Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చదువు ద్వారా మంచి కెరియర్లో స్థిర పడొచ్చు. పరిణితి ఉంటే ఎక్కడైనా, ఎవరి మధ్యనైనా జీవించగలిగే సామర్థ్యాన్ని పొందొచ్చు. పరిణితి పలు అంశాలతో ముడిపడి ఉంటుంది.
అవగాహన: మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని గుర్తించగలగాలి. ఈ సామాజికపరమైన అవగాహనతో ఇతరుల భావోద్వేగాలు అర్థమవుతాయి. వాటికి తగినట్టుగా అడుగు లేయాలి. అలాగే ఇతరులతో బంధాలను కాపాడుకొనే నైపుణ్యం తెచ్చుకోవాలి. సానుకూల ఆలోచనావిధానాన్ని అలవరుచుకోవాలి. ఇతరుల సామర్థ్యాలనూ గుర్తించగలగాలి. సమస్య వచ్చినప్పుడు మనవైపు నుంచే కాక అవతలి వారి కోణం నుంచి కూడా ఆలోచించగలగాలి. ఎదుటివారు చెప్పేది పూర్తిగా వినడం తెలిసినప్పుడే టీం లీడర్‌గా స్థానాన్ని సంపాదించడమే కాదు, ప్రతి ఒక్కరికీ బాధ్యత తెలుపుతూ.. స్ఫూర్తిదాయకంగా ఎదుగుతాం.
నేర్చుకోవాలి: సహోద్యోగుల ప్రత్యేకతలను గుర్తించాలి. వారి నుంచి కొత్త విషయాల్ని నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అన్నీ నాకు తెలుసనే ఆలోచన మంచిది కాదు. ఎప్పటికప్పుడు నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవారే మానసిక పరిణితి సాధించగలరు. ఎదుటివారు తమ అభిప్రాయాలను చెబుతున్నప్పుడు వాటికి మర్యాదనివ్వాలి. వాటి వల్ల సరైన ఫలితాలు లేకపోతే మన అభిప్రాయాన్ని కూడా సున్నితంగా చెప్పగలిగే స్వీయ నియంత్రణ ఉండాలి. మన బలహీనతలను బలాలుగా మార్చుకోవడానికి కృషి చేయకపోతే అపజయమే ఎదురవుతుంది. ఉద్యోగ బాధ్యతలను స్వీకరించి పూర్తిచేయడానికి సామర్థ్యాలను పెంచుకుంటూ ఉంటే, మరెన్నో కొత్తపాఠాలను నేర్చుకోవచ్చు. కెరియర్లో విజయాలు సాధించొచ్చు.