Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లలు సాధారణంగా బిస్కెట్లు, చాక్లెట్లు, కుకీస్ వంటివి ఇష్టపడుతుంటారు. వాళ్ళ ఇష్టాన్ని కాదనలేక చాలామంది తల్లిదండ్రులు బయట కొని తెచ్చిపెడుతుంటారు. అయితే ఇలా బయటి తిండి పెట్టడం కంటే ఇంట్లో తయరు చేసిన పదార్థాలు తింటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. అలాంటి కొన్ని ఆరోగ్యకరమైన చిరుతిండ్ల గురించి ఈ రోజు తెలుసుకుందాం...
చిరుధాన్యాలతో బిస్కెట్లు
కావాల్సిన పదార్థాలు: మైదా - ఒక కప్పు, ఊదల పిండి - ముప్పావు కప్పు, పటిక బెల్లం పొడి - ముప్పావు కప్పు, పటిక బెల్లం పొడి (షుగర్ గ్లేజ్ కోసం) - అర కప్పు, సాల్టెడ్ బటర్ వంద గ్రాములు, పీనట్ బటర్ (గార్నిష్ కోసం), చాకొలేట్ గనాష్ (గార్నిష్ కోసం), కలర్‌ఫుల్ స్ప్రింక్లర్స్ (గార్నిష్ కోసం).
తయారు చేసే పద్ధతి: ఒక లోతైన గిన్నెలో పటిక బెల్లం పొడిని జల్లెడ పట్టి వేయండి. రూమ్ టెంపరేచర్లో బటర్ యాడ్ చేసి హ్యాండ్ బ్లెండర్తో బీట్ చేయండి. ఈ మిశ్రమం లైట్‌గా ఫ్లఫ్ఫీగా అయ్యెవరకూ బీట్ చేయండి. ఇందులో జల్లెడ పట్టిన మైదా, ఊదల పిండిని కలపండి. పిండి దగ్గరకి వచ్చే వరకూ చేతులతో బాగా కలపండి. మరీ అవసరమనుకుంటే కొన్ని చుక్కలు గోరు వెచ్చని పాలు పోసి కలపండి. ఈ పిండిని ముప్ఫై నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచండి. తర్వాత ఈ పిండిని అప్పడాల కర్రతో వత్తి మీకు కావాల్సిన షేప్‌లో కట్ చేసుకోండి. ప్రీ హీట్ చేసిన ఓవెన్లో 170 డిగ్రీల సెల్సియస్ వద్ద 20 - 25 నిమిషాలు, లేదా కుకీలు అంచుల వద్ద బ్రౌన్‌గా అయ్యేవరకూ బేక్ చేయండి. ప్రతి పది నిమిషాలకీ ఒకసారి చెక్ చేసుకోవడం మర్చిపోకండి. తర్వాత వాటిని పూర్తిగా చల్లారనివ్వండి. తర్వాత పీనట్ బటర్, షుగర్ గ్లేజ్, స్ప్రింక్లర్స్, లేదా డార్క్ చాకొలేట్ గనాష్తో అలంకరించండి. మీ పిల్లల్ని ఈ ప్రాసెస్‌లో ఇన్వాల్వ్ చేస్తే వారికీ సరదాగా ఉంటుంది. ఇవి మిల్లెట్స్‌తో చేశారు కాబట్టీ వాటిని ఆ రోజే తినేయండి. పిల్లలు వీటిని పాలతో కలిపి తినడానికి ఇష్టపడతారు.
వెనీలా చాకో చిప్స్ కుక్కీస్
కావల్సిన పదార్థాలు: రీఫైండ్ ఫ్లోర్/శుద్ది చేసిన పిండి - కప్పు, చక్కర పొడి - ఆరు టేబుల్ స్పూన్లు, కరిగిన వెన్న - ఐదు టేబుల్ స్పూన్లు, బట్టర్ స్కాట్చ్ చాకో చిప్స్ - మూడు టేబుల్ స్పూన్లు, బేకింగ్ సోడా - అర టీ స్పూను, బేకింగ్ పౌడర్ - టీ స్పూను, పాలు - టేబుల్ స్పూను, వెనిలా ఎసెన్స్ - అర టీ స్పూను.
తయారు చేసే పద్ధతి: ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో బట్టర్, షుగర్ వేయాలి. వీటిని బాగా మిక్స్ చేసి అందులో మైదాని, బేకింగ్ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత బేకింగ్ సోడా, వెనీలా ఎసెన్స్, చాకో చిప్స్, పాలు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పదార్థాలన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఈ పిండి బాగా మెత్తగా అయ్యే వరకు చేసుకోండి. ఇప్పుడు చపాతీ కర్ర సహాయంతో పిండి ఒత్తుకోవాలి. అయితే చపాతి మాదిరి ఒత్తుకున్నాక కట్టర్‌తో కుక్కీస్ ఆకారంలో కట్ చేసుకోవాలి. ఇప్పుడు మైక్రోవేవ్ ఓవెన్‌ని ప్రీహీట్ చేసుకోవాలి. పదినిమిషాల పాటు అది హీట్ అయిన తర్వాత ట్రేలో కుకీస్ అన్నిటిని వేసేయాలి. తయారైన తర్వాత మైక్రోవేవ్ ఓవెన్ నుంచి తీసేసి చల్లారనివ్వాలి. అంతే కుకీస్ తయారు అయిపోయాయి.
ఆల్మండ్ చాక్లెట్
కావల్సిన పదార్థాలు: డార్క్ చాకొలేట్ - కప్పు, వేయించిన బాదం - అరకప్పు.
తయారు చేసే పద్ధతి: డార్క్ చాకోలెట్ తీసుకోని 30 సెకన్ల వరకూ కరిగించి కొంచెం సేపు బాగా తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఇలాగే ఇంకో 30 సెకన్ల పాటు కరిగించుకొని బాగా కలుపుకోవాలి. ఇలా చేయటం వల్ల చాక్లెట్ చక్కగా కరిగిపోతుంది. ఒక గిన్నెను తీసుకోని అందులో కరిగించిన డార్క్ చాక్లెట్‌ని వేసుకోవాలి అలాగే వేయించిన బాదాం పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పదార్దాలు బాగా కలిసేటట్టుగా చూసుకోండి. ఇప్పుడు చాక్లెట్ అచ్చు ట్రేని తీసుకోని అందులో చాక్లెట్ మిక్స్‌ని వేసుకోవాలి. ఈ పేస్ట్‌ని సమానంగా చేసి పది నిమిషాలు ఫ్రీజర్‌లో పెట్టి ఫ్రీజ్ చేసుకోవాలి. అంతే.. ఆల్మండ్ చాక్లెట్ కుకీస్ రెడీ అయిపొయింది.
సత్తుకీ బర్ఫీ
కావల్సిన పదార్థాలు: సెనగ పప్పు - రెండు వందల గ్రాములు, నెయ్యి - 120 గ్రాములు, చక్కర పొడి - 120 గ్రాములు, ముక్కలుగా కోసిన బాదం - ఆరు గ్రాములు, కుంకుమ పువ్వు - చచిటికెడు, యాలకులు పొడి - చిటికెడు.
తయారు చేసే పద్ధతి: ఒక బాణలిలో పుట్నాలను వేసి మీడియం మంట మీద వేయించుకోవాలి. వీటిని బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించి తర్వాత చల్లారనివ్వండి. మిక్సర్‌లో ఈ వేయించిన పుట్నాల పప్పును వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఒక గిన్నెలో ఈ పొడిని తీసుకుని అందులో పొడి చక్కెర పొడిని వేసి బాగా కలపాలి. తర్వాత అందులో నెయ్యి పోసి పిండిలా కలపండి. ఈ బర్ఫీ పిండిని ఒక ప్లేట్లో వేసి అందులో యాలకుల పొడి, తురిమిన బాదం, కుంకుమ రేకులు వేసి అలంకరించండి. దీన్ని అరగంట పాటు చల్లారనివ్వండి. ఆపై ముక్కలుగా కట్ చేసి సాయంత్రం పూట స్నాక్స్‌గా తీసుకోవచ్చు.