Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంట్లోవాళ్లకి బాగోకపోతే దగ్గరుండి సపర్యలు చేస్తాం. మన విషయానికొచ్చేసరికి ఒక ట్యాబ్లెట్ వేసుకొని తిరిగి పనిలో పడతాం. తగినంత విశ్రాంతి లేకపోతే శరీరం మాత్రం ఎలా కోలుకుంటుంది? ఇలాంటప్పుడూ అన్నీ దగ్గరుండి చేయాలన్న తాపత్రయం వద్దు. ఇంకాస్త నీరసపడిపోతారు. చిన్నచిన్న పనుల వరకూ సరే! మిగతావి ఇంట్లోవాళ్లకి అప్పజెప్పండి.
పిల్లలు మిగిల్చారనో, అప్పటికప్పుడు ఆకలికి చెక్ చెప్పొచ్చని చల్లగా మారినవి, టీ బిస్కెట్లను తీసుకుంటున్నారా? ఇవీ నీరసాన్ని పెంచేవే. సమయం లేదనుకున్నప్పుడు పల్లీలు, నట్స్, పండ్లు వంటివి తీసుకోండి. వృథా అవుతాయని మీ పొట్టలో మాత్రం వేయొద్దు.
రోజూ మీ ఆహారంలో పప్పుధాన్యాలు, గింజలను తప్పనిసరి చేసుకోండి. తగినంత ప్రొటీన్ అందితేనే శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. తేలికపాటి వ్యాయామాల్నీ దినచర్యలో తప్పక భాగం చేసుకోవాలి. విటమిన్ ఇ కణాలపై ఒత్తిడి కలగకుండా చూసుకుంటుంది. ఇది ఎక్కువగా ఉండే గుమ్మడి విత్తనాలు, బాదం వంటివాటిని ఎక్కువగా తినాలి.
పనంతా పూర్తయ్యాక తప్పదు కాబట్టి నిద్ర అన్నట్టుగా కాక ఒక సమయాన్ని నిర్దేశించుకోండి. పని పూర్తయినా కాకపోయినా ఆ సమయానికి పడుకునేలా చూసుకోండి. నిద్రలేమి కూడా నీరసానికి కారణమే. సమయం ఉంటే పగలైనా చిన్న కునుకు తీయండి. దీంతోపాటు తగినంత నీరూ తీసుకుంటే నీరసానికి చెక్ పెట్టేయడం సులువే.