Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వినేష్ ఫోగట్... రెండు ప్రపంచ ఛాంప్ పతకాలను గెలుచుకున్న మొదటి భారతీయ మహిళగా నిలిచింది. తీవ్రమైన మోకాలి నొప్పి, రుతుస్రావ నొప్పిని భరిస్తూ కూడా ఈ విజయం సాధించింది. గొప్ప రెజ్లర్స్ కుటుంబం నుండి వచ్చినా ఎన్నో విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. రెజ్లర్‌గా తన కెరీర్‌ను కొనసాగించేందుకు సమాజంతో పోరాటం చేసి ఛాంపియన్‌గా నిలిచిన ఆమె జీవిత విశేషాలు నేటి మానవిలో...
2019లో నూర్-సుల్తాన్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తన మొదటి ప్రపంచ ఛాంపియన్షిప్ పతకం కాంస్యాన్ని గెలుచుకుంది వినేస్ ఫోగాట్. తర్వాత బెల్గ్రేడ్లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 53 కేజీల విభాగంలో మరో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు ఆమె ప్రపంచ స్థాయిలో రెండు పతకాలు సాధించిన మొదటి భారతీయ మహిళా రెజ్లర్‌గా నిలిచింది.
తీవ్రమైన నొప్పి భరిస్తూ...
ఆమె విజయం అంత సునాయాసం కాలేదు. పోటీ పడుతున్న సమయంలో ఆమె తీవ్రమైన మోకాలి నొప్పిని భరించాల్సి వచ్చేంది. అందే కాదు ఆ సమయంలోనే పీరియడ్స్ కూడా ఆమెను ఇబ్బంది పెట్టాయి. తీవ్రమైన కడుపు నొప్పిని తట్టుకుని బరిలోకి దిగింది. ఛాంపియన్షిప్ సమయంలో తన బరువు సమూహంలో పోటీ పడేందుకు 53 కిలోలనే యధావిధిగా కొనసాగించడానికి ఖాళీ కడుపుతో పోటీ పడవలసి వచ్చింది.
క్వాలిఫికేషన్ రౌండ్లో ఓడిపోయినా
బరువు తగ్గడానికి ఆమె చేసిన వ్యాయామం, మోకాలి నొప్పి, రుతుస్రావ నొప్పి వల్ల ఆమె చాలా నీరసించి పోయింది. దాంతో ఆమె మొదటి మ్యాచ్‌కు ముందు కోలుకోలేకపోయింది. కాంస్య పతక రౌండ్లో మాల్మ్‌గ్రెన్‌ను 8-0తో ఓడించి, క్వాలిఫికేషన్ రౌండ్లో ఓడిపోయిన వినేష్ అద్భుతమైన పునరాగమనం చేసింది. తన మొదటి బౌట్లో 2022 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో రజత పతక విజేత మంగోలియాకు చెందిన ఖులాన్ బత్ఖుయాగ్ చేతిలో ఓడి కాంస్య ప్లే-ఆఫ్ రౌండ్‌కు చేరుకుంది.
తర్వాత రౌండ్లో గెలిచి
విక్టరీ బై ఫాల్ (4-0) నిర్ణయంలో మొదట కజకిస్తాన్‌కు చెందిన జుల్దిజ్ ఎషిమోవాపై విజయం సాధించి. తర్వాతి రౌండ్లో గెలిచిన వినేష్ కాంస్య పతక రౌండ్లోకి ప్రవేశించింది. ఎందుకంటే ఆమె ప్రత్యర్థి అజర్‌బైజాన్‌కు చెందిన లేలా గుర్బనోవా గాయం కారణంగా పోటీకి రాలేకపోయింది. మాల్మ్‌గ్రెన్ ఓడిపోయినట్టు తన చేతులను కిందికి దించింది.
అంత సులభం కాదు
ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్‌లో అద్భుతమైన ప్రదర్శన తర్వాత వినేష్ కోర్టులో ఆదర్శప్రాయమైన గ్రిట్‌ను ప్రదర్శించింది. టోక్యో ఒలింపిక్స్ తర్వాత ఆమె డిప్రెషన్లోకి వెళ్లడంతో ఆమె చేసిన ఈ ప్రయాణం అంత సులభం కాదు. ఈ సంవత్సరం కామన్వెల్త్ గేమ్స్, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో నిజమైన ఛాంపియన్‌గా పోరాడేందుకు ఆమె తీవ్రమైన సంక్షోభం, అనేక ఆరోగ్య సమస్యలు, నిషేధాన్ని (క్రమశిక్షణా ప్రాతిపదికన) అధిగమించింది. ఈ భారత రెజ్లర్ వచ్చే ఏడాది జరిగే ఆసియాడ్ 2024 ఒలింపిక్స్‌కు సిద్ధమైంది.
గొప్ప రెజ్లర్ కుటుంబం
వినేష్ ఫోగట్ 25 ఆగస్టు, 1994 పుట్టింది. కామన్వెల్త్, ఆసియా క్రీడలలో స్వర్ణం గెలిచిన మొదటి భారతీయ మహిళా రెజ్లర్‌గా నిలిచింది. ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో పలు పతకాలు సాధించిన ఏకైక భారతీయ మహిళా రెజ్లర్ ఆమె. 2019లో లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్‌కు నామినేట్ అయిన తొలి భారతీయ అథ్లెట్‌గా ఫోగట్ నిలిచింది.
తీవ్రమైన వ్యతిరేకత
ఫోగాట్ గొప్ప రెజ్లర్ల కుటుంబం నుండి వచ్చింది. ఆమె మేనమామ కూతుర్లు అంతర్జాతీయ రెజ్లర్లు, కామన్వెల్త్ గేమ్స్ పతక విజేతలు కూడా. వినేష్ రెజ్లర్ అయిన రాజ్‌పాల్ ఫోగట్ కూతురు. అలాగే రెజ్లర్లు గీత, బబితల బంధువు. ఆమె బంధువులిద్దరూ కామన్వెల్త్ గేమ్స్‌లో 55 కిలోల విభాగంలో స్వర్ణం సాధించారు. ఆమె మేనమామ కూతుర్లు, ఆమె కుస్తీ పోటీలకు వెళుతున్నందుకు ఎన్నో ఆంక్షలు భరించాల్సి వచ్చింది. ఆమె తండ్రి, మేనమామ హర్యానాలోని వారి గ్రామంలోని ప్రజల నుండి విపరీతమైన ఒత్తిడి, వ్యతిరేకతను ఎదుర్కోవలసి వచ్చింది. వారు తమ సంఘంలోని నైతికతలకు, విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని గ్రామంలోని అందరూ అంటుండేవారు. అయినా ఇవేవీ లెక్క చేయకుండా ఆమె తండ్రి, మేనమామ తమ పిల్లలను ప్రోత్సహించారు. వారి కెరీర్‌కు అండగా నిలిచారు. ఆమె కజిన్ రీతు ఫోగట్ కూడా అంతర్జాతీయ స్థాయి రెజ్లర్. 2016 కామన్వెల్త్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకుంది.
అక్కడే పరిచయం
13 డిసెంబర్ 2018న ఆమె తన చిరకాల స్నేహితుడు, జాతీయ ఛాంపియన్‌షిప్‌లో రెండుసార్లు బంగారు పతక విజేత అయిన సోమ్‌వీర్ రాథీని వివాహం చేసుకుంది. అతను జింద్ జిల్లాలోని బక్తా ఖేరా గ్రామానికి చెందిన రెజ్లర్. ప్రస్తుతం ఇద్దరూ భారతీయ రైల్వేలో పనిచేస్తున్నారు. అక్కడే వారిద్దరికీ పరిచయం. ఆ పరిచయం తర్వాత కాలంలో ప్రేమగా మారింది.
తొలి ప్రపంచ ఛాంపియన్షిప్
రియో ఒలింపిక్స్ సమయంలో ఆమె మోకాలికి దెబ్బ తగిలింది. ఇది ఆమె కెరీర్‌కు పెద్ద ముప్పుగా మారింది. అయినా కూడా పోటీ పడింది. ప్రపంచ ఛాంపియన్షిప్ 2019లో ఆమె తన తొలి ప్రపంచ ఛాంపియన్షిప్ పతకాన్ని (కాంస్య) కైవసం చేసుకుంది. 2018లో జరిగిన ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్‌లో 50 కిలోల విభాగంలో స్వర్ణం సాధించింది. రోమ్‌లో జరిగిన మాటియో పెల్లికాన్ ర్యాంకింగ్ సిరీస్‌లో, 26 ఏండ్ల 53 కిలోల ఫైనల్లో కెనడాకు చెందిన డయానా మేరీ హెలెన్ వీకర్ను 4-0తో ఓడించింది.
మొదటి మహిళా రెజ్లర్
2013లో భారతదేశంలోని న్యూ ఢిల్లీలో జరిగిన ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల ఫ్రీస్టైల్ 52 కిలోల విభాగంలో వినేష్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. కాంస్య పతక బౌట్లో థారులాండ్‌కు చెందిన థో-కేవ్ శ్రీప్రపతో జరిగిన కాంస్య పతక పోరులో 3:0 తేడాతో గెలిచింది. తొలి రౌండ్లో వినేష్ 3:1తో జపాన్‌కు చెందిన నానామి ఇరీపై విజయం సాధించింది. ఆమె క్వార్టర్-ఫైనల్స్‌లో 1:3 తేడాతో కజకిస్తాన్‌కు చెందిన టట్యానా అమన్జోల్తో ఓడిపోయి ఫైనల్‌కు అర్హత సాధించింది. తద్వారా భారత గ్రాప్లర్తో రెపెచేజ్ రౌండ్‌కు అర్హత సాధించింది. ప్రస్తుతం ప్రపంచ స్థాయిలో రెండు పతకాలు సాధించిన మొదటి భారతీయ మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించింది.