Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రక్కీ తిమోతీ... తన భర్త బిజు జార్జ్‌తో కలిసి 2020లో గ్రామ్యం అనే సంస్థను స్థాపించారు. ప్రస్తుతం ఈ జంట కేరళలోని ఐదు క్రాఫ్ట్ కమ్యూనిటీలతో కలిసి పని చేస్తుంది. కనుమరుగవుతున్న హస్తకళలకు తిరిగి జీవం పోసేందుకు ముందుకు వచ్చారు. ఈ ప్రాంతంలోని మహిళా హస్తకళాకారుల జీవనోపాధిని పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ వివరాలేంటో మనమూ తెలుసుకుందాం...
రక్కీ తిమోతీ లేబర్ ఎకనామిస్ట్‌గా దశాబ్ద కాలం పాటు పనిచేశారు. తన వృత్తిలో భాగంగా తరచుగా అనధికారిక రంగంలోని కార్మికుల పరిస్థితులను దగ్గరగా చూసే అవకాశం వచ్చింది. వారి ఉపాధి అవకాశాలను చూసి ఎంతో బాధపడ్డారు. ముఖ్యంగా భారతదేశంలో చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారి కష్టాలను విని కదిలిపోయారు. వారు జీవనోపాధి కోసం ఎన్నో ఇబ్బందులు పడడం కళ్ళారా చూశారు. ''భారతీయ చేతివృత్తులను మెరుగుపరచడానికి ఏదైనా చేయాలని అనుభవించాను. అవి గ్లోబల్ మార్కెట్లో అందుబాటులో ఉంటే గ్రామీణ హస్తకళాకారుల జీవితాలను మార్చేయవచ్చనే ఆలోచన వచ్చింది'' అని ఇటీవల కొచ్చిలో జరిగిన కేరళ స్టార్టప్ మిషన్ మహిళల స్టార్టప్ సమ్మిట్‌కు హాజరైన ఆమె చెప్పారు.
స్థానిక చేతివృత్తుల కోసం
సింగపూర్ మేనేజ్మెంట్ యూనివర్శిటీలో పోస్ట్-డాక్టోరల్ రీసెర్చ్ చేయడానికి సింగపూర్‌కు వెళ్లేముందు వివి గిరి నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూట్లో ఏడేండ్లపాటు ఫ్యాకల్టీ మెంబర్‌గా పనిచేసిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. సింగపూర్‌లో కొన్ని సంవత్సరాలు గడిపిన తర్వాత రక్కీ, ఆమె భర్త బిజు కేరళకు మకాం మార్చాలని నిర్ణయించుకున్నారు. ''మేమిద్దరం స్థానిక చేతివృత్తుల వారికి ప్రయోజనం చేకూర్చడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా జ్ఞానాన్ని, అనుభవాలను ఉపయోగించాలని నిర్ణయించుకున్నాము'' అన్నారు ఆమె.
జీవనోపాధిని నిర్మించడం
''గ్రామ్యం ఎలా ఏర్పడింది'' అని రక్కీని అడిగితే 2020లో గ్రామ్యం (గ్రామాల నుండి)ను ప్రారంభించారు. ఇది చేతితో తయారు చేసిన, పర్యావరణ అనుకూలమైన, స్థిరమైన ఉత్పత్తులతో వ్యవహరించే ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్. ప్రామాణికమైన హస్తకళా ఉత్పత్తుల పట్ల వారికున్న ప్రేమ, చేతివృత్తుల వారికి స్థిరమైన జీవనోపాధిని నిర్మించాలనే అభిరుచి కారణంగా వారు ఈ ఆలోచనకు ఆకర్షితులయ్యారని రక్కీ చెప్పారు. చాలా వరకు సాంప్రదాయ హస్తకళా సంఘాలకు ఆర్థికంగా లాభదాయకమైన జీవనోపాధి లేదని అందరికీ తెలుసు. మహమ్మారి వారిని మరింత కుంగదీసింది. వృత్తిలో గౌరవం లేకపోవడం, గిగ్ వర్క్ వంటి ఇతర ఎంపికల లభ్యత వంటి కారణాలను చెబుతూనే యువతరం కళాకారులు సాంప్రదాయ వ్యాపారాలను కొనసాగించడానికి ఇష్టపడరని రక్కీ చెప్పారు.
ఉత్పత్తులకు మెరుగైన ధరలు
ఇలాంటి పరిస్థితుల్లోనే గ్రామ్యం మార్పు తెస్తోంది. ఆమె ప్రకారం సంస్థ కేరళలోని క్రాఫ్ట్ కమ్యూనిటీలతో కొత్త డిజైన్లు, మార్కెట్లను పరిచయం చేయడానికి భాగస్వాములను చేస్తుంది. వారికి ఉత్పత్తులకు మెరుగైన ధరను అందిస్తుంది. ''గిరిజన సంఘాలు తయారు చేసిన కన్నడిపాయ వంటి కనుమరుగవుతున్నా చేతివృత్తుని పునరుద్ధరించడానికి గ్రామ్యం జోక్యం ఎంతో దోహదపడింది. మేము వారి నైపుణ్యాలను అప్‌గ్రేడ్ చేయడానికి వారికి వర్కింగ్ క్యాపిటల్, శిక్షణ సౌకర్యాలను అందించాము'' అని ఆమె చెప్పారు.
ఐదు క్రాఫ్ట్ కమ్యూనిటీలతో
ఉత్పత్తులకు సాధారణ మార్కెట్‌ను అందించడమే కాకుండా కమ్యూనిటీలు తమ ఉత్పత్తులను మార్కెట్ చేయడానికి దుకాణాలను ఏర్పాటు చేయడంలో సంస్థ సహాయపడింది. ''మేము దీనిని కేరళలోని ఇడుక్కి జిల్లాలోని ఆదిమాలిలో ఏర్పాటు చేశాము. ఎందుకంటే హస్తకళాకారులు తమ ఉత్తమ ప్రయత్నంలో పాల్గొనడానికి ప్రేరేపించబడితేనే నాణ్యమైన చేతివృత్తులు కార్యరూపం దాల్చుతాయని మేము నమ్ముతున్నాము'' అని ఆమె చెప్పారు. ఈ సంస్థ ప్రస్తుతం కేరళలోని ఐదు క్రాఫ్ట్ కమ్యూనిటీలతో పనిచేస్తుంది. అవి కుతంపల్లి (టెక్స్టైల్), కలవూరు (బాస్కెట్రీ), చెందమంగళం (టెక్స్టైల్), కిలిమంగళ (నేచురల్ ఫైబర్స్), అరువాకోడ్, నిలంబూర్ (టెర్రకోట).
ప్రస్తుతం వైవిధ్యభరితంగా ఉంది
ఉత్పత్తులలో చేనేత (కాటన్ దుపట్టాలు, స్టోల్స్, చీరలు, గృహోపకరణాలు), టెర్రకోట క్రియేషన్స్ (కుక్ అండ్ సర్వ్ వేర్) ఉన్నాయి. గ్రామ్యం ఇప్పుడు కలప, వెదురు, మెటల్ క్రాఫ్ట్ ఉత్పత్తులలో వైవిధ్యభరితంగా ఉంది. ఇది ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు. ధరల శ్రేణి గురించి అడిగినప్పుడు ఉత్పత్తులు ఉద్దేశపూర్వకంగా సరసమైన పరిధిలో ఉంచబడుతున్నాయని రక్కీ చెప్పారు. వీటి ధరలు రూ.500 నుంచి మొదలై రూ.4,000 వరకు ఉన్నాయి. ''ఉత్పత్తుల నాణ్యతను నిర్ధారించడానికి, ఉత్పత్తి ప్రక్రియలో రసాయనాలు జోడించబడకుండా చూసుకోవడానికి మేము చాలా కృషి చేస్తున్నాము. మా ఉత్పత్తులన్నీ చేతితో తయారు చేయబడినవి. బల్క్ ఆర్డర్ల కోసం మా దగ్గర ఆకర్షణీయమైన తగ్గింపులు ఉన్నాయి'' అని ఆమె చెప్పారు.
మహిళలకు మద్దతుగా
ఈ సంస్థ నేత కార్మికులు, కుమ్మరులు, సహజ ఫైబర్లను రూపొందించడంలో ఉన్న జాతి సంఘాలతో విస్తృతంగా పని చేస్తుంది. అయితే మహిళా హస్తకళాకారులు వాణిజ్యంలో కొనసాగేలా ప్రత్యేక కృషి చేస్తుంది. ''మేము వ్యవహరించే అనేక కమ్యూనిటీలలో మాస్టర్ క్రాఫ్ట్పర్సన్ ఒక మహిళ. మేము వారితో కలిసి పని చేయడాన్ని గర్వంగా భావిస్తున్నాము. మా దుపట్టాలన్నీ మహిళా నేత కార్మికులే నేస్తారు. దుపట్టాకు తగిలించిన కుచ్చులను ఇతర మహిళా కార్మికులు తయారు చేసి కుట్టారు. కిల్లిమంగళం చాపలను కూడా మహిళా నేత కార్మికులే తయారు చేస్తారు. అయితే యూనిట్ భయంకరమైన స్థితిలో ఉంది. మేము భవన నిర్వహణ కోసం నిధులను సమకూర్చుకునే ప్రయత్నంలో ఉన్నాము. సురక్షితమైన, సౌకర్యవంతమైన పని వాతావరణాన్ని నిర్ధారించాలనుకుంటున్నాము. తద్వారా మహిళలు పనిని కొనసాగించడానికి, వారు చేస్తున్న వాటికి విలువ ఇవ్వడానికి ప్రేరేపించబడతారు. ఇతర వర్గాల విషయంలోనూ తాము అనుసరిస్తున్న నమూనా ఇదే'' అని రక్కీ చెప్పారు. రూ.4 లక్షల తొలి పెట్టుబడితో ప్రారంభమైన గ్రామ్యంలో ఇప్పుడు ఐదుగురు రెగ్యులర్ సిబ్బంది ఉన్నారు. హస్తకళాకారులు వారి అన్ని ఉత్పత్తులను రూపొందించడంలో సహాయం చేసిన తర్వాత గ్రామ్యం సేకరించినప్పుడు వారికి 10-15శాతం మార్జిన్ లభిస్తుంది.
ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది
సామాజిక వ్యాపారంలో ప్రయాణం ఈ జంటకు అంత సాఫీగా సాగలేదు. వృత్తినిపుణుల కుటుంబం నుండి రావడం, వ్యాపారాన్ని ప్రారంభించడానికి కెరీర్‌ని మార్చడం అంత తేలికైన నిర్ణయం కాదు. ''బిజూ 20 సంవత్సరాలకు పైగా విదేశాలలో పని చేసి వచ్చాడు. దాంతో చేతివృత్తుల గురించి పెద్దగా అవగాహన లేదు. ముఖ్యంగా నిబంధనలు, స్థానిక వ్యాపార సంస్కృతిని ఎదుర్కోవలసి వచ్చింది. సరైన పరిచయాలను ఏర్పరచుకోవడం, వృత్తిపరమైన సహాయం కోరడం ఈ అంశంలో సహాయపడింది కానీ తగిన జాబితా స్థాయిని నిర్వహించడం మరొక సవాలు.
విదేశాలతో ఒప్పందాలు
''మేము క్రాఫ్ట్ కమ్యూనిటీలతో మంచి సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్స్‌ని ఉపయోగించుకున్నాము'' అని రక్కీ చెప్పారు. ఈ జంట ఈ సంవత్సరం చివర్లో ఇతర దక్షిణాది రాష్ట్రాలకు విస్తరించాలని, రాబోయే సంవత్సరాల్లో భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో కమ్యూనిటీలను రూపొందించాలని భావిస్తున్నారు. ''గ్లోబల్ సిటీలలో మా ఉత్పత్తులను మెరుగుపరచడానికి యుఎస్‌లోని కొంతమందితో మేము ఒప్పందాలను చర్చిస్తున్నాము'' అని ఆమె చెప్పారు.