Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ రోజుల్లో ప్రతిదీ మాచింగ్తోనే చేస్తున్నారు. బట్టలైనా, రంగులైనా, ఫర్నిచర్ అయినా ఏదయినా మాచింగ్లోనే ఉండాలంటున్నారు. ఇంతకు ముందు చీరకు మాచింగ్ జాకెట్టు వేసుకుంటే సరిపోయేది. ఇప్పుడలా కాదు. చీర జాకెట్‌తో పాటు బొట్టు, లిప్‌స్టిక్, హెయిర్బ్యాండ్స్, గాజులు, నెక్లెస్‌లు, చెవిరింగులు అన్నీ మాచింగ్ వేస్తున్నారు. చివరకు చెప్పులు కూడా మాచింగ్ వేస్తూ ఇల్లు చెప్పుల షాపు చేస్తున్నారు. ఇంకా తల్లీ కూతుర్లు ఒకే రకమైన డ్రెస్సులు వేయడం కూడా వచ్చింది. అవి కూడా మారిపోయి ఫ్యామిలీ మొత్తం ఒకే రంగులో డ్రెస్సులు వేస్తున్నారు. పార్టీలో ఏ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు అని అడక్కుండా తెలిసేలా బాగానే ఉందనుకోండి. పెండిండ్లు వంటి ఫంక్షన్లలో అబ్బాయి తరపు వాళ్ళు ఒక రంగును, అమ్మాయి తరపువాళ్ళు ఒక రంగును సెకెల్ట్ చేసుకుని ఆయా రంగుల్లో మెరిసిపోతే భిన్నత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. మాచింగ్ చేసే మితులు చాలా బాగుంటున్నాయి. అవేంటో మీరూ చూడండి. ఒక చీర కొనుక్కుంటే దానికి మాచింగ్ పెట్టికోట్ దగ్గర నుంచి బ్లౌజు, గాజులు, నెక్లెస్‌లు, చెవిరింగులు కనీసం వాడుతున్నారు. కాబట్టి వీటిని కొనడం కంటే కొన్నింటిని మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
గాజులు
నేను ఈ మధ్య గాజులు కొనుక్కోవడానికి వెళితే డజను మూడువందల అరవై తీసుకున్నారు. ఇది చూసిన మా డ్రైవరు ఏమన్నాడో తెలుసా? ''ఈ ఏరియాలో షాపులకు అద్దెలు ఎక్కువ కాబట్టి ముప్పై రూపాయల గాజులు మూడు వందలు అమ్మారు. అదే ఇనార్టిట్ మాల్‌కు వెళితే మూడు వేలకు అమ్ముతారు'' అన్నాడు. అదీ నిజమే కదా అనిపించింది. రంగు రంగుల సిల్క్ దారాలు కొనుక్కుని ఇంటికి వచ్చాను. ఇంట్లో ఉన్న పాత మెటల్ గాజుల్ని ముందేసుకున్నాను. చీరకు సరిపోయే రంగు గల దారాన్ని తీసుకుని ఇరవై పోగులు పోసుకుని సన్నని మెటల్ గాజుకు చుట్టుకుంటూ వచ్చాను. చివర్లు ఫెవికాల్తో అతికించాను. దీనిపైన అక్కడక్కడా చిన్నపూస వచ్చేలా అతికించుకోవచ్చు. లేదంటే స్టోన్చైన్ను తీసుకుని గాజుకు అతికిస్తే రాళ్ళగాజు తయారవుతుంది. లావుపాటి గాజులకు రాళ్ళచైను బాగుంటుంది. సాదా గాజులకు అక్కడొక పూస, అక్కడొక పూస వేస్తే చాలు. బాగుంటాయి.
మార్వాడీ గాజుల సెట్
అద్దాలు, రాళ్ళు బిగించి బాగా వెడల్పుగా ఉండే మర్వాడీ గాజుల సెట్‌ను కూడా ఇంటిలోనే చేసుకోవచ్చు. వీటికి దాదాపు వెయ్యి, పదిహేను వందలు తీసుకుంటున్నారు. అదే ఇంట్లో అయితే చాలా తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చు. బజార్లో బట్ట లేసులు దొరుకుతున్నాయి. ఈ లేసుకు మధ్యలో బంగారు రంగు పూల డిజైను ఉంటుంది. వెడల్పాటి ప్లాస్టిక్ గాజును తీసుకుని దాని మీద ఈ లేసును పెట్టి అతికించాలి. పూర్తిగా ఫెవికాల్ ఆరిన తర్వాత అదే రంగు దారంతో గాజు లోపలి భాగంలో సూదితో కుట్లు వేసుకోవాలి. ఇప్పుడు గట్టిగా అమిరిపోతుంది. ఇది చక్కగా వేసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఇంట్లో వర్క్ బ్లౌజుల్లో మిగిలిన ముక్కలతో కూడా గాజులు తయారు చేయవచ్చు. నెట్టెడ్ క్లాత్ ముక్కతో కూడా గాజుల్ని డిజైన్ చేయవచ్చు. పట్టుచీరలు ఖరీదైనవి కొన్నప్పుడు వాటి జాకెట్లలోని మిగిలిన ముక్కల్ని దాచుకోవాలి. లేదంటే చీరకు చివరగా కుచ్చుల కోసం దారప్పోగులు వదిలేస్తారు. దాన్ని కొద్దిగా బట్టతో పాటు కత్తిరించుకుంటే అదే రంగు గాజులు తయారు చేసుకోవచ్చు. లేసులు, బట్ట ముక్కలు, సాటిన్ రిబ్బన్లు వంటి అనేక మెటీరియల్‌తో గాజుల్ని అలంకరించుకొని మాచింగ్ వేసుకోవచ్చు.
నెక్లెస్‌లు
చిన్న చిన్న బీడ్స్ తెచ్చుకొని నెక్లెస్‌లు, చోకర్లు చీరకు మాచింగ్‌గా పెట్టు కోవచ్చు. చాలా మంది మహిళలు ఇంటి వద్ద వీటిని తయారు చేస్తూ ఉపాధి పొందు తున్నారు. సిల్క్ద్రెడ్, సిల్క్ రిబ్బన్లతో తయారయే నగల్ని ప్రజలు పిచ్చిగా కొనుక్కుంటున్నారు. పేపర్ జ్యువెల్లరీనే కొనుక్కంటున్న జనం దారాల జువెల్లరీని ఎందుకు కొనుక్కోరు. షాపుల్లో గొలుసుల చివర అతకాల్సిన కొండీలు, హుక్‌లు, రింగులు వంటివన్నీ అమ్ముతున్నారు. అవన్నీ తెచ్చుకొని అందంగా తయారుచేసుకోవటమే. పూసలు, ముత్యాలు, బంగారు బీడ్స్, క్రిస్టల్స్ ఎన్ని రకాలు వచ్చినా మహిళల మెడ వంపుల్లో చేరి వయ్యారాలు పోతుంటాయి.
చోకర్
పూర్వం నల్లపూసల్లోకి బంగారు గుండ్లు అక్కడొకటి అక్కడొకటి గుచ్చుకుని మురిసిపోయే వాళ్ళం. ఇప్పుడు కో అంటే కోటి డిజైన్లు. ఇప్పుడు నేనొక కొత్తరకం చోకర్ను చూపిస్తాను. ముప్పై, నలభై పోగుల్లో దారాలను తీసుకొని జడ అల్లినట్టుగా అల్లుతూ రావాలి. మూడు పాయలతో కాదు, నాలుగు పాయల జడను అల్లాలి. ఇలా అల్లిన దండ పక్కన పెట్టి మరొక రంగుతో మరల అల్లాలి. ఈ రెండు దండలను పక్కనపెట్టి అతికించాలి. ఇప్పుడు బంగారు గుండ్లచైనును తీసుకొని దీనికి కిందివైపుకు అతికించాలి. రెండు రంగుల దారాలు బంగారు పూసలతో చోకర్ తయారైరంది. మూడు వేర్వేరు రంగు దారాలతో మూడు పాయల జడలా అల్లి కూడా మెడలో పెట్టుకోవచ్చు.
చెవి పోగులు
వేలాడేలా, రింగుల్లా, బుట్టల్లా రకరకాలు చేసుకోవచ్చు. వీటికి కావల్సిన బుట్టలు తగిలించుకునే రింగులు. తీగలు కావాల్సిన వన్నీ షాపుల్లో దొరుకుతాయి. వాటిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే మనమే స్వర్ణ కారులమై రకరకాల డిజైన్లు సృష్టించవచ్చు. తీగలను వంపడానికి చిన్న పట్టకారు, ఫోర్సెప్స్ లాంటివి, తీగల్ని కత్తిరించడానికి కొనుక్కోవాలి. బంగారు తీగతో ముత్యాల దండల్ని చుట్టించుకుని వేసుకునేవాళ్ళం. అలా తీగల్లో కాపర్, గోల్డ్, సిల్వర్ కలర్లు దొరుకుతున్నాయి. నచ్చిన తీగలు కొనుక్కొని కాపర్ జువెల్లరీ, సిల్వర్ జువెల్లరీ, గోల్డ్ జువెల్లరీ తయారు చేయవచ్చు. రింగులు చేయడం చాలా సులువు, అయిదు నిమిషాల్లో అయిపోతుంది. బుట్టలకు సిల్క్ధ్రెడ్లు అతికించి వాటికి వేలాడే ముత్యాలు, పూసలు పెట్టుకుంటే అందంగా ఉంటుంది. లేదంటే సిల్క్ దారాలను పొడుగ్గా కుచ్చుల్లా కట్టి వేలాడేసి పైన చెవిలో దూర్చే పోగుల్లాంటివి తగిలించుకోవచ్చు. వేలాడే బుట్టలకు ముత్యాలను బాగా సన్నని తీగతో చుట్టుకోవాలి. మూడు మూడు పూసలు కలిపి ఒక చోట చుడితే అందంగా వస్తుంది. నీరెండకు మెరుస్తూ అమ్మాయిల చెవి పోగుల్లోని రాళ్ళు తళుక్కుమంటాయి. బంగారం ఖరీదు ఎక్కువ అవడంతో ప్రస్తుతం ఎన్నో రకాల జువెల్లరీ అందుబాటులోకి వచ్చింది.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్