Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''శిలలపై శిల్పాలు చెక్కినారూ మనవాళ్ళు.. సృష్టికే అందాలు తెచ్చినారూ!'' అని సినీ కవి పొగిడినట్టుగా భారతదేశ శిల్పులు చెక్కిన దేవాలయాలూ, రాజుల కోటలూ ఎంతో అద్భుతంగా ఈనాటికీ అలరారుతున్నాయి. కఠిన పాషాణాలయిన బండల్ని, కొండల్ని తొలిచి అజంతా ఎల్లోరా లాంటి గుహల్ని అందంగా మలిచారు. బండరాళ్ళలోని అనవసర భాగాన్ని తీసేసి ఉలితో చెక్కి అందమైన శిల్పాలుగా ప్రాణం పోశారు. అమరశిల్పి జక్కనాచార్యుల వంటి అద్భుత ప్రావీణ్యం గల శిల్పులు భారతదేశంలో ఎందరో ఉన్నారు. తాజ్‌మహాల్ లాంటి ప్రపంచవింతను పాలరాయి భవనాన్ని నిర్మించింది మన శిల్పులే. కింద చప్పట్లు చరిస్తే కొండపై భాగాన వినిపించేలా కట్టిన గోల్కొండ కోట, అద్భుత చార్మినార్ కట్టడం, రాజ మందిరాలను ప్రపంచమంతా ఆశ్చర్యంగా మన వంక చూసేలా చేశారు మన శిల్పాచార్యులు. మన భారతీయ శిల్పకళay భాగంగా ద్వార బంధాలు, గవాక్షాలు, గోడలు, పైకప్పులు సైతం లతలు పువ్వులతో చిత్రీకరించబడ్డాయి. మనమీ శిల్పాలేమీ చెక్కలేము గానీ రాళ్ళతో అలంకారం చేద్దాం. మనమీరోజు రాళ్ళపై పెయింటింగులు, బొమ్మలు చేసి శిల్పులమైపోదాం. ఇంటిని అలంకరించుకుందాం...
పూల కొమ్మల పెయింటింగ్
దీనికిగాను గుండ్రని పాలరాతి రాళ్ళు, పెద్దపెద్ద రాళ్ళను ఉపయోగించవచ్చు. ఏ ఆకారమైనా ఏ పరిమాణంతో ఉన్నవైనా మనకు పనికొస్తాయి. నున్నగా చేసిన చిన్న చిన్న రాళ్ళు ఆక్వేరియమ్ల అడుగునా, పూలకుండీల పైభాగానా అలంకరణ కోసం వాడుతున్నారు. ఇలాంటి చిన్న రాళ్ళను మనం సేకరించి స్టోన్ పెయింటింగ్‌కు వాడుకోవాలి. నేకొక పూల కొమ్మల చిత్రాన్ని తయారు చేయటమెలాగో చూపిస్తాను. ముందుగా గట్టి అట్టనొకదాన్ని తీసుకుని దాని మీద నలుపురంగును అద్దాలి. బ్రష్‌తో వేయటం టైం తీసుకుంటుంది కాబట్టి చిన్న స్పాంజిముక్కను తీసుకుని రంగులో ముంచి అట్టపై అద్దాలి. ఆ రంగుపై భాగాన నీలం, తెలుపు రంగులు అద్దితే అందంగా ఉంటుంది. ఇప్పుడు ఎండు కొమ్మల్ని పూల కాడల్లాగా అతికించుకోవాలి. ఎండు కొమ్మల చివర రాళ్ళను పువ్వుల్లాగా అమర్చి అతికించాలి. విచ్చిన పువ్వులు, అరవిరిసిన మొగ్గలు, ఆకులు అంటూ రాళ్ళతో అలంకరించాలి. కొమ్మలు, రెమ్మలు, పూలు, ఆకులు రాళ్ళతోనే అలంకరించాలి. ఇప్పుడు కొమ్మలకు, ఆకులకు ఆకుపచ్చ రంగును వేసుకోవాలి. పువ్వులకు పసుపు, ఎరుపు, బులుగు రంగుల్ని వెయ్యాలి. రంగుల మధ్యలో తెలుపురంగు షేడ్స్ ఇవ్వాలి. పుప్పొడి కోసం పసుపురంగు వెయ్యాలి. అంతా అలంకరించాక ఫ్రేమ్ చేయించి పెట్టుకుంటే డ్రాయింగ్ కళకళలాడుతుంది.
గోడకు వేలాడ దీసే చిత్రం
దీని కోసం లావుపాటి ఎండుకొమ్మ కావాలి. క్రాఫ్ట్ షాపుల్లో ఎండు పుల్లలు, గోల్డ్‌స్పాట్ సీసా మూతలు, ఎండు ఆకులు, వాడి ఎండిన పూల రెక్కలు, సీమ చింత తొక్కలు వంటి డస్ట్‌బిన్‌లో పారేస్తున్న ప్రతిదీ అమ్ముతున్నారు. కొద్దిగా వంపు తిరిగిన లావుపాటి ఈ కొమ్మను నేను క్రాఫ్ట్ షాపులోనే కొన్నాను. దానికి రెండు చివర్లా మెరుపు దారాన్ని కట్టి పూసలు ఎక్కిస్తే గోడకు తగిలించుకునే వీలుతో ఉంటాయి. ఈ ఎండు కొమ్మకు రాళ్ళు అతికించాలి. నేను దీని కోసం ఒకవైపు వెడల్పుగా ఒక వైపు కోసుగా ఉండే రాళ్ళను తీసుకున్నాను. ఈ రాళ్ళతో మానవ ముఖాలను తయారు చేశాను. మరి కొన్ని రాళ్ళపై పూలను పెయింట్ చేశాను. పూలు తయారు చేశాం. కాబట్టి ఆకులు కూడా తయారు చేశాను. ఎండు కొమ్మమీద మానవ ముఖాలను నిలబెట్టాను. పక్కన పూలు, ఆకుల్లాగా రాళ్ళను అతికించాను. చాలా అందంగా తయారయింది.
కాక్టస్ చెట్టు
ఈ మధ్య ఇళ్ళలో కాక్టస్ చెట్లను పెంచుకోవడం ఫ్యాషనయింది. ఒకప్పుడు ఇళ్ళలో ముళ్ళ చెట్లను పెంచుకునేవాళ్ళు కాదు. ఎడారి మొక్కలైన ముళ్ళ చెట్లైన కాక్టస్ చెట్లను పెంచుకుంటున్నారు. కానీ చీరలకు ముళ్ళు పట్టుకుని చిరుగుతున్నాయి. చేతులకు గుచ్చుకుంటే సెప్టిక్ అవుతున్నాయి. అయితే ఇలాంటి కష్టాలేమీ పడకుండా కాక్టస్ చెట్లను కుండీల్లో నాటుకుందాం. దీనికోసం ముందుగా కుండీలను సిద్ధం చేసుకోవాలి. కొద్దిగా పెద్దసైజు రాళ్ళను తీసుకోవాలి. దోసకాయ ఆకారంలో ఉన్న రాళ్ళను తీసుకుని ఆకుపచ్చ రంగును వేసుకోవాలి. ఈ ఆకుపచ్చ రంగు రాయి మీద తెలుపు రంగుతో ముళ్ళు ఉన్నట్టుగా పెయింట్ చేయాలి. రాయితో తయారైన కాక్టస్ చెట్టు తయారైందన్నమాట. ఈ చెట్టుకు పైన లేత గులాబీ రంగులో పూలు పూస్తాయి. దాని కోసం గులాబీ రంగు వేసిన చిన్న రాళ్ళను అమర్చాలి. ఈ రాళ్ళను కుండీలలో అమరిస్తే కాక్టస్ చెట్టు నాటుకున్నట్టే.
లేడీ బగ్స్
వీటినే పేడ పురుగులు అంటారు. ఇవి సాధారణంగా ఎరుపు రంగు శరీరం మీద నల్లని మచ్చలతో ఉంటాయి. ఇంకా పసుపు, నారింజ వంటి ఏడు రంగులలో ఉంటాయి. ఈ కీటకాలు ఆకుల అడుగు భాగాన గుత్తులుగా గుడ్లు పెడతాయి. వీటిలో 500 రకాల జాతులుంటాయి. 'కాక్సీనిల్లిడే' కుటుంబానికి చెందిన ఈ కీటకాలను కప్పులు, పక్షులు తింటుంటాయి. పొలాలు, అడవుల్లో ఎక్కువ నివసిస్తాయి. ఇక్కడ మనం మూడు రంగుల్లో వీటిని తయారు చేద్దాం. ఒక మాదిరి గుండ్రంగా లేదా కోడిగుడ్డు ఆకారంలో ఉండే రాళ్ళను తీసుకొని వాటి ముందు భాగాన్ని నలుపు రంగుతో దిద్దాలి. ఇది ముఖ భాగం. ఇక్కడ కళ్ళు పెట్టాలి. మిగతా శరీరాన్ని ఎరుపు, గులాబీ, పసుపు రంగులు వేసుకోవాలి. ఆయా రంగులపై మచ్చలు ఉన్నట్టుగా నలుపు రంగును పూయాలి. శరీరం మధ్యలో విభజించినట్టుగా ఒక గీతను గీయాలి. లేడీబగ్స్ అందంగా రాళ్ళతో జీవం ఉట్టిపడేటట్లుగా తయారు చేయాలి.
సీనరి
దీనికి బేస్‌గా కొబ్బరి తాడును వాడదాం. బాగా లావుపాటి కొబ్బరి తాడును తీసుకుని గుండ్రంగా చుట్టుకుంటూ మధ్యలో గ్లూగన్తో అతికించుకుంటూ రావాలి. గుండ్రంగా చుట్టిన కొబ్బరితాడు బేస్‌గా మారింది. దీని మీద ఎండు కొమ్మలు, రాళ్ళు అమర్చి సీనరీ చెయ్యాలి. రెండు వరసల్లో కొమ్మలు అతికించాలి. ఆ కొమ్మల్లో ప్లాస్టిక్ ఆకులు అతికించాలి. దీని మీద రెండు వరసల్లో రకరకాల సైజుల్లో ఉన్న నున్నని రాళ్ళు అతికించుకుంటూ రావాలి. కొన్ని తెలుపు రంగు కొన్ని నలుపు రంగువి తీసుకోవాలి. దీని పైభాగాన కొంత పెద్ద రాళ్ళను తీసుకోవాలి. వీటికి వింత వింత మనుష్యుల ఆకారాన్ని చిత్రించాలి. చూడటానికి చాలా బాగుంటుంది.
ఉయ్యాల ఊగే మనుషులు
దీనికి కూడా ఎండిపోయిన చెట్టు పుల్లలు కావాలి. ఒక అట్టను తీసుకుని దాని మీద పెయింట్ చేయాలి. నీలం రంగుతో ఆకాశం ఉండేలా తీర్చిదిద్దాలి. దీని మీద ఒక చెట్టులా కొమ్మలు అతికించాలి. చెట్టుకింద భాగాన రాళ్ళ కుప్ప ఉన్నట్టుగా రాళ్ళు అతికించాలి. ఇప్పుడు రెండు దారాలకు ఒక పుల్లను చుట్టి ఉయ్యాలలా తయారు చేసుకోవాలి. ఈ ఉయ్యాలను చెట్టుకు వేలాడదీయాలి. ఉయ్యాలలో ఇద్దరు ఉయ్యాల ఊగుతున్నట్టుగా రాళ్ళను అతికించాలి. చెట్టుకు ఆకుల్లా చిన్న చిన్న రాళ్ళను అతికించాలి. ఇవీ రాళ్ళ చిత్రాలు.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్