Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్త్రీ జాతి చరిత్ర సమస్తం పురుష పీడన పరాయణత్వం అనడానికి ఆమె జీవితం ఓ నిదర్శనం. తొమ్మిదవ ఏట 45 ఏండ్ల వ్యక్తితో పెండ్లి. కామంతో పసిమొగ్గని కాలరాయాలని చూసే భర్త. 12వ ఏట వైధవ్యం. కటిక దారిద్య్రంలో వదిలేసి కన్నుమూసిన కన్నవాళ్ళు. చదువుపై నిషేధం, మతపెద్దల సాధింపులు, ఉద్యోగంలో లైంగిక దాడులు, ఓదార్చేవాళ్ళు లేరు. అయినా కన్నీళ్లను దిగమింగి కష్టాల కడలిని ధైర్యంగా ఈదింది. చదువుకుని డాక్టరయింది. సుమారు 500 మంది అనాథలను చేరదీసింది. ఆమే డా||హైమబతీ సేన్. రూళ్ళు గీసిన నోట్‌బుక్‌లో 1920 నుంచి 1933 వరకు ఆమె రాసుకున్న ఆత్మకథ ఎవరికీ గుర్తులేక దశాబ్దాల తరబడి ట్రంక్‌పెట్టెలో ఉండిపోయింది. ఆమె మరణానంతరం ఎనభై ఏండ్ల తర్వాత వెలుగులోకి తెచ్చి 2011లో దీన్ని ప్రచురించారు.
1866లో బెంగాల్‌లోని ఖుల్నా జిల్లాలో పుట్టింది హైమమతి. తండ్రి ప్రసన్నకుమార్ ఘోష్. ఆయన సంపన్న జమిందారు. 1872లో బెంగాల్‌ను కరువు చుట్టుముట్టింది. అప్పటికి కేవలం ఆరేండ్ల వయసున్న ఆమె పేదల కష్టాలు చూసి కరిగిపోయేది. వారు బియ్యం కోసం, ఉడికించిన దుంపల కోసం ఎగబడటం చూసి తట్టుకోలేకపోయేది. సామాన్ల గదుల్లోంచి పెద్దమొత్తంలో బియ్యాన్ని, దుప్పట్లనూ, చాపలనూ రహస్యంగా గ్రామంలోని పేదలకు పంచిపెట్టేది. ఆమె దయార్ద్రహృదయాన్ని తండ్రి సమర్థించేవాడు. కానీ ఆమె పట్టుబడిన ప్రతిసారీ తల్లి దండించేది. కరువు తర్వాత అంటు వ్యాధులు ప్రబలాయి. ఆమె తండ్రి నకిలీ వైద్యులను అరికట్టడానికి అనుభవం కలిగిన వైద్యులను గ్రామంలోకి తీసుకొచ్చాడు. ఆ ప్రభావమంతా హైమబతిపై పడింది.
రహస్యంగా చదువుకుంది
హైమబతికి చదువు నేర్పించలేదు. ఆ కాలంలో పుస్తకాన్ని కానీ పెన్నును కానీ పట్టుకున్న హిందూ వివాహితకు వైధవ్యం ప్రాప్తిస్తుంది అనే మూఢనమ్మకం ఉండేది. కానీ ఆమె మాత్రం బాలురకు నేర్పే పాఠాలను దొంగతనంగా వింటూ ఉండేది. తర్వాత కాలంలో ఆమె తండ్రి సహకారంతో రహస్యంగా చదువుకోవడం మొదలుపెట్టింది. ఒకసారి ఆమె ఇంట్లో రామాయణం చదవడం చూసిన అమ్మమ్మ, పెద్దమ్మలు పెద్ద గోల చేశారు. కానీ అవేమీ హైమబతి పట్టించుకోలేదు. తల్లి ఆమెకు పెండ్లి చేయాలని ప్రయత్నిస్తే చదువుకుందని పెండ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. తండ్రి మాత్రం కూతురు పక్షానే నిలబడ్డాడు. అయితే తర్వాత కాలంలో ఆయన కూడా సమాజం నుంచి ఒత్తిడికి తలొగ్గక తప్పలేదు.
భర్త హింసించేవాడు
చివరకు తొమ్మిదిన్నరేండ్ల హైమబతిని జెస్సోరీలో డిప్యుటీ మేజిస్ట్రేట్‌గా పని చేస్తున్న నలభై అయిదేండ్ల విధురుడికిచ్చి పెండ్లి చేశారు. అప్పటికే ఆయనకు రెండు పెండిండ్లు జరిగి ఆ భార్యలు చనిపోయారు. హైమబతి వయసున్న ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. అతని సంపద, హౌదా చూసి కూతురికి మంచి భర్త దొరికాడని మురిసిపోయారే కానీ పంజరం అందంగా ఉన్నంత మాత్రాన పక్షికి సంతోషం కలగదనే ఆలోచన వారికి రాలేదు. అలా నరకంవంటి ఆమె వైవాహిక జీవితం మొదలయింది. లైంగిక కోరికలు తీర్చుకోవడం కోసం భర్త ఆమెను హింసించేవాడు. దాంతో ఆమెకు మూర్ఛవ్యాధి వచ్చింది. వైద్యం కోసం పుట్టింటికి పంపించారు.
బాలవితంతువుగా మారీ...
కాస్త కోలుకున్న తర్వాత మళ్ళీ భర్త దగ్గరకు వెళ్ళాల్సిన సమయం వచ్చింది. హైమబతికి భయం వేసింది. భర్త పక్కన కూర్చోమని ఇంట్లో వాళ్ళు ఆమెను విపరీతంగా కొట్టేవారు. కానీ ఆమె మాత్రం అతన్ని చూస్తే గజగజ వణికిపోయేంది. అయితే రెండోరోజునే ఆమె భర్త జ్వరం బారిన పడ్డాడు. అది న్యుమోనియాగా మారింది. మూడు వారాలపాటు అతనికి సపర్యలు చేసింది. తుది ఘడియలు సమీపించాక అతనిలో పశ్చాత్తాపం మొదలయింది. కానీ ఇక ప్రయోజనం ఏముంది. కొన్నాళ్ళ తర్వాత అతను మరణించాడు. హైమబతి బాలవితంతువుగా మారింది. భర్త మరణం తర్వాత పుట్టింటికి వచ్చిన ఆమెను తల్లి, బంధువులు ఎప్పుడూ తిడుతూనే ఉండేవారు. ఆ దుస్థితి నుండి బయటపడటానికి తనకు ఊరటనిచ్చే పుస్తకాలను ఆశ్రయించడం మొదలుపెట్టింది.
కాశీకి వెళ్ళింది
చదువుకుంటుందని ఆమెపై మరింత కోపం పెరిగింది. కానీ ఆమె మాత్రం చదవడం మానుకోలేదు. తండ్రి మాత్రం ఆమెకే మద్ధతు పలికాడు. చదువుకోమని స్వేచ్ఛగా వదిలేశాడు. ఆ ఏడాదిలోనే ఆమె ఇష్టపడే తండ్రి, అత్తగారు, తల్లి మరణించారు. ఆస్థి మొత్తం అన్న, ఆమె చిన్నాన్న హస్తగతం చేసుకున్నారు. భర్త వైపు నుండి రావల్సిన డబ్బును కూడా ఆమె పెద్దబావ ఇవ్వడానికి అంగీకరించలేదు. ఇలా బంధువులందరూ మోసం చేయడంతో ఆమె కష్టాలు మరింత పెరిగాయి. ఇక ఆస్తిపాస్తులపై హక్కులను వదులుకుని ఒంటరిగా కాశీకి వెళ్ళిపోయింది. అప్పుడు ఆమె వయసు పన్నెండు. అక్కడే తనకు దూరపుబంధువు అక్క వరసయ్యే ఒకామెను కలిసింది. ఆమె భర్త పుతిన్ బాబు నెలకు ఇరవై రూపాయలు చొప్పున ఇస్తానని హామీ ఇచ్చాడు. అయితే కాశీలో ఆనాటి పరిస్థితులు చూసి ఆమె ఆశ్చర్యపోయింది. తమకు అక్కడ ఆధరణ దొరుకుతుందని వెళ్ళిన వితంతువులు అష్టకష్టాలు పడేవారు. ఇక అక్కడ ఆమె ఉండలేకపోయింది.
ఒంటరి పోరాటం
తనకు కాస్త ఆశ్రయమివ్వమని ఎంతో మందిని బతిమలాడుకుంది. ఒక పూజారి భార్యను ఆశ్రయిస్తే ఆమె తనకు తెలిసిన వారి ఇంట్లో తలదాచుకునే ఏర్పాటు చేసింది. అక్కడ ఉంటూ హైమబతి ఏ పూట కాపూట సంపాదించుకుంటూ జీవించింది. కానీ ఎవరిదగ్గరా చేయి చాచలేదు. ఒక పైసాతో వంటచెరుకు కొనుక్కుని మూడు పిడికెళ్ళ బియ్యం ఉప్పువేసి వండుకునేది. అదే ఆమె భోజనం. రాత్రుళ్ళు పస్తులుండేది. తర్వాత కాలంలో ఒక బాలికల పాఠశాలలో టీచర్‌గా ఉద్యోగం సంపాదించుకుంది. నెలకు పది రూపాయల జీతం. అక్కడ ఎనిమిది నెలలు పని చేసింది. అయితే ఇంకా చదువుకోవాలని ఆమె పడే నిరంతర తపన తీరలేదు. తన కలను సాకారం చేసే కలకత్తాలో తనంతట తానే పై చదువులు చదవాలని కలగనడం మొదలు పెట్టింది. ఈ విషయంలో హైమబతి అద్భుతమైన, అసాధారణమైన మహిళ.
బ్రహ్మసమాజ ప్రచారకుడితో పెండ్లి
తన ఇరవైరెండు, ఇరవై మూడేండ్ల వయసులో బ్రహ్మసమాజానికి ఆమె అనుకోకుండా చేరువైంది. హైమబతి వారిని అంటిపెట్టుకుని ఉండటానికి మరోకారణం బ్రహ్మసమాజికులు స్త్రీ విద్యకు మార్గదర్శకులుగా ఉండటమే. ఆ సమయంలోనే ఆమెలో వైద్య విద్యపై ఆసక్తి కలిగింది. 1880 తర్వాత కలకత్తా వైద్య విద్యాలయం మహిళలను అనుమతించింది. కానీ ఆ చదువుకయ్యే ఖర్చు ఎవరు భరిస్తారు? దానికోసమే ఆమె పెండ్లి చేసుకుంది. 1889లో ఆమె ఇరవై మూడో ఏట అడుగుపెట్టింది. కుంజబెహారీ అనే బ్రహ్మసమాజ ప్రచారకుడు ఆమెను పెండ్లి చేసుకున్నాడు. కానీ తర్వాత తెలిసింది తాను పట్టుకున్నది తన నెత్తురు పీల్చే జలగ అని. వారి వైవాహిక జీవితమంతా హైమబతి సంపాదనమీదే గడిచింది. ఆమె తన జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తుంటే అతను హిమాలయాలలోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఎక్కువ సమయాన్ని గడిపేవాడు.
ఆ జంట సహకారంతో...
హైమబతి గర్భవతి అయ్యింది. సరైన సదుపాయాలు లేకపోవడంతో కడుపులోనే ఆ బిడ్డ చనిపోయింది. ఆమెకు తీవ్రమైన జ్వరం వచ్చింది. ఆ సమయంలోనే ఆమె డా.సందరీ మోహన్ దాస్‌ను కలిసింది. ప్రసూతి సేవలకు, స్త్రీల ఆరోగ్య విషయంలో అంకిత భావానికి బ్రహ్మసమాజంలో ఆయన పెట్టింది పేరు. ఆయన భార్య హేమంగిని మంత్రసాని. వారిద్దరూర కలిసి హైమబతి జీవితాన్ని కాపాడారు. భర్త యాత్రలకు వెళ్లిపోయినపుడే వీరిద్దరే ఆమెకు సాయం చేసేవారు. వారిరువురు హైమబతిని ఎంతో ప్రభావితం చేశారు.
అన్ని అంశాలూ నేర్చుకుంది
హైమబతి ఆసుపత్రి సహాయకురాలిగా కాంబెల్ వైద్య విద్యాలయంలో చేరింది. వైద్యవిద్య అభ్యసించాలన్న తన కోరిక తీర్చుకునేందుకు ఆమె ఎంతో కృషి చేసింది. బ్రహ్మసమాజం ఆనాడు తక్కువ విద్యార్హత ఉన్న మహిళలకు ఆసుపత్రిలో పని చేసేందుకు శిక్షణ ఇచ్చేవారు. అలా శిక్షణ అంతంత మాత్రంగానే పొందిన ఆమె తన చదువులో అన్ని అంశాలనూ నేర్చుకుంది. ప్రవేశపరీక్షకు హాజరైన 17 మంది స్త్రీలలో ఆమె ద్వితీయశ్రేణిలో ఉత్తీర్ణురాలైంది. వారి ఉపాధ్యాయులు ఎక్కువమంది బ్రటిష్ వారు కావడం వల్ల చదువులో వెనకబడ్డ విద్యార్థులకు పాఠాలను అర్థం చేసుకోవడం కష్టమయ్యేది. ఆమె అంటే అభిమానం ఉన్న ఉపాధ్యాయులు ఆమెను స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేయమని ప్రోత్సహించారు. వారు చెప్పినట్టుగానే చేసి నెలకు 7 రూపాయలు స్కాలర్షిప్ సంపాదించుకుంది. అయితే హైమబతి సంపాదించేది ఆమె భర్త బలవంతంగా లాక్కునేవాడు. ఆమె మాత్రం అర్ధరాత్రి వరకు యంత్రంలా పని చేస్తూనే ఉండేది.
బంగారు పతకానికి బదులు
హైమబతి మళ్ళీ నెల తప్పింది. ఒక సమయంలో చదువు, సంసారం మీద దృష్టి పెట్టడం కష్టంగా మారింది. దాంతో తరచుగా అనారోగ్యం పాలయ్యేది. అయినా హైమావతి మొదటి శ్రేణిలో ఉత్తీర్ణురాలయింది. మరో అబ్బాయి అర మార్కుతో వెనబడ్డాడు. బంగారు పతకం హైమబతికి ఇచ్చే సమయంలో పెద్ద గొడవ జరిగింది. 'మహిళకు ఎలా ఇస్తారు? ఇస్తే మేం ఊరుకోం' అని అబ్బాయిలు గొడవకు దిగారు. దాంతో ఆమెకు బెంగాల్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నుండి పిలుపు వచ్చింది. బంగారు పతకానికి బదులుగా తనకు ఏమైనా ఇస్తామని అడిగారు. పరిస్థితి అర్థం చేసుకున్న ఆమె ప్రస్తుతం తన పసిబిడ్డను పెంచుకోవడానికి డబ్బు చాలా అసవరం. కాబట్టి ఆర్ధిక సహకారంతో పాటు తన చదువు కొనసాగేలా చేయమని కోరింది. దానికి అంగీకరించి ఉపకార వేతనాన్ని 30 రూపాయలకు పెంచారు. ఆమెకు రజత పతకాన్ని ప్రదానం చేశారు. తన చంటిబిడ్డ ధృవజ్యోతి బాగోగులు చూడటానికి ఒక ఆయను నియమించుకుంది. తన చివరి పరీక్షలో మళ్ళీ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది.
ఉద్యోగం దొరకడం కష్టంగా మారింది
ఉత్తీర్ణత అయితే సాధించింది కానీ ఉద్యోగం దొరకడం కష్టంగా మారింది. చివరకు నెలకు రెండు వందల రూపాయల జీతంతో ఒక ఉద్యోగం సంపాదించింది. కానీ భర్త దానికి అంగీకరించలేదు. హైమబతి కొడుక్కు ఎప్పుడూ అనారోగ్యంగా ఉండేది. ఖరీదైన మందులు వాడాల్సి వచ్చేది. దీంతో అప్పులపాలయ్యారు. ఆమె సొంతంగా ప్రాక్టీస్ చేయాలనుకుంది. కానీ జనం వైద్యం కోసం ఆడవాళ్ళ దగ్గరకు వచ్చేవారు కాదు. ఆ సమయంలోనే ఆమె దేవేంద్రనాధ్ ఠాగోర్‌ని కలిసింది. ఆమె ఉద్యోగ అన్వేషణలో ఉందని తెలుసుకున్న ఠాగోర్ డఫరిన్ నిధి సహకారంతో చిన్ సురాలో మహిళా ఆసుపత్రి స్థాపన గురించి బ్రహ్మసమాజంలోని ఇతర సభ్యులతో చర్చించాడు. 50 పడకలతో హుగ్లీ లేడీ డఫరిన్ ఆసుపత్రిని స్థాపించి అందులో హైమబతికి ఉద్యోగం ఇచ్చారు. ఆమె నెలసరి వేతనం 50 రూపాయలు.
కత్తిమీదసాములా మారింది
ఆమె ఉద్యోగ జీవితాన్నంతా చిన్ సురాలోనే గడిపింది. అయితే అక్కడ కూడా ఆమె అనేక ఇబ్బందలు పడింది. ఆసుపత్రి అసిస్టెంట్ సర్జన్ ఆమెను నిరంతరం వేధించేవాడు. అయినా ధైర్యంగా ఎదుర్కునేది. అప్పటికి ఆమెకు ఇద్దరు కొడుకులు పుట్టారు. ఓ పక్క కుటుంబ జీవితాన్ని గడుపుతూ, మరోపక్క కఠీరమైన శారీరక శ్రమను చేయడం ఆమెకు కత్తిమీద సామయింది. కానీ పని చేయడక తప్పదు. ఆ తర్వాత ఆమెకు మరో ఇద్దరు కొడుకులు పుట్టారు. భర్త పట్టించుకోలేదు. తర్వాత కాలంలో అతను షుగర్ వ్యాధికి గురై 1902లో చనిపోయాడు. భర్త చనిపోయే నాటికి హైమబతికి ఐదుగురు సంతానం. వారికి తల్లీ తండ్రీ ఆమే అయ్యింది.
ప్రగతి నిరోధక ఆచారాలపై
భర్త మరణించిన తర్వాత అనాథలను చేరదీస్తూ ధార్మిక కార్యక్రమాలలో మునిగిపోయింది. అతి తక్కువ కాలంలోనే 30,40 మందికి ఆశ్రయమిచ్చింది. తన జీవిత కాలంలో సుమారు 500 మందిని చేరదీసింది. భర్త చనిపోయిన తర్వాత ఆమె 31 సంవత్సరాలు జీవించింది. తన చివరి వరకు ప్రగతి నిరోధక హిందూ ఆచారాలపై ఘాటైన విమర్శకురాలిగానే ఉంది. 1933 ఆగస్టు 5వ తేదీన ఆమె తేదిశ్వాస విడిచింది. అప్పటికి ఆమె వయసు అరవై ఏడేండ్లు. సూటిగా, ఎలాంటి భేషజాలూ లేకుండా సజీవంగా నిలిచిన హైమబతిలాంటి మహిళా వైద్యురాలి జీవిత చరిత్ర ఆ కాలంలో మరొకటి లేదు.