Authorization
Mon Jan 19, 2015 06:51 pm
1887 మార్చి నెలలో చారిత్రకంగా అణచివేతకు గురైన కులానికి చెందిన ఓ యువతి తను అసహ్యించుకుంటున్న భర్తతో ముంబాయి న్యాయస్థానం ముందు నిలబడి ఉంది. కొద్దిసేపట్లోనే జడ్జి ఒక హిందూ భార్య బాల్య వివాహ పవిత్రతను ఉల్లంఘించ వచ్చునా? అనే విషయంపై తీర్పు చెప్పబోతున్నాడు. ఆమె వయసు ఇరవై రెండేండ్లు. పేరు రుక్మాబాయి రౌత్. ఇంత వరకూ భర్తతో కలిసి జీవించలేదు. ఇకపై జీవించాలని కోరుకోవడం లేదు. విడాకుల కోసం సుదీర్ఘ పోరాటం జరిపిన మొదటి హిందూ మహిళ ఆమె.
రుక్మాబాయి 1864లో జయంతి బాయి, జనార్ధన్ పాండురంగ్ దంపతులకు బొంబాయిలో జన్మించింది. ఆమె రెండో ఏటనే తండ్రి మరణించాడు. ఆ కులంలో వితంతు వివాహంపై నిషేధం లేదు. ఆరేండ్ల తర్వాత రుక్మాబాయి తల్లి డా|| సఖరాం అర్జున్ అనే వ్యక్తిని విహాం చేసుకుంది. ఆయన ప్రముఖ వైద్యుడు, వృక్ష శాస్త్రవేత్త, సంఘసంస్కర్త. రుక్మాబాయి పదకొండో ఏట అడుగుపెట్టాక సఖరాం బంధువైన పందొమ్మిదేండ్ల నిరుపేద దాదాజీ భికాజీతో వివాహం జరిగింది. యుక్తవయసుకు వచ్చాక ఆమె భర్త వద్దకు వెళ్ళేలా ఒప్పందం జరిగింది. పదకొండేండ్లకు రుక్మాబాయి యుక్తవయసకు వచ్చింది. కానీ ఆమె ఇంకా చిన్నపిల్లనే అని సఖరాం ఆమెను అత్తగారింటికి పంపించేందుకు అంగీకరించలేదు. పైగా అప్పటికే ఆమె భర్త విపరీతమైన అప్పుల్లో కూరుకుపోయివున్నాడు. దాంతో రుక్మాబాయి మారు తండ్రి సహకారంతో భర్తతో తెగతెంపులు చేసుకుంది.
ఆలోచించడం మొదలుపెట్టి
సఖరాం భారతీయ యూరోపియన్ సంస్కరణవాదులు, ఉదారవాదులతో కలిసి మెలిసి తిరిగేవాడు. వారు స్త్రీ విద్యపట్ల ఎంతో అభిమానాన్ని ప్రదర్శించేవారు. అలాంటి వాతావరణంలో పెరిగిన రుక్మాబాయి ఆకాలం నాటి స్త్రీలకు సాహసం అనిపించే పనులు చేయడానికి పూనుకోవడం ఆశ్చర్యం కలిగించదు. ఒకానొక సందర్భంలో ఆమె ''బడి మానేసిన తర్వాత నాకు వైవాహిక జీవితం మీద భరించలేనంత అసహ్యం, చదువు మీద విపరీతమైన ఆరాధనా ఏర్పడ్డాయి. పదకొండేండ్ల తర్వాత బడికెళ్లే అవకాశం దొరక్కపోయినా ఇంటి దగ్గరే ఇంగ్లీష్ నేర్చుకున్నాను. మన హిందూ స్త్రీల ప్రస్తుత పరిస్థితుల గురించి తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టి, నాకే గనక అధికారం ఉంటే ప్రస్తుత కష్టాలను తొలగించడానికి ఎంతో కొంత చెయ్యాలనుకునేదాన్ని'' అని తన గురించి రాసుకున్నారు.
షరతులు పెట్టారు
రుక్మాబాయి అహర్నిశలూ పోరాడి చదువును కొనసాగించింది. పరదాలో ఉన్న మహిళల సంక్షేమం కోసం స్థానిక లేడీ డాక్టర్లకు భారతదేశంలో మంచి గుర్తింపు ఉందని తెలిసి ఇంగ్లండు వెళ్లి మెడిసిన్ చదవాలనుకుంది. ఆమె కోసం బొంబాయిలో మేడం కామా హాస్పిటల్‌లోని డా||ఎడిత్ పీషె అనే సీనియర్ వైద్యాధికారి నిధులు సేకరించాడు. బ్రిటన్ వెళ్ళడం కోసం తన తల్లినీ, తాతనీ ఒప్పించడానికి ఆమె ఎంతో కష్డపడాల్సి వచ్చింది. చివరికి మూడు షరతులతో ఆమె తాత ఒప్పుకున్నాడు. మొదటిది ఆమె గొడ్డుమాంసం తినకూడదు, రెండోది ఇంగ్లీష్ వ్యక్తిని పెండ్లి చేసుకోవడం కానీ, క్రైస్తవ మతంలోకి మారడం కానీ చేయకూడదు. రుక్మాబాయి చివరి రెండు షరతులకు కట్టుబడి ఉండటం తనకు కష్టం కాదని చెప్పింది. గొడ్డుమాంసం తినడం పాపం కాదని అనుకుంది. 1889 మార్చి 24న బయలుదేరి సముద్రమార్గాన నాలుగు నెలలు ప్రయాణించి లండన్ చేరుకుంది. 1890లో లండన్ మహిళా వైద్య విద్యాలయంలో చేరింది. అక్కడ అభ్యుదయ భావాలు గల మెక్ లారెన్స్ దంపతులు ఆమెకు ఆశ్రయం కల్పించారు.
తానేంటో నిరూపించుకునే అవకాశం
చివరకు రుక్మాబాయి 1895 సెప్టెంబర్ 7న రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్ అర్హత పత్రాన్నిపొంది ఇంగ్లాండ్ మెడికల్ రిజిస్టర్లో గుర్తింపు సంపాదించింది. భారతదేశంలో పని చేయడానికి ఆసక్తి కనబరుస్తూ బొంబాయిలోని మేడం కామా హాస్పిటల్‌కి ఉత్తరం రాసింది. వైవాహిక బంధాన్ని వదులుకున్నందుకు ఆమెను అవమానించాలని ప్రయత్నిస్తున్న సంప్రదాయ హిందువులకు బదులు చెప్పాల్సింది చాలా ఉంది. తిరిగొచ్చి తనేంటో నిరూపించే సమయం ఆసన్నమైంది.
ఆసుపత్రి నిర్వహణా బాధ్యతలు
భారతదేశానికి డాక్టర్‌గా రుక్మాబాయి సరైన సమయంలో వచ్చింది. మేడం కామా హాస్పిటల్లో పని చేయడం ప్రారంభించాక ఒక అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. డఫరిన్ నిధి భారతీయ రోగులను ఆదుకోడానికి మహిళా వైద్యుల కోసం భారతదేశంలో అన్వేషణ మొదలుపెట్టింది. ఈ పథకం కింద సూరత్‌లో షేత్ మొరార్జీ విభుకందాస్ మలావి అనే దాత పేరు మీద నిర్మించిన ఆసుపత్రి నిర్వహణ బాధ్యత వహించమని రుక్మాబాయికి పిలువు వచ్చింది. ప్రస్తుతం ఆ ఆసుపత్రిని రుక్మాబాయి ఆసుపత్రి అని పిలుస్తున్నారు. గోడమీద ఆమె చిత్రపటం వేలాడదీసి ఉంటుంది. రుక్మాబాయి అక్కడ ప్రధాన వైద్యాధికారిగా 22 సంవత్సరాలు పని చేసింది. కుటుంబం నుంచి వచ్చే ఆక్షేపణలను ఎదుర్కొంటూ తనకు అండగా నిలిచే సహౌద్యోగుల, అభ్యుదయ వాదుల బృందాన్ని కూడగట్టుకుని అందరూ గర్వించేలా హుందాగా జీవించింది.
మురికి కూపాల్లో పురుళ్లు
ఇప్పటిలాగే అప్పుడు కూడా సూరత్‌లో సంప్రదాయానికి ప్రాణమిచ్చే టెక్స్టైల్, వజ్రాల వ్యాపారులదే పైచేయిగా ఉండేది. స్త్రీలు ఇంచుమించు పరదాల్లోనే ఉండేవారు. ఎప్పుడో కానీ ఇంటి నుంచి బయటకువెళ్ళే అవకాశం ఉండేది కాదు. చీకటి మురికి కూపాల్లాంటి గదుల్లో పురుడు పోసుకునేవారు. కానా ఆనందిబాయి, రమాబాయి, గురుబాయి కర్మార్కర్, రుక్మాబాయిలు మహారాష్ట్రలో నడిపిన అభ్యుదయ ఉద్యమ ప్రభావంతో గుజరాత్‌లోని మహిళలకు విద్య, స్వేచ్ఛా స్వాతంత్రాల గురించి మొదటిసారిగా ఆలోచన మొదలైంది. రుక్మాబాయి ప్రగతిశీల ఉద్యమానికి కరదీపక అయ్యింది.
మహిళల్లో ఆత్మవిశ్వాసం నింపింది
ఆమె మొట్టమొదట చేసిన పని మహిళలు తన ఆసుపత్రిని సందర్శించేలా వారిలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించడం. ఆ రోజుల్లో స్త్రీలు ఇంటి దగ్గరే, ఎక్కువగా ఆనారోగ్యకర వాతావరణంలో పురుళ్ళు పోసుకునేవారు. ఎప్పుడో కానీ ఆసుపత్రికి వెళ్ళేశారు కాదు. ఒకరోజు రుక్మాబాయి రోడ్డుమీద గర్భంతో ఉన్న గొర్రెను చూసి ఆసుపత్రికి తీసుకెళ్ళి దానికి పురుడుపోసింది. ఈ విచిత్ర సంఘటన మహిళల్లో నమ్మకాన్ని కలిగించింది. వెంటనే ప్రసవ సమయం సమీపించిన అతికొద్దిమంది గర్భిణీ స్త్రీలు ఆసుపత్రికి రావడం మొదలుపెట్టారు.
స్త్రీలను సమావేశ పరిచి
సంప్రదాయాలను వ్యతిరేకిస్తూ రుక్మాబాయి ఒక మహిళా సమాజాన్ని కూడా స్థాపించింది. 1890లో మహిలలు ఒకచోట సమావేశమైతే చాలా అనుమానంగా చూసేవారు. స్త్రీలంటే పురుషుల సంరక్షణలో ఇంటిపట్టునే ఉండాలి కానీ బయట కాదని వాళ్ళ నమ్మకం. అందుకే పవిత్ర గ్రంథాల పఠనం అనే పేరుతో స్త్రీలకు తన ఇంట్లో సమావేశం ఏర్పాటు చేసేది. క్రమంగా ఆ స్త్రీలు అదనపు సంపాదన కోసం కుట్టుపని, పచ్చళ్ళ తయారీ, చేతివృద్దులు ప్రారంభించి బాహ్యప్రపంచంలో జరిగే విషయాలు తెలుసుకోడానికి వార్తా పత్రికలకు చదివేవారు.
తుదిశ్వాస వరకు
ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్న రుక్మాబాయి జీవితం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తసాగింది. 1917లో ఆమె సూరత్‌ని విడిచిపెట్టి రాజ్‌కోట్ వెళ్ళి రసూల్ కాజీ జనానా స్త్రీల వైద్యశాలలో ప్రాక్టీస్ చేసింది. ఉద్యోగ విరమణ తర్వాత ముంబాయి వెళ్ళిపోయింది. పదరా సంప్రదాయం, బాల్యవివాహం, స్త్రీలను మండువాలకే పరిమితం చేయడం వంటివాటిని ఖండిస్తూ తుదిశ్వాస విడిచేవరకూ తొలి స్త్రీవాదిగానే జీవించింది. ఆమె ప్రచురించిన 'పదరా: నిర్మూలన ఆవశ్యకత' అనే కరపత్రానికి విశేష ప్రచారం లభించింది. అందులో స్త్రీలను విద్యావంతులను చేయడం, వారికి అవకాశాలను కలిగించడం గురించి రాసింది.
తన జీవితాన్ని తనే తీర్చిదిద్దుకుంది
రుక్మాబాయి సంప్రదాయాల ధిక్కారాన్ని గొప్ప వారసత్వంగా ఇచ్చి, లేడీ డాక్టర్లకు ఒక నమూనాగా ఉపయోగపడింది. 1884లో ఒక శూద్రమహిళ హిందూమత ఛాందసాన్ని ఎదిరించి తన జీవితాన్ని తనే తీర్చిదిద్దుకోవడం అనేది ఎంతో సాహసంతో కూడిన విషయం. రుక్మాబాయి లక్ష్య సాధనకోసం కష్టాలూ కన్నీళ్ళూ అవమానాలూ ఛీత్కారాలూ భరించింది.
సేకరణ: 'లేడీ డాక్టర్స్' పుస్తకం నుండి