Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జుట్టు బలంగా, ఆరోగ్యంగానే కాదు, మృదువుగా పట్టులా జారాలంటే వారానికొకసారి మాస్క్ వేయాలంటున్నారు నిపుణులు. సహజసిద్ధమైన పదార్థాలతో ఇంట్లోనే ఎలా వేసుకోవచ్చో చూద్దాం.
నాలుగైదు చెంచాల పాలల్లో చెంచా తేనె కలిపిన మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు, మాడుకు మృదువుగా రాసి పావుగంట ఆరనివ్వాలి. గాఢత తక్కువగా, రసాయనరహితమైన షాంపుతో రుద్ది, గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే చాలు. పొడారిన జుట్టును ఈ మాస్క్ మృదువుగా మారుస్తుంది. పాలల్లోని ప్రొటీన్లు శిరోజాలను బలంగా చేస్తాయి. వీటిలోని కాల్షియం జుట్టు పెరగడానికి దోహదపడితే, విటమిన్ ఏ, పొటాషియం వంటివి మెరుపునిస్తాయి.
ఒక అరటిపండును గుజ్జుగా చేసి, ఆరేడుచుక్కల బాదంనూనె కలిపి మిక్సీలో మెత్తగా చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి షవర్ కవర్ వేసుకొని అరగంట ఆరనివ్వాలి. జుట్టులోకి ఈ ప్యాక్ బాగా ఇంకిన తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే చాలు. ఈ మాస్క్ మాడుపైన కణాలకు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. చుండ్రు, దురదవంటి సమస్యలను దూరం చేస్తుంది. శిరోజాల చివర్ల ఏర్పడే పగుళ్లు తగ్గి, మృదువుగా మారతాయి. కండిషనర్‌లా పనిచేసి, మెరిసేలా చేస్తుంది.
ఒక గిన్నెలో కోడిగుడ్డు పచ్చసొనను విడిగా తీయాలి. ఇందులో రెండు చెంచాల గ్రీన్‌టీ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి 20 నిమిషాల తర్వాత షాంపుతో స్నానం చేస్తే చాలు. ఇది కుదుళ్లు, శిరోజాలకు పోషకాలను అందించి, చుండ్రు సమస్యను తగ్గిస్తుంది. శిరోజాలు రాలడాన్ని తగ్గించి మృదువుగా మెరిసేలా చేస్తుంది.