Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దసరా పండుగ నాడు ఎన్నో రకాల పిండి వంటలు, రకరకాల స్వీట్లు, పదార్థాలు తయారు చేస్తారు. ఈ పండుగ రోజు వివిధ ప్రాంతాల్లో తయారు చేసుకునే రకరకాల వంటల గురించి తెలుసుకుందాం.. కమ్మని వంటలతో పండుగ చేసుకుందాం. అతిథులకు విందు ఏర్పాటు చేద్దాం...
రవ్వ బొబ్బట్లు
కావలసిన పదార్ధాలు: రవ్వ - కప్పు, మైదా - రెండు కప్పులు, గోధుమ పిండి - అరకప్పు, పంచదార - రెండు కప్పులు, సోడా - చిటికెడు, నెయ్యి - రెండు టీ స్పూన్లు, నూనె - అర కప్పు.
తయారు చేసే విధానం: ముందుగా మైదా, గోధుమపిండి రెండింటినీ సమపాళ్ళలో తీసుకొని కలపాలి. దానిలో తగినన్ని నీళ్లు, వంట సోడా వేసి పూరీ పిండిలా కలిపి మూతపెట్టి ఉంచాలి. తర్వాత పాన్లో నెయ్యి పోసి రవ్వను దోరగా వేయించి ఉంచాలి. అడుగు మందంగా ఉన్న గిన్నెలో మూడు కప్పుల నీళ్లు పోసి స్టౌ మీద పెట్టాలి. నీళ్లు బాగా మరుగుతుండగా వేయించిన రవ్వ వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉడికించాలి. రవ్వ ఉడికిందనుకున్న తర్వాత పంచదార, యాలకులపొడి వేసి కలపాలి. ఇది పూర్ణం చేయడానికి సరిపడేలా చిక్కబడిన తర్వాత పక్కకు దింపుకొని నిమ్మకాయ సైజులో ఉండలు చేసుకోవాలి. ఇప్పుడు మైదా పిండిని చిన్న సైజు పూరీలా ఒత్తి మధ్యలో రవ్వ పూర్ణాన్ని పెట్టి చుట్టూతా పూరీతో మూసేసి మళ్లీ దాన్ని కర్రతో లేదా చేత్తో బొబ్బట్టులా ఒత్తి పెనం మీద నూనె లేదా నెయ్యి పోస్తూ రెండువైపులా కాల్చి తీయాలి.
పూర్ణం భక్షాలు
కావలసిన పదార్థాలు: శెనగపప్పు - అరకప్పు, మైదా - అర కేజీ, ఏలకులు - ఆరు, నెయ్యి - కప్పు, వంటసోడా - చిటికెడు, పాలిథీన్ కవర్ - ఒకటి, బెల్లం - అరకేజీ, నూనె - సరిపడా, ఉప్పు - చిటికెడు.
తయారు చేసే విధానం: ముందుగా వెడల్పుగా ఉన్న ప్లేట్ లో మైదా జల్లించి దానికి వంటసోడా, ఉప్పు కలపాలి. అందులో నెయ్యి వేసి నీళ్లు పోసి జారుగా కలపాలి. ఈ మైదాకు మధ్యలో గుంట చేసి కప్పు నూనె పోసి ఆకు మూత పెట్టాలి. నీరు మరిగించి శెనగపప్పుకి బెల్లం, ఏలకుల పొడి కలిపి మెత్తగా రుబ్బాలి. ఈ ముద్దని మనకి నచ్చినంత సైజు ఉండలు చేయాలి. నానిన మైదా ముద్దని నూనె పూసిన పాలిథీన్ కవరు మీద పరిచి, శెనగపప్పు బెల్లం ముద్దని మధ్య పెట్టి చుట్టూ మూసి భక్షాన్ని పల్చగా వత్తి దళసరిపెనం మీద నెయ్యితో మాడకుండా కాల్చాలి. అతిథులకు ఇవి వడ్డిస్తే తినేందుకు ఎంతో రుచికరంగానూ వుంటాయి. అయితే వీటిని మాడనివ్వకుండా శ్రద్ధ వహించాలి.
సాబుదాన వడలు
కావలసిన పదార్థాలు: సాబుదానా - కప్పు, ఆలూ - ఒకటి(ఉడికించి పొట్టుతీసినది), పచ్చిమిర్చి - ఎనిమిది, ఉప్పు - రుచికి సరిపడ, నూనె - వేయించడానికి సరిపడ.
తయారు చేసే విధానం: ముందుగా సాబుదానాలో నీళ్లు పోసి కడగాలి. తర్వాత అందులో నీళ్లు పోసి రెండు మూడు గంటలు నాననివ్వాలి. నానిన తర్వాత సాబుదానా, ఆలూ, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు అన్నీ ఒక బౌల్లో వేసి బాగా కలుపుకోవాలి. నూనె వేడి చేయాలి. సగ్గుబియ్యం మిశ్రమాన్ని చిన్న చిన్న వడలుగా చేతితో వత్తు కోవాలి. సన్నని మంట మీద నూనెను వుంచి వీటిని అందులో వేసి నెమ్మదిగా బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. ప్లేటులో పేపర్ నాప్కిన్ వేసి దానిపై వేయించిన వడలు వేసుకోవాలి. ఎక్కువగా వున్న ఆయిల్ అది పీల్చుకుంటుంది.
పూర్ణం బూరెలు
కావాలసిన పదార్థాలు: మినపప్పు - కప్పు, బియ్యం - రెండు కప్పులు, శెనగపప్పు - రెండు కప్పులు, బెల్లం - రెండు కప్పులు, యాలకుల పొడి - అర టీస్పూను, నెయ్యి - అర కప్పు, నూనె - సరిపడ.
తయారు చేసే విధానం: ముందుగా మినపప్పు, బియ్యాన్ని కడిగి సరిపడా నీళ్ళు పోసి సుమారు నాలుగైదు గంటల పాటు నానబెట్టాలి. తర్వాత మెత్తగా రుబ్బి పక్కకు పెట్టుకోవాలి. శెనగపప్పును కుక్కర్లో వేసి తగినంత నీళ్ళు పోసి ఉడికించాలి. ఇందులో తరిగిన బెల్లం వేసి కలిపి తడిపోయేంత వరకు మళ్ళీ ఉడికించుకోవాలి. లేకుంటే వేయించేటప్పుడు విడిపోయి నూనెలో కలసిపోతుంది. చివరలో యాలకుల పొడి, నెయ్యి వేసి కలిపి దింపేయాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత నిమ్మకాయ సైజులో ఉండేవిధంగా ఉండలు చేసుకోవాలి. ఇలా అన్నింటిని చేసుకున్న తర్వాత స్టౌ వెలిగించి పాన్ పెట్టి నూనె వేయాలి. నూనె కాగిన తర్వాత ఉండలను మినపప్పు, బియ్యం మిశ్రమంలో పూర్తిగా ముంచి నూనె వేయాలి. బంగారు వర్ణం వచ్చేంత వరకు వేయించాలి.
పెసరపప్పు పొంగలి
కావలసిన పదార్థాలు: బియ్యం - కప్పు, పెసరపప్పు: కప్పు, బెల్లం - రెండు కప్పులు, నీళ్ళు - నాలుగున్నర కప్పులు, జీడిపప్పు - 10, కిస్మిస్ - పది, ఎండుకొబ్బరి ముక్కలు - అర కప్పు, ఏలకుల పొడి - అర టీస్పూను, నెయ్యి - అర కప్పు.
తయారు చేసే విధానం: ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి దానిలో నెయ్యి మొత్తాన్ని వేసి ముందుగా ఎండుకొబ్బరి ముక్కలను కొంచెం ఎర్రగా మంచి సువాసన వచ్చేదాకా వేయించి దానిలోనే జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని బియ్యం, పెసరపప్పు కలిపి కడిగి నాలుగున్నర కప్పుల నీరు పోసి స్టౌ మీద పెట్టుకోవాలి. దానిని అన్నం వండినట్టుగానే ఉడికించుకుంటూ (అన్నం మొత్తం పలుకు లేకుండా ఉడకాలి. అన్నం మొత్తం ఉడికిన తర్వాత ఎసరు లేకపోతే కొంచెం నీరు పోసుకోవచ్చు) కొంచెం నీరు ఉన్నప్పుడే దానిలో బెల్లం తురుము వేసి కరిగేదాకా మధ్యలో కలుపుతూ అడుగు అంటకుండా చూసుకోవాలి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్తో పాటుగా నెయ్యి పోసి బాగా కలపాలి. అంతే.. ఎంతో రుచికరమైన స్వీట్ పెసర పప్పు పొంగలి రెడీ. నవరాత్రి సందర్భంగా కేరళా, తమిళనాడులో ఈ వంటకాన్ని ప్రత్యేకంగా తయారు చేస్తారు.