Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాధారణంగా పిల్లలు తమ తాతలు, తండ్రుల నుండి ఆస్థిని వారసత్వంగా తీసుకుంటారు. కానీ ఈమె మాత్రం సామాజిక సేవను వారసత్వంగా అందిపుచ్చుకున్నారు. ఆనాడు కేరళ రాష్ట్రంలో దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన పున్నప్ర-వాయిలార్ తిరుగుబాటులో ఆమె తాత ప్రాణాలను పోగొట్టుకున్నారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు కుసుమం. ఆర్ పున్నప్ర. అసంఘటిత రంగం మహిళకు ప్రసూతి సమయంలో అందాల్సిన సదుపాయలపై గట్టిగా పోరాడుతున్నారు. ముఖ్యంగా ఐటీలో పని చేస్తున్న మహిళల హక్కుల కోసం నిలబడ్డ ఆమె పోరాట పరిచయం నేటి మానవిలో...
అరవై ఏడేండ్ల కుసుమం.ఆర్ పున్నప్రా... కేరళకు చెందిన సామాజిక కార్యకర్త. ఐటీ రంగంలో పని చేస్తున్న మహిళలకు ఆరు నెలల ప్రసూతి సెలవులు, డే కేర్ సదుపాయాల కోసం స్థిరంగా పనిచేస్తున్నారు. ఆమె పుట్టి పెరిగిన గ్రామమైన పున్నప్రా పేరుతోనే ఆమె పేరు మిళితం చేయబడింది. 1946లో దోపిడీకి వ్యతిరేకంగా కార్మికవర్గం చేసిన ప్రసిద్ధి పున్నప్ర-వాయలార్ తిరుగుబాటుకు ఆ గ్రామం ముఖ్యపాత్ర పోషించింది. అటువంటి గ్రామంలోనే ఆమె పెరిగారు. సామాజిక సేవ ఆమె రక్తంలోనే నిండి వుంది. ఆమె తాత పంచాయతీ అధికారి, సామాజిక కార్యకర్త. అమ్మమ్మ వారి ఇంటి ప్రాంగణంలో తరచుగా జరిగే వివాదాలకు మధ్యవర్తిత్వం వహించేది. ఆమె తల్లి వనితా సమాజం సభ్యురాలు. ఇలా కుటుంబం మొత్తం సమాజం కోసమే బతికారు. అటువంటి గొప్ప కుటుంబంలో పుట్టిన కుసుమం కూడా వారి అడుగుజాడల్లోనే నడిచారు.
తీవ్ర ప్రభావం
సామాజిక సేవ చేయడమే తన జీవిత లక్ష్యంగా ఎంచుకున్నారు కుసుమం. ఆమె చేస్తున్న సేవ భారతదేశంలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న మహిళల జీవితాలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ''మా తాత పున్నప్రా తిరుగుబాటు సమయంలో కాల్చి చంపబడ్డాడు. అప్పటి పోరాట కథలను వింటూ పెరిగాము. ఆయన రాజకీయ నాయకుడు మాత్రమే కాదు గొప్ప మానవత్వం ఉన్నవాడు. నా కుటుంబ వాతావరణం సమాజంలో ఇబ్బందులు పడుతున్న మహిళలు, పిల్లల పట్ల సానుభూతిని పెంచుకునేలా చేసింది'' అని ఆమె అన్నారు. కెమిస్ట్రీలో గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత కుసుమమ్ తిరువనంతపురంలోని కెల్ట్రాన్లో చేరారు. తర్వాత ట్రేడ్ యూనియన్‌లో పని చేస్తూ వనితా సమాజం ద్వారా తన సామాజిక సేవను కొనసాగించారు. మత్స్యకారులను సందర్శించి వారికి పోషకాహారం, ఆరోగ్యంపై అవగాహన పెంచేవారు. ఆమె నివసించిన మరుంతంకుజి రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌లో క్రియాశీల సభ్యురాలిగా పని చేసేవారు.
కూతురి కష్టం చూసి
కెల్ట్రాన్ ప్రభుత్వ సంస్థ అయినందున క్రెచ్ సదుపాయం, నర్సింగ్ విరామాలతో సాధారణ పని గంటలను చట్టం ప్రకారం అనుమతించింది. ప్రసూతి విరామం తర్వాత కుసుమమ్ తిరిగి ఉద్యోగానికి వెళ్లవలసి వచ్చినప్పుడు ఇది ఆమెకు ఎంతో ఉపయోగపడింది. అయితే 2005లో బీటెక్ పూర్తి చేసిన తర్వాత తన కూతురు పెద్ద ఐటీ కంపెనీల్లో చేరినప్పుడు ఐటీ రంగంలోని ఉదాసీనత, అసమానత్వం రెండింటినీ ఆమె అర్థం చేసుకున్నారు. ''మా అమ్మాయి రాత్రి 10.30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చేది. చాలా కష్టంగా అనిపించేది. ఇక అలాంటి కంపెనీల్లో పనిచేసే తల్లుల పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆశ్చర్యపోయాను'' అని ఆమె అన్నారు. ఆమె కూతురు రెండేండ్ల తర్వాత తన ఉద్యోగాన్ని వదులుకుంది. యుకేకి వెళ్లి చదువుకుంది. తర్వాత తన కుటుంబంతో అక్కడే స్థిరపడింది.
వెంటాడుతూనే ఉన్నాయి
కూతురు ఐటీ రంగంలో ఉద్యోగం మానేసినా అందులో పనిచేస్తున్న మహిళల కథలు కుసుమంను తీవ్రంగా ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. అప్పటికి వ్యాసాలు, చిన్న కథలు, నవలలు రాస్తుండేవారు. మలయాళం నుండి స్వేచ్ఛానువాదం చేయబడిన 'టెక్ బేబీస్ ఆర్ డినైట్ బ్రెస్ట్‌మిల్క్' అనే అభిప్రాయాన్ని సెప్టెంబర్ 2014లో మాతృభూమి వార్తాపత్రికలో ప్రచురించింది. ఆమె అడిగేది వాస్తవికమైనది, న్యాయమైనది. పెయిడ్ మెటర్నిటీ లీవ్ మంజూరు చేయడం, డే కేర్ సౌకర్యాలను అందించడం, ఐటీ రంగంలోని మహిళలకు నర్సింగ్ విరామాలను అనుమతించడం. దీనికి ముందు ఆమె తన ఉద్యోగం నుండి పదవీ విరమణ చేసిన ఆరు నెలల తర్వాత కేరళ లేబర్ కమీషన్ కార్యాలయాన్ని అనేక సార్లు సందర్శించి. చట్టాలను అర్థం చేసుకుంది. మానవ హక్కుల కమిషన్‌కు కూడా తన కథనాన్ని పంపింది. ఇది అధికారులను ప్రేరేపించింది.
స్నేహపూర్వక కార్యాలయాలకై
మొదట ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్-జుూ× చట్టం 1948 సవరించబడింది. దాని తర్వాత ఆమె పిటిషన్ ఆధారంగా 1961 మెటర్నిటీ బెనిఫిట్స్ చట్టం సవరించబడింది. 2015లో ఒక గెజిట్ నోటిఫికేషన్ ఆమోదించబడింది. ఇది 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలకు డే కేర్ సెంటర్లు, పనిప్రదేశానికి 500 మీటర్ల దూరంలో మహిళలు తమ పిల్లలకు పాలిచ్చే సౌకర్యం ఉండాలని ఆదేశించింది. ఐటీ రంగంలో మహిళలకు ఆరు నెలల ప్రసూతి సెలవులను అనుమతించే చట్టం చివరకు 2017లో ఆమోదించబడింది. ''మేము మొదట జుూ× చట్టాన్ని సవరించాలని భావించాము. లేకుంటే కంపెనీలు తమ మహిళా ఉద్యోగులను వేరే రాష్ట్రానికి బదిలీ చేసే అవకాశం వుంది'' అని ఆమె ఎత్తి చూపారు. కుసుమం చేసిన తదుపరి పోరాటం సెల్ఫ్ ఫైనాన్సింగ్ పాఠశాలలు, ఇంజనీరింగ్, మెడికల్, నర్సింగ్ కాలేజీలలోని ఉపాధ్యాయులకు అదే ప్రయోజనాలను అందించడం.
వన్ ఉమెన్ ఆర్మీగా
'త్రిస్సూర్‌లోని ఓ నర్సింగ్ కళాశాల ట్యూటర్ల బృందం నన్ను కలిసింది. నేను కార్మిక సంస్థకు ఒక వినతిపత్రాన్ని రాశాను. చరిత్రలో మొదటిసారిగా వారికి ఆరు నెలల ప్రసూతి సెలవులు మంజూరు చేయబడ్డాయి. మహాత్మా గాంధీ యూనివర్శిటీ నుండి నన్ను సంప్రదించిన 13 మంది గర్భిణీ స్త్రీల కోసం కూడా నేను పోరాడాను'' అని ఆమె గుర్తుచేసుకున్నారు. కుసుమం తనను తాను ఏ సంస్థ లేదా రాజకీయ పార్టీకి అనుబంధించని వన్ ఉమెన్ ఆర్మీ అని పిలుచుకుంటుంది. తన కుటుంబం, సహోద్యోగులు లేదా ట్రేడ్ యూనియన్ సభ్యులైన వివిధ రంగాల్లో మద్దతు లభించడం తనకు దొరికిన మంచి అవకాశం అని ఆమె చెప్పారు. ఇంకా డే కేర్ ఫెసిలిటీ నిబంధనను అమలు చేయడానికి కొన్ని ఐటీ కంపెనీలకు గతేడాది వరకు పట్టింది.
ప్రయత్నిస్తూనే ఉంటాను
''తాము క్రెచ్ సౌకర్యాలను ప్రారంభించినట్టు టాటా ఎల్క్సీ నాకు రాసింది. ఈ ఏడాది జూలైలో తిరువనంతపురంలోని పీఎస్సీ కార్యాలయంలో కూడా డే కేర్ సెంటర్ ప్రారంభించింది'' అని ఆమె చెప్పారు. ప్రస్తుతం కుసుమం వృద్ధాప్య శిక్షణ పొందే హోమ్ నర్సుల కోసం కృషి చేస్తున్నారు. దీనిని అమలు చేయాలని మానవ హక్కుల కమిషన్ ప్రభుత్వానికి కచ్చితమైన ఆదేశాలు ఇచ్చిందని చెప్పారు. ''కార్మిక శాఖ, మానవ హక్కుల సంఘంతో పాటు నాలాగే ఆలోచించే వ్యక్తుల నుండి పూర్తి సహకారం లభించడం నాకు దొరికిన మంచి అవకాశం. మహిళలు, పిల్లల స్నేహపూర్వక కార్యాలయాల కోసం నా జీవితమంతా ప్రయత్నిస్తూనే ఉంటాను'' అని ఆమె ముగించారు.