేతిలో ఎంత సమాచారం ఉంటే అంత వేగంగా ఆలోచనలు పుట్టుకొస్తాయి. దీంతో పాత ప్రాజెక్టులు, రికార్డులు తిరగేయాల్సిన పనుండదు. ఇదీ లాభించే విషయమే. అంతేకాదు.. ఎదుటివారితో మాట్లాడే నైపుణ్యాలూ మెరుగవుతాయి. కాబట్టి.. నేర్చుకోవడం మొదలుపెట్టేయండి.
ఇల్లు, ఉద్యోగానికి తోడు మళ్లీ ఇదో అదనపు శ్రమ అనుకోవద్దు. నేర్చుకోవడం సంతోషానికీ కారణమవుతుంది. ఎలాగంటారా.. నేర్చుకునే క్రమంలో పరిచయాలూ పెరుగుతాయి. వారి నుంచి అవకాశాలు, హాబీలు, ఆరోగ్యకరమైన సూచనలు ఇలా ఎన్నో తెలుసుకునే అవకాశం కలుగుతుంది. ఫలితంగా పదోన్నతులూ దక్కుతాయి. ఇవన్నీ ఆనందం కలిగించే అంశాలే కాబట్టి నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండండి.