Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోజూ సరైన సమయానికి నిద్రపోయేలా చేయడమే కాదు, ఉదయం అనుకున్న టైంలో లేవడానికి కూడా ఓ పద్దతి ఉంది. సాధారణంగా జీవనశైలి సరిగ్గా లేనప్పుడు అది మెదడును నిద్రలోకి జారనివ్వకుండా భంగపరిచి తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. శరీరానికి సరిపడేంత నిద్ర పోయినప్పుడు నరాలవ్యవస్థ, జీవక్రియలు సక్రమంగా పనిచేస్తాయి. నిద్రలేమి వీటన్నింటి పనితీరుపై చెడు ప్రభావం చూపుతుంది. దీంతో హృద్రోగాలు, శ్వాసకోశ వ్యాధులు, వ్యాధినిరోధక శక్తి తగ్గడం, మానసిక సమస్యలకు దారి తీస్తుంది. రోజూ ఏడెనిమిది గంటల నిద్రతో ఈ సమస్యలన్నింటినీ దూరంగా ఉంచొచ్చు.
మంచంపైకి చేరుకునే 2 గంటలకు ముందే పనంతా పూర్తిచేయాలి. బెడ్‌పైన కూడా ల్యాప్‌టాప్ పెట్టుకు కూర్చుంటే మనసంతా పనిపైనే ఉండి మెదడు నిద్రకి సిద్ధపడదు. ఆఫీసు లేదా ఇంటిపనిని ముందుగానే పూర్తి చేయడంతో మెదడు విశ్రాంతి దశలోకి వెళుతుంది. ఆ తర్వాత గంట ముందు నుంచే స్క్రీన్లకు దూరంగా ఉండాలి. అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది.
మీకు కెఫీన్ ఉత్పత్తులు అలవాటుంటే నిద్ర పోవడానికి పది గంట ముందే తీసుకోవాలి. తర్వాత వాటి జోలికెళ్లొద్దు. ఎందుకంటే ఇవి మెదడును విశ్రాంతి దశలోకి వెళ్లనివ్వవు. పైగా ఉత్సాహంగా ఉంచుతాయి. దీంతో రావాల్సిన సమయానికి నిద్ర రాదు. అందుకే ఉదయం మాత్రమే కాఫీని తీసుకోవాలి. అలాగే నిద్రకు 3 గంటల ముందే ఆహారాన్ని తీసుకోవాలి. లేదంటే జీర్ణాశయం పని చేస్తూ ఉండటం లేదా అజీర్తి వంటి సమస్యల వల్ల నిద్రా భంగం అవుతుంది. ఆహారాన్ని మితంగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.