Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొంతమందికి చిన్నతనంలోనే ముఖంపై ముడతలు పడుతుంటాయి. దీంతో వయసు తక్కువే అయినా ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. మరి ఈ సమస్యను తగ్గించుకోవడానికి రకరకాల చికిత్సలు చేయించుకోవడం, ఏవేవో క్రీములు రాసుకోవడం.. వంటివి చేస్తుంటారు. ఫలితంగా కొందరికి సమస్య తగ్గకపోగా.. కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. కాబట్టి ముందు నుంచే మంచి పోషకాహారం తీసుకోవడం వల్ల వృద్ధాప్య ఛాయలు దరికి రాకుండా.. నవయవ్వనంతో మెరిసిపోవచ్చు. అవేంటే చూద్దాం...
చర్మ సౌందర్యానికి ఉపయోగపడే పాలీఫినోల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, విటమిన్లు.. మొదలైనవి బ్లూబెర్రీ పండ్లలో అధికంగా లభిస్తాయి. ఇవి ఫ్రీరాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. అలాగే కొత్త చర్మకణాలను ఉత్పత్తి చేయడంలోనూ ఇవి సహాయపడతాయి. కాబట్టి వీటిని రోజూ తీసుకోవడం వల్ల నవయవ్వనంగా మెరిసిపోవచ్చు.
టమాటాల్లో ఉండే లైకోపీన్ సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల నుంచి చర్మానికి రక్షణ కల్పిస్తుంది. ప్రతిరోజూ టమాటాలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్తనాళాల్లో రక్తప్రసరణ సజావుగా జరిగి చర్మానికి మెరుపు వస్తుంది.
తేనెలో ఉండే యాంటీవైరల్, యాంటీఆక్సిడెంట్ గుణాలు చర్మాన్ని నవయవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. అందుకే తేనెను ఇంట్లో సహజసిద్ధంగా తయారు చేసుకునే ఫేస్మాస్కులలో ఉపయోగిస్తారు.
చర్మానికి ఉపయోగపడే బ్యాక్టీరియా పెరుగులో ఉంటుంది. దీనివల్ల చర్మం లోపల, బయటి నుంచి కూడా నవయవ్వనంగా తయారవుతుంది. అలాగే కొన్ని సందర్భాల్లో చర్మం ఎర్రగా మారడం, దద్దుర్లు రావడం జరుగుతుంది. ఇలాంటి సమస్యల్ని తగ్గించుకోవడానికి పెరుగులో ఉండే ప్రొబయోటిక్స్ తోడ్పడతాయి.
ఓట్స్ మనకు సహజసిద్ధంగా మొక్కల నుంచి లభించేవి. కాబట్టి వీటిని తినడం వల్ల చర్మకణాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా కాపాడుకోవచ్చు. ఇవేకాకుండా సహజంగా మొక్కల నుంచి లభించే గోధుమ, బార్లీ.. వంటి తృణధాన్యాలను కూడా మనం రోజూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల చర్మంపై ముడతలు, వృద్ధాప్య ఛాయలు దరికి రాకుండా జాగ్రత్త పడచ్చు.
మన శరీరంలో ఎప్పటికప్పుడు కొత్త చర్మ కణాలు ఉత్పత్తయితే చర్మం తాజాగా, నవయవ్వనంగా కనిపిస్తుంది. కాబట్టి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే గ్రీన్ టీని ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఇది కొత్త చర్మ కణాల్ని ఉత్పత్తి చేయడంలో.. వాటి అభివృద్ధిలో తోడ్పడుతుంది.
చర్మం నవయవ్వనంగా కనిపించాలంటే మన శరీరంలో నీటిశాతం తగినంత ఉండాలి. కాబట్టి నీటి శాతం ఎక్కువగా ఉండే నారింజ పండ్లను తీసుకోవాలి. వీటితో పాటు యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఇతర పండ్లు, కూరగాయల్ని ఎక్కువ మొత్తంలో తినడం అలవాటు చేసుకోవడం వల్ల వృద్ధాప్య ఛాయలు రాకుండా నివారించుకోవచ్చు.