Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మధ్యాహ్నం భోజనం చేశాక.. చాలామంది నిద్రొచ్చినట్టుగా, మగతగా ఫీలవుతుంటారు. మరి ఇంట్లో ఉంటే కాసేపు కునుకు తీయచ్చు. కానీ చాలామంది ఆ సమయంలో ఆఫీస్‌లో ఉంటారు.. ఇలా మగతగా ఉన్నప్పుడు చేసే పనిపై ఏకాగ్రత పెట్టలేం.. అలాగని కాసేపు రిలాక్సవుదామంటే కుదరకపోవచ్చు. అందుకే ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే కొన్ని అంశాలు దృష్టిలో ఉంచుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటో చూసేద్దామా?!
తిన్న వెంటనే శరీరం రిలాక్సవుతుంది. దాంతో నిద్రొచ్చినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి తిన్న వెంటనే మీ సీట్లో వాలిపోకుండా ఓ పది నిమిషాల పాటు నడక మంచిదంటున్నారు నిపుణులు. దీనివల్ల శరీరంలో ఆక్సిజన్ స్థాయులు పెరిగి అవయవాలకు రక్తప్రసరణ మెరుగవుతుంది. తద్వారా శరీరం తిరిగి శక్తిని కూడగట్టుకుంటుంది. ఫలితంగా అలసట, నీరసం, మగతగా అనిపించడం వంటివన్నీ దూరమవుతాయి.
నిద్రొచ్చినప్పుడు చాలామంది చిప్స్ లాంటివి తింటూ నిద్రను దూరం చేసుకోవాలనుకుంటారు. అయితే వీటికి బదులుగా చూయింగ్ గమ్ నమిలితే నిద్ర మత్తు వదిలిపోతుంది అని చెబుతోంది ఓ అధ్యయనం. అయితే అది కూడా ఐదు నుంచి పది నిమిషాలు చాలట!
శరీరం డీహైడ్రేషన్‌కి గురైనా అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి రోజూ సరైన మోతాదులో నీళ్లు తాగడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. అలాగే మధ్యాహ్నం భోజనం తర్వాత కూడా కొంత విరామం ఇచ్చి నీళ్లు, ఇతర పానీయాలు తీసుకోవడం వల్ల శరీరం పునరుత్తేజితమవుతుంది.
మధ్యాహ్న భోజనంలో మనం తీసుకునే కొన్ని ఆహార పదార్థాలు కూడా మగతగా అనిపించేలా చేస్తాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా నూడుల్స్, బర్గర్స్, వేపుళ్లు, దోసె, బిరియానీ.. వంటివి తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర స్థాయులు పెరుగుతాయి. దీనివల్ల అలసట, నీరసం వస్తాయి. కాబట్టి లంచ్‌లో ఐరన్ (ఆకుకూరలు), శ్యాచురేటెడ్ కొవ్వులు తక్కువగా ఉండే ప్రొటీన్లు (మాంసం, చేపలు, గుడ్లు), సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు (హోల్‌గ్రెయిన్స్, పప్పులు).. వంటివి తీసుకోవడం మేలంటున్నారు.
మధ్యాహ్న భోజనం కడుపు నిండుగా తినాలనుకుంటారు చాలామంది. ఆ సమయంలో నిద్ర రావడానికి, మగతగా అనిపించడానికి ఇదీ ఓ కారణమేనట. అతిగా తినడం వల్ల కడుపు ఉబ్బరంగా, అసౌకర్యంగా అనిపిస్తుంది.. శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది. కాబట్టి ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినకుండా, తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు తినేలా ప్లాన్ చేసుకోవాలంటున్నారు నిపుణులు.
రాత్రుళ్లు కనీసం ఏడెనిమిది గంటల సుఖ నిద్ర ఉన్న వారిలో ఈ మగత ఫీలింగ్ ఉండనే ఉండదు. తద్వారా లంచ్ తర్వాతే కాదు.. ఇతర సమయాల్లోనూ కునుకు రానే రాదు. కాబట్టి రాత్రిళ్లు సుఖంగా నిద్రపోయేలా అలవాటు చేసుకోండి.
ఎక్కువసార్లు కాఫీ తాగే అలవాటున్నా ఈ సమస్య తలెత్తుతుందని చెబుతున్నారు నిపుణులు. ఇందుకు దీనిలోని కెఫీనే కారణమట. కాఫీ ఎక్కువగా తాగడం వల్ల రాత్రుళ్లు సరిగా నిద్ర పట్టక, పగటి పూట మగతగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి రోజుకు ఒకటి లేదా రెండు కప్పులకు మించి కాఫీ తాగకపోవడమే ఆరోగ్యకరం.