Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లలు ఏదైనా వస్తువు కనిపించడం లేదనుకున్నారనుకోండి. వాటిని తిరిగి కొనిస్తే, వాటి విలువ, వస్తువును జాగ్రత్తగా ఉంచుకోవాలన్న బాధ్యత వారికి ఎప్పటికీ తెలీదు. పోగొట్టినా అమ్మానాన్నా కొనిస్తారనే భరోసాతో ఉంటారు. కాబట్టి ఇంట్లో హోంవర్క్ చేసిన తర్వాత తమ పుస్తకాలు, రబ్బరు, పెన్సిల్ వంటివి సర్దుకునేలా చూడండి. అవసరమైతే హెచ్చరించాలి. పోగొట్టుకుంటే పదే పదే కొనివ్వనని చెప్పాలి. అప్పుడే వారికి బాధ్యత అలవడుతుంది. స్కూల్ నుంచి వచ్చేటప్పుడూ బ్యాగులో అన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడం అలవాటు చేసుకుంటారు.
పచారీ సామాన్లు కొనడానికి వెళ్లినప్పుడు పిల్లలనూ తీసుకెళ్లాలి. కావాల్సిన సామాన్ల వివరాలను కాగితంపై రాసే పని వారికప్పజెప్పాలి. దుకాణానికి వెళ్లాక పట్టికలో ఉన్న సామాన్లన్నీ కొంటున్నామో లేదో చెక్ చేసే పని వారికే ఇవ్వాలి. బిల్ కట్టిన తర్వాత బ్యాగులో అవన్నీ ఉన్నాయా లేదా చూడమనాలి. ఇవన్నీ వారికి బాధ్యత నేర్పుతాయి. మన సామాన్లు అనే భావన వారిలో మరింత బాధ్యతగా చూసుకోవాలనే ఆలోచనను కలిగిస్తుంది. ఈ అలవాటు వారిని బాధ్యతాయుతమైన వ్యక్తులుగా ఎదిగేలా చేస్తుంది.
కందిపోతారనో, అలసిపోతారనో ఆలోచించక ఇంట్లోనూ కొన్ని పనులను అప్పగించాలి. మంచినీటి సీసాలు నింపడం, మొక్కలకు నీళ్లు పోయడం, అందరూ భోజనానికి కూర్చున్నప్పుడు ప్లేట్లు, మంచినీళ్ల గ్లాసులు సర్దమనడం వంటి చిన్నచిన్న పనులు అలవాటు చేయాలి. వారి దుస్తులను వాళ్లనే అలమరల్లో సర్దుకోమనడం, బొమ్మలను దాయడం, వారానికొకసారి వారి గదిని వారే శుభ్రపరచాలని చెప్పడం వంటివీ బాధ్యతలను నేర్పిస్తాయి. క్రమేపీ వారి పనులను వారే చేసుకోవడం మొదలుపెడతారు. మొదట బద్ధకించినప్పుడు మనమూ వారికి సాయం చేస్తే చాలు. నెమ్మదిగా నేర్చుకుంటారు.