Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉద్యోగి సమర్థంగా పనిచేయాలంటే పని, జీవితం బ్యాలన్స్, విశ్రాంతి, పునరుత్తేజితం.. ఈ మూడూ చాలా కీలకం. అందుకే కొన్ని కంపెనీలు ఉద్యోగులకు సెలవులు ఇస్తుంటారు. ఈ సమయంలో కుటుంబంతో గడపడం, వెకేషన్‌కి వెళ్లడం, కొత్త అభిరుచిని అలవర్చుకోవడం.. ఇలా ఎవరికి నచ్చినట్టుగా వాళ్లు గడపడం వల్ల ఉద్యోగుల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇది పరోక్షంగా సంస్థ అభివృద్ధికీ దోహదం చేస్తుంది..' అంటూ ఓ సంస్థ హెచ్ఆర్ విభాగం పేర్కొంది. ఉద్యోగికి పని నుంచి ఇలా కొన్ని రోజుల పాటు విరామం ఇవ్వడం వల్ల బహుళ ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. మరోవైపు సంస్థకూ పరోక్షంగా మేలు చేకూరుతుందని చెబుతున్నారు. అవేంటో మనమూ తెలుసుకుందాం...
ఇలాంటి సెలవుల వల్ల ఉద్యోగులు దీర్ఘకాలిక ఒత్తిడికి గురి కాకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే పని ప్రదేశంలో చిరాకు పడడం, సహోద్యోగులపై విరుచుకుపడడం (వర్క్‌ప్లేస్ బర్నవుట్).. వంటివి చాలా వరకు తగ్గుతాయంటున్నారు నిపుణులు.
రోజూ బిజీగా ఉండే ఉద్యోగులకు ఇలాంటి సెలవులు వరమనే చెప్పుకోవాలి. ఎందుకంటే తమకు నచ్చిన అభిరుచిపై దృష్టి పెట్టడానికి రోజూ సమయం ఉండదు.. ఈ సెలవుల్ని అందుకోసం వినియోగించుకొని మానసిక ప్రశాంతత పొందచ్చు.
రోజులో ఎక్కువ సమయం పని చేయడం వల్ల నిరంతరాయంగా పీసీ ముందే కూర్చోవాల్సి వస్తుంది. దీనివల్ల హృద్రోగం, స్థూలకాయం, మధుమేహం, డిప్రెషన్.. వంటి దీర్ఘకాలిక సమస్యలొస్తున్నాయంటున్నారు నిపుణులు. అందుకే పనికి పూర్తి విరామం ప్రకటిస్తే ఈ సమస్యలకు చాలా వరకు దూరంగా ఉండవచ్చంటున్నారు.
పనికి దూరంగా ఉండడం వల్ల శరీరం పునరుత్తేజితమవుతుంది.. ఇది ఆలోచనా సామర్థ్యాన్ని సైతం పెంచుతుంది. తద్వారా సృజనాత్మకతను రెట్టింపు చేసుకొని పనిలో మరింత మెరుగ్గా రాణించచ్చు.
పని నుంచి ఇలాంటి విరామాలు తీసుకోవడం వల్ల శారీరక, మానసిక అలసటను దూరం చేసుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
కొత్త కోర్సులు, టెక్నాలజీలో అప్డేట్ కావాలనుకునే వారికి ఈ విరామం చక్కగా ఉపయోగపడుతుంది. ఈ నైపుణ్యాల్ని మీ ఉద్యోగంలో ప్రదర్శించి ఉన్నత స్థితికి చేరుకోవచ్చు.
వృత్తిపరంగానే కాదు.. వ్యక్తిగతంగానూ ఈ విరామ సమయాల్లో మంచి అలవాట్లు ప్రారంభించచ్చు. ఉదాహరణకు.. వ్యాయామం, ధ్యానం.. వంటివి ప్రారంభించి ఆ తర్వాత కూడా కొనసాగించడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.