Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన శరీరంలో ఉన్న అతి ముఖ్యమైన, సున్నితమైన భాగాల్లో గుండె కూడా ఒకటి. అటువంటి గుండె ఆరోగ్యంగా ఉండటం కోసం ప్రతిఒక్కరూ ముందు నుంచే జాగ్రత్తలు తీసుకొంటూ సంరక్షించుకోవాలి. గుండెను సంరక్షించుకోవడం కోసం మన ఆహారంలో భాగం చేసుకోవాల్సిన కొన్ని పదార్థాలేంటో చూద్దాం...
గుండె సురక్షితంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో ఒమేగా - 3 ఫ్యాటీ ఆమ్లాలు, పీచుపదార్థాలు ఎక్కువగా ఉండాలి. కాబట్టి అవిసె గింజల్ని ఆహారంలో భాగంగా తీసుకోవడం చాలా మంచిది.
కొవ్వులు తక్కువగా ఉండే పల్లీలు, బాదం, పిస్తా.. వంటి నట్స్‌ను రోజూ తీసుకునే ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటి నుంచి కేవలం పీచుపదార్థాలే కాకుండా గుండె సంరక్షణకు ఎంతగానో అవసరమైన విటమిన్ 'ఇ' కూడా లభిస్తుంది.
లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ ఎక్కువ, క్యాలరీలు తక్కువగా ఉండే టమాటాలు తినండి. ఇది గుండె చుట్టు పక్కల అనవసర కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. ఫలితంగా గుండెపోటు రాకుండా జాగ్రత్తపడచ్చు.
డార్క్ చాక్లెట్ తినడం వల్ల గుండె ఆరోగ్యానికి మంచిదని పలు పరిశోధనల్లో వెల్లడైంది. కాబట్టి కనీసం రోజుకి ఒక్క బైట్ చొప్పున డార్క్ చాక్లెట్ తినండి. గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా జాగ్రత్తపడండి.
రోజూ కనీసం నాలుగు కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం దాదాపు 20 శాతం తగ్గుతుందని పరిశోదనలు చెబుతున్నాయి.
గుండె సంరక్షణకు యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్లు, ఒమేగా - 3 ఫ్యాటీ ఆమ్లాలు చాలా అవసరమని మనకు తెలుసు. మరి ఇవన్నీ ఒకే ఆహార పదార్థంలో లభించాలంటే ప్రతిరోజూ ఆహారంలో భాగంగా ఆకుకూరలు తీసుకోవడం చాలా ముఖ్యం.
ఓట్స్ మనం బరువు తగ్గడానికి మాత్రమే కాదు.. గుండెను ఆరోగ్యంగా ఉంచడానికీ ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇందులో ఉండే పీచుపదార్థం శరీరంలోని కొవ్వును గ్రహిస్తుంది. దీనివల్ల రక్తంలో కొవ్వు స్థాయి తగ్గి, గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
పెరుగు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికీ తెలుసు. దీనివల్ల గుండె సురక్షితంగా ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది. రోజూ పెరుగును మీ ఆహారంలో భాగం చేసుకోవడం మరచిపోకండి.