Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలికలలో అక్షరాస్యత శాతాన్ని పెంచి విద్యావంతులుగా మార్చాలి. వారి కాళ్ళ మీద వారు నిలబడగలిగేలా చేయాలి. ఈ విధంగా మహిళల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా సమాజ పురోగతి సాధ్యమవుతుంది. నగరాలలో చూసినపుడు మాత్రమే బాలికా విద్య అధికంగా ఉన్నట్టు కనిపిస్తుంది. గ్రామాల్లో ఇప్పటికి బాలికా విద్య అంతంత మాత్రంగానే ఉంటున్నది. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా బాలికలు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. బాలికలపై జరుగుతున్న లైంగికదాడులు, అనర్థాలను నివారించి వారి హక్కులను వారికి తెలియచేసేందుకు ఐక్యరాజ్య సమితి అక్టోబర్ 11న 'అంతర్జాతీయ బాలికా దినోత్సవం'గా జరుపుకోవాలని నిర్ణయించింది.
అమ్మాయిలకు చదువుకునే అవకాశం కల్పిస్తే బాల్య వివాహాల శాతం తగ్గుతుంది. కుటుంబంలో కూడా బాలికలు శ్రమ దోపిడీకి గురౌతున్నారు. మగపిల్లలతో పాటు సమానమైన చదువులు, జీతాలు రెండూ లేవు. విద్య, వైద్య సంరక్షణ, రక్షణ, చట్టపరమైన హక్కులు, గృహసింస, బలవంతపు బాల్య వివాహాలు వంటి ఎన్నో రకాల అసమానతలను బాలికలు ఎదుర్కొంటున్నారు. పాఠశాలల్లో సరియైన మరుగుదొడ్లు లేక మధ్యలోనే చదువుకు మానేస్తున్నారు. రుతుస్రావ సమయాల్లో ఎలాంటి పరిశుభ్రత పాటించాలో తెలియక అనారోగ్యం పాలవుతున్నారు.
ఎలానార్ రూజ్వెల్ట్ పుట్టిన రోజున
ప్రతి సంవత్సరం అక్టోబర్ 11వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ బాలికా దినోత్సవం జరపబడుతోంది. మహిళల ఆత్మగౌరవం కాపాడటం కోసం పోరాటం చేసిన ''ఎలానార్ రూజ్వెల్ట్'' పుట్టిన రోజైన అక్టోబరు పదకొండో తేదిని అంతర్జాతీయ బాలికా దినోత్సవం జరపటానికి ఐక్యరాజ్య సమితి గుర్తించింది. 2012 సంవత్సరంలో అక్టోబర్ 11న తొలిసారిగా ఈ బాలికా దినోత్సవం జరపబడింది. తొలిసారిగా 192 దేశాలు దీనిపై సంతకం చేశాయి. అమెరికన్ పౌరహక్కుల కార్యకర్త ఎలానార్ రూజ్ వెల్ట్ ఈ మానవ హక్కుల ప్రకటనలో స్త్రీ, పురుష సమానత్వం ప్రతిబింబించేలా మ్యాన్ అనే పదాన్ని పీపుల్‌గా మార్చింది.
అవగాహన కల్పించడం
ప్రపంచ వ్యాప్తంగా బాలికలు ఎదుర్కొంటున్న లింగ అసమానతలు, వివక్షతపై అవగాహన పెంచడం ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యం. బాలికలు, యువతులు వారి వారి రంగాలలో ప్రచారం, పరిశోధనలకు సంబంధించి సాధించిన ప్రగతి అభివృద్ధిని పెంపొందించేలా ఈ బాలికా దినోత్సవ వేడుకలు జరుగుతాయి. బాలికలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలియజేయడమే కాకుండా, ఆ సమస్యలు పరిష్కరింపబడితే వచ్చే ఫలాల గురించి కూడా అవగాహన కలిగించడం ఈ దినోత్సవ ఉద్దేశ్యం. అయితే ప్రపంచ అభివృద్దికి చెందిన అనేక ప్రణాళికలలో బాలికలను చేర్చడం లేదు. వారి సమస్యలను పరిగణలోకి తీసుకోవడం లేదు.
అధికారికంగా గుర్తింపబడింది
ప్లాన్ ఇంటర్నేషనల్ సంస్థ రూపొందించిన ''బికాజ్ ఐ యామ్ ఎ గర్ల్'' అనే ప్రచార కార్యక్రమం నుండి బాలికల దినోత్సవం నిర్వహించాలనే ఆలోచన వచ్చింది. ప్లాన్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా తన కార్యకలాపాలు నిర్వహించే ఒక ప్రభుత్వేతర సంస్థ. ఇది ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో బాలికలను సంరక్షించే ప్రాముఖ్యతపై అవగాహన పెంచుతుంది అన్ని దేశాలతో పాటు ఐక్యరాజ్య సమితిని పాల్గొన మనడంతో ఐక్యరాజ్య సమితి సర్వ సభ్య సమావేశం అధికారికంగా అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని ప్రకటించింది. 2020 డిసెంబర్ 19వ తేదిన ఈ తీర్మానం అధికారికంగా గుర్తించబడింది. ప్రతి సంవత్సరం ఒక నినాదం పెట్టుకొని ఆ దిశగా కార్యక్రమాలు చేపడతారు.
నిరక్షరాస్యులుగానే ఉన్నారు
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 2000 పైగా కార్యక్రమాలు, వేడుకలు జరిగాయి. ఆసియా ఖండంలోని దేశాలలో ఒక్క భారతదేశంలోనే అతి తక్కువ అక్షరాస్యత కలిగిన బాలికలున్నారు. ఈనాటికి మహిళల జనాభాలో అక్షరాస్యులైన మహిళలు నలభై శాతం కన్నా తక్కువగానే ఉన్నారు. అంటే నేటికి భారతదేశంలో కనీసం 20 కోట్ల మంది నిరక్షరాస్యులే అన్నమాట. ఈ నిరక్షరాస్యత అనేది కేవలం వారి వ్యక్తిగత జీవితం పైనే కాదు వారి కుటుంబపైన కూడా వ్యతిరేక ప్రభావం చూపుతుంది. నిరక్షరాస్యులైన మహిళలే ప్రసవ సమయాల్లో ఎక్కువగా మరణిస్తునట్టుగా అనేక అధ్యయనాల బట్టి తెలుస్తున్నది. పోషకాహారం తక్కువగా తీసుకోవటం, రక్తహినతకు గురవటం తత్ఫలితంగా ప్రసవ మరణాలు సంభవించటం చూస్తున్నాం.
విద్యాసంస్కరణలు చేపట్టి
పిల్లల పెంపకం మీద తల్లుల అక్షరాస్యతా శాతం ప్రభావం చూపిస్తున్నది. తల్లీ చదువుకుంటే పిల్లల ఆరోగ్యం, పెంపకం, వారికి ఇవ్వవలసిన టీకాల విషయంలో జాగ్రత్త పడుతుంది. పిల్లలకు మంచి విలువలు బోధించటంలో తల్లి ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకే బాలికలకు కనీసం ప్రాధమిక విద్యను బోధించేలా విద్యా సంస్కరణలను చేపట్టి ఆ దిశగా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. నిరక్షరాస్యత జనాభా వల్ల దేశ ఆర్ధిక వ్యవస్థ కుంటుపడుతుంది. విద్య పరంగా వెనకపడిన గ్రామాల్లో కస్తురిబా గాంధీ బాలికల విద్యాలయాల ఏర్పాటు చేయబడ్డాయి. పసికందుల మరణాలకు తల్లీ అక్షరాస్యతకూ సంబంధం ఉందని అంతర్జాతీయ పిల్లల వైద్య నిపుణుల సమావేశాల్లో తెలిపారు. నెలలు నిండకుండా పుట్టిన పిల్లల రక్షణ కోసం చెప్పే సూత్రాలను, పద్దతులను అర్థం చేసుకోవాలంటే తల్లులకు ప్రాధమిక విద్య చాలా అవసరం.
మంచి వాతావరణంలో...
మంచి వాతావరణం నుంచి వచ్చిన పిల్లలు మంచి ప్రవర్తన కలిగి ఉంటారు. ఎలాంటి పరిస్థితినైన విజయవంతంగా అధిగమించగలరు. కుటుంబం, పాఠశాల, సమాజం వాతావరణాలలో కలిసి మెలసి బతకాలంటే మంచి ప్రవర్తన అవసరం. మంచి వాతావరణంలో పెరగని వారు నేర ప్రవృత్తి కలిగి ఉంటారని చాలా అధ్యయనాల్ల్లో తెలిసింది. పిల్లల్ని ప్రతిభావంతులుగా మలిచే విషయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులే ప్రధాన పాత్రా వహిస్తారు.
సమాజ బాధ్యత
బాలికలు ఆరోగ్యంగా పెరిగినట్లయితే ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనిస్తారు. కాబట్ట అమ్మాయికి 18 ఏండ్ల వరకు పెండ్లి చేయకుండా అంటే బాల్య వివాహాలు జరగకుండా చూడటం కూడా సమాజ బాధ్యత. సమాజంలో నెలకొని ఉన్న కట్నాలు వంటి దురాచారాల వలన తల్లీదండ్రులు ఆడపిల్లల్ని కనడానికి భయపడుతున్నారు. ఆడపిల్ల పుట్టిందని తెలియగానే వడ్లగింజ గొంతులో వేసి చంపేయడం, ఏ ముళ్ళ పొదల్లోనో పారేయడం వంటి అమానవత్వ సంఘటనలకు నేటికీ పాల్పడుతున్నారు. ఇంకా వైద్య శాస్త్రంలోని టెక్నాలజీనీ వాడుకొని కడుపులో ఉన్న బిడ్డ అడా మగా అని తెలుసుకొని అడబిడ్డల్ని చంపేసే వారు ఎందరో ఉన్నారు. ఫలితంగా జీవ సమతుల్యతలో ఆడపిల్లలు తగ్గిపోయి కేవలం మగ పిల్లలు మాత్రమే ఉంటే భవిష్య సమాజంలో పెండిండ్లు ఎలా జరుగుతాయి. ఆడపిల్లల పెంపకలు భారం కావటం వల్లనే తల్లిదండ్రులు ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నారు. కట్నాలు ఇచ్చి పెండిండ్లు చేయడం వంటివి లేకపోతే తల్లిదండ్రులు ఆనందంగా ఆడపిల్లల్ని పెంచుతారు.
పెరుగుతున్న లైంగిక దాడులు
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ చేసిన సర్వేలో బాలల్లో ముఖ్యంగా 6 - 12 సంవత్సరాల మధ్య వయసు వారు లైంగిక హింసకు గురవుతున్నారని తెలిపింది. 21శాతం బాలికలు తీవ్రరమైన లైంగిక దాడులకు గురవుతున్నారని గణాంకాలు తెలుపుతున్నాయి. ప్రతి ముగ్గురి బాలికల్లో ఇద్దరూ శ్రమ దోపిడీకి గురవుతున్నారు. మరో ఘోరమైన విషయం ఏమిటంటే 88శాతం బాలలు తమ తల్లిదండ్రుల ద్వారానే శ్రమ దోపిడీకి గురవుతున్నారు. 50శాతం లైంగిక దాడులు పిల్లలకు బాగా నమ్మకమున్నవారు, కుటుంబంలోని బంధువుల వలననే జరుగుతున్నాయి. అస్సాం, బీహార్, ఢిల్లీతో పాటు మన తెలుగు రాష్ట్రాలలోని బాలికలు ఎక్కువ శాతం లైంగిక దాడులకు గురవుతున్నారు. చాలా వరకు తల్లిదండ్రుల నుండే అమ్మాయిలు వివక్షకు గురౌతున్నారు. మానసిక వేధింపుల విషయంలో బాల బాలికల మధ్య తేడా ఉండడం లేదు. అమ్మాయిలైతే చాలు వేధింపులు అనుభవిస్తున్నారు.
- సృజన్