Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో ఉసిరి ముందుంటుంది. శిరోజాలను ఒత్తుగా చేయడమే కాదు, బాలనెరుపు వంటి సమస్యలను దరిచేరనివ్వదు అంటున్నారు నిపుణులు.
ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, వాతావరణ కాలుష్యం వంటివి శిరోజాలు రాలడానికి కారణాలు అవుతాయి. సి విటమిన్ సహా యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజ లవణాలు, అమీనో యాసిడ్స్ పుష్కలంగా ఉండే ఉసిరితో జుట్టుకు లెక్కలేనన్ని ప్రయోజనాలను అందించొచ్చు. చుండ్రును దూరం చేసి, జుట్టు కుదుళ్లను బలంగా ఉంచి, రక్తప్రసరణను మెరుగు పరిచి, ఆరోగ్యంగా, ఒత్తుగా పెరిగేందుకు ఉసిరి దోహదపడుతుంది.
శరీరం నుంచి వచ్చే వేడికి శిరోజాలు ప్రభావితం కాకుండా ఉసిరి మాడుకు చల్లదనాన్ని అందిస్తుంది. ఇందులోని యాంటీ ఏజింగ్ గుణాలు బాలనెరుపు వంటి సమస్యలను దరికి చేరకుండా పరిరక్షిస్తాయి. తలకు స్నానం చేసేటప్పుడు మూడు ఉసిరికాయలను మెత్తని గుజ్జుగా చేసి రసం తీయాలి. లేదా ఉసిరి పొడిని రెండు మూడు చెంచాలకు మూడునాలుగు కుంకుడు కాయలు, నాలుగైదు శీకాకాయలను కలిపి నానబెట్టాలి. ఈ మిశ్రమాన్ని తలకు మృదువుగా రుద్ది తలస్నానం చేస్తే చాలు. శిరోజాలు రాలే సమస్యకు దూరంగా ఉండొచ్చు.