Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాలామంది తరచుగా పని ఒత్తిడి, వర్క్ ప్లేస్లో ఆందోళనకు గురవుతున్నారని పలు సర్వేల్లో తేలింది. వారు తమ లక్ష్యాలను సాధించే క్రమంలో మారిన జీవన శైలి కారణంగా ఏకాగ్రత కోల్పోవడం, అలసట, నిద్రలేమి వంటి మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టే టిప్స్ ఏవో తెలుసుకుందాం.
నిజాయితీ ముఖ్యం: నిజాయితీగా ఉండే వారిలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. కాబట్టి మానసిక సమస్యలను దూరం చేసుకోవాలంటే మీతో మీరు నిజాయితీగా ఉండాలి. ఆదర్శంగా జీవించడానికి కృషి చేయండి. మానసిక సమస్యలను జయించడానికి జీవితంలో అవసరమైన సర్దుబాట్లు చేసుకోండి. ఆత్మవిశ్వాసం ఆయుధం లాంటిది. ఎలాంటి ప్రతికూల పరిస్థితులైనా ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. తద్వారా జీవితం మళ్లీ గాడిన పడుతుంది.
సోషల్ మీడియాకు 'నో': సాధారణంగా ఏదైనా ముఖ్యమైన మీటింగ్ లేదా పనిలో ఉన్నప్పుడు ఫోన్ను సైలెంట్ మోడ్లో పెడుతుంటారు. అయితే కుటుంబ సభ్యులు, స్నేహితులతో సమయం గడిపేటప్పుడు కూడా ఇలానే చేయండి. దీంతో మైండ్ డైవర్ట్ కాకుండా ఉంటుంది. సోషల్ మీడియాలో టైమ్ స్పెండ్ చేసే సమయాన్ని కూడా చాలా తగ్గించుకోవాలి. అదే పనిగా సోషల్ మీడియాలో మునిగి తేలితే ఒంటరితనం, ఆందోళన, అసంతృప్తి వంటి ప్రతికూల భావోద్వేగాలు ఏర్పడే అవకాశం ఉంది. సోషల్ మీడియా, డిజిటల్ డిటాక్స్(దూరం) కారణంగా విశ్రాంతి తీసుకోవచ్చు. బాగా ఇష్టమైన పని చేయడానికి సమయం దొరుకుతుంది. అలాగే నచ్చిన వారితో మాట్లాడటానికి అవకాశం ఉంటుంది.
చిన్న ట్రిప్ ప్లాన్ చేసుకోండి: ప్రస్తుత జీవన విధానంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే పనితీరు ఉత్తమంగా ఉండాలి. అందుకు నిరంతరం శ్రమించాల్సి ఉంటుంది. అయితే అది ఓ స్థాయి వరకు మాత్రమే ఉండాలి. లేకపోతే ఒత్తిడి అమాంతం పెరుగుతుంది. దీంతో ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి పని చేస్తూనే అప్పుడప్పుడు విరామం తీసుకోవాలి. దీంతో శరీరం, మైండ్ రిఫ్రెష్ అవుతుంది. అలాగే ఉత్పాదక సామర్థ్యం కూడా మెరుగవుతుంది. ఇందుకోసం అప్పుడప్పుడు ట్రిప్ ప్లాన్ చేసుకోండి. కొత్త ప్రదేశాలను చూడడం ద్వారా మనసుకు స్వాంతన చేకూరుతుంది.
యోగా, మెడిటేషన్: సాధారణంగా పని ఏదైనా ఒత్తిడి ఉండడం సహజం. అయితే అది శ్రుతిమించకూడదు. ఇంట్లో లేదా వర్క్ ప్లేస్లో పని చేసేటప్పుడు ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అయితే ఎఫెక్టివ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. తద్వారా ఆరోగ్యం మెరుగవుతుంది. అంతిమంగా పనిని ఎంతో ఉత్సాహంగా చేయవచ్చు. ఒత్తిడి తగ్గించుకోవడానికి కొత్త మార్గాలను కనుగొనండి. ప్రతి రోజు యోగా, ధ్యానం వంటివి ప్రాక్టీస్ చేయండి. దీంతో ఒత్తిడి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.