Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనం ఏ వస్తువు కొన్నా ఏదో ఒక అట్టపెట్టెలో ప్యాక్ చేసి ఇస్తారు. కొనే వస్తువు ఆకారాన్ని బట్టి ఆయా అట్టపెట్టెల ఆకారాలు మారుతూ ఉంటాయి. ప్రతి ఇంట్లో చాలా అట్టపెట్టెలు పేరుకుపోతూనే ఉంటాయి. వాటితో ఏదైనా పనికొచ్చే వస్తువులు తయారు చేసుకుంటే బాగుంటుంది. ఏసీలు, ఫ్రిజ్జులు, పరుపులు వంటివి కొన్నప్పుడు పెద్ద పెద్దవే ప్యాకింగులు వస్తాయి. షూస్, చెప్పులు, గాజు వస్తువులు కొన్నపుడు వచ్చే అట్టపెట్టలూ పనికొస్తాయి. జాగ్రత్తగా చూసుకుంటే సంవత్సరాల కాలం మన్నుతాయి. నేను 30 ఏండ్ల కిందట చేసినవి ఇప్పటికీ బాగున్నాయి. ఒకటీ అరా పాడయిపోయాయి తప్ప. పాడయినా కొత్త క్రియేటివిటీతో కొత్త వస్తువులు మరలా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడంతా 'యూజ్ అండ్ త్రో' సిద్ధాంతమే కదా! పెద్ద పెద్ద ఫర్నిచర్లు సైతం ఐదారేండ్లు వాడుకుని మార్చేస్తున్నారు. మనం అట్ట పెట్టెలతో అందమైన వస్తువులు చేద్దాం.
ఇల్లు కడదాం
మా ఇంట్లో మందులు ప్యాక్ చేసి వస్తాయి కాబట్టి చాలా అట్టపెట్టెలే ఉంటాయి. అలాంటి ఒక పెద్ద అట్టపెట్టెతో నేనీరోజు ఇల్లు కట్టబోతున్నాను. జపాన్ దేశంలో అట్టలతో ఇల్లు కట్టుకుంటారు అని చిన్నప్పుడు ఆశ్చర్యంగా చెప్పుకునే వాళ్ళం. వాళ్ళు మనలా ఎందుకు కట్టుకోరు అని సందేహాలు అడిగితే అక్కడ భూకంపాలు ఎక్కువగా వస్తాయి కాబట్టి ప్రమాదాలు నివారించటానికి అలా కట్టుకుంటారు అని చెప్పేవారు. జపాన్ వెళ్ళకుండానే మనమిక్కడ అట్ట ఇల్లు కట్టేసుకుందాం. అట్టపెట్టెకున్న మూతలు తీసేసి ఇంటికి బేస్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు మరో అట్టపెట్టె నుంచి ముక్కలు కత్తిరించి బేస్ మీద ఏటవాలుగా అతికిస్తే ఇల్లు ఆకారం వస్తుంది. వాటికి మధ్యలో చిన్న చిన్న నలుచదరపు రంధ్రాలు చేస్తే కిటికీల వలె కనిపిస్తాయి. అలాగే ద్వారం కోసం కూడా కత్తిరించాలి. ఇంటి మీద ఇల్లు కూడా కట్టుకోవచ్చు. దాని కోసం మెట్లు కట్టుకోవాలి. అట్ట ముక్కల్ని సన్నగా కత్తిరించి మెట్లగా అమర్చుకోవాలి. చుట్టూ ప్రహరీగోడ, కుండీల్లో చెట్లు ఏమైనా మీ క్రియేటివిటీ చూపించండి. ఇంజనీరింగ్ చదవకుండానే ఇల్లు కట్టేయొచ్చు.
షూ రాక్
ఇప్పుడు చాలామంది ఆన్లైన్లోనే వస్తువులు తెప్పించుకుంటున్నారు కదా! అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో మనం వస్తువులు ఆర్డర్ చేసినపుడు వాళ్ళు పక్కా ప్యాకింగ్‌తో పంపిస్తున్నారు. గట్టిగా ఉండే అట్టలతో ప్యాక్ చేయబడి వస్తున్నాయి. ఆ అట్ట పెట్టెలతో ఇలాంటివి చేసుకోవచ్చు. బాగా గట్టిగా ఉండే అట్టలు, చెక్కలంత బలంగా ఉంటున్నాయి. అట్టపెట్టెలకు పై భాగాన నాలుగు మూతలుగా అట్టలుంటాయి కదా! వీటిలో రెండింటిని కత్తిరిస్తే సరిపోతుంది. ఇప్పుడు అట్ట పెట్టెను నిలువుగా నిలబెడితే అలమరలా కనిపిస్తుంది. అట్టకు మొత్తం గిప్ట్ ప్యాకింగ్ రేపర్‌ను అతికించాలి. అలాగే ముందు తలుపుల్లా ఉన్న రెండు అట్టలకు చిన్న గుబ్బలు అతికించాలి. తలుపు తీయడానికి హ్యాండిల్ వలె పనికొస్తుంది. అలాగే లోపల రెండు, మూడు అట్టలను అడ్డంగా ఫిక్స్ చేసుకోవాలి. రెండు మూడు అరలుగా ఉంటే చెప్పులను పెట్టుకోవచ్చు. షూ రాక్ తయారైనట్టే. ఒకవేళ అట్టలు చెప్పుల బరువు మోసేంత బలంగా లేకపోతే బరువు తక్కువుండే ఏదైనా సామాన్లు పెట్టుకోవచ్చు. అంటే సాక్సులు, షూ పాలిష్‌లు, స్ప్రే బాటిల్స్, హిట్ వంటి దోమలు, కాక్రోచ్ల స్ప్రేలు ఎన్నో రకాలుగా పెట్టుకోవచ్చు.
డస్ట్‌బిన్
షూ ప్యాకెట్లు బలంగా ఉంటాయి. వీటితో డస్ట్‌బిన్ కవర్ హౌల్డర్ చేయవచ్చు. లేదంటే టిష్యూపేపర్ హౌల్డర్ కూడా చేయవచ్చు. బాత్రూమ్లో వాడే టారులెట్ పేపర్ హౌల్డర్గా కూడా వాడవచ్చు. ఇంట్లో చిన్నపిల్లలుంటే ఫ్రిజ్ ఆకారంలో చేయించవచ్చు. షూ ప్యాకెట్లో మధ్యలో అరల్లాగా అమర్చి ఫ్రిజ్‌లా అమర్చవచ్చు. ఆ అరల్లో పిల్లల వంటసెట్లులో ఉండే గిన్నెలు మూతలు పెట్టి అలంకారం చేయవచ్చు. పెద్ద పెద్ద అట్ట పెట్టెలే కాదు చిన్న చిన్న అట్టపెట్టెలతో కూడా బొమ్మలు చేసుకోవచ్చు.
డ్రెస్సింగ్ టేబుల్
అట్టపెట్టెలతో డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజర్‌ను చేసుకోవచ్చు. లేదంటే టీపారు మీద పెట్టుకునే అనేక సామాన్లను పెట్టుకోవచ్చు. ఇది మాత్రం గోడకు తగిలించుకోవచ్చు. అట్టపెట్టెలకుండే మూతలను విడిగా కత్తిరించి అన్నీ ఒకే సైజులో వచ్చేలా కత్తిరించుకోవాలి. ఇప్పుడు ఒక అట్టను తీసుకొని త్రికోణాకారంలో అతికించుకుని చివర్లు పిన్ చేసుకోవాలి. ఒక పది త్రికోణాలు చేసుకుని ఉంచుకోవాలి. ఒక దాని మీద ఒకటి అమర్చుకుంటే మళ్ళీ త్రికోణాకారం వస్తుంది. దీనిని గోడకు తగిలిస్తే మధ్యలో ఉండే కన్నాలలో సామాన్లు పెట్టుకోవచ్చు. టీవీ రిమోట్లు, కత్తెర్లు, డ్రెస్సింగ్ టేబుల్ సామాన్లు లేదంటే బొమ్మలు కూడా అలంకరించుకోవచ్చు.
చాక్లెట్ బాక్స్
దీనికి ఫోన్ వైఫై బాక్స్ లాంటిది చాలు. వెడల్పు ఎక్కువగా లోతు తక్కువగా ఉండే అట్టపెట్టెలు బాగుంటాయి. అయితే అన్నింటినీ కవర్ చేసినట్టుగా గిఫ్ట్ ప్యాకింగ్ పేపర్తోనో, డ్రాయింగ్ పేపర్తోనో డెకరేట్ చేయకూడదు. కొంచెం కొత్తగా చేద్దాం. ఈ అట్టపెట్టెకు పై భాగాన్ని అందంగా అలంకరించాలి. ఎలా చేద్దామంటే చంద్రుడు, తారకలు వచ్చేలా కత్తిరించాలి. చిల్లులుగా తయారైన భాగంపై వంటకాల మీద కప్పే రాపర్‌ను అతికించాలి. లోపల పెట్టిన చాక్లెట్లు కనిపిస్తూ ఉంటాయన్నమాట. మిగతా అట్ట పెట్టెను బంగారు రంగు స్ప్రే కలర్‌తో స్ప్రే చేయాలి. బంగారు రంగు, జాబిల్లి, నక్షత్రాలు పిల్లల కిష్టమైన అలంకరణతో వాళ్ళకిష్టమైన చాక్లెట్ల బాక్స్ చేస్తే బాగుంటుంది.
వాల్ హ్యాంగింగ్
అట్టను అమ్మాయి ముఖంలా కత్తిరించి అతికించుకుంటే గోడకు అలంకరించే వాల్ హ్యాంగింగ్ అవుతుంది. తలను గుండ్రంగా కానీ కోలగా గానీ కత్తిరించి కళ్ళు, ముక్కు, నోరు పెట్టుకోవాలి. తల కింద భాగం నలుచదరంగా కత్తిరించి అతికించాలి. డ్రెస్ వలె రంగురంగుల కాగితాలు కత్తిరించి అతికిస్తే బాగుంటుంది. తల, జడలు వచ్చేలా అన్నీ పెట్టి రంగులు వేసి హ్యాంగింగ్ చేసుకోవచ్చు. అట్ట పెట్టెను ఏమీ కత్తిరించకుండానే టీపారు క్లాత్ వేసి పిల్లలకు చిన్ని టీపారులాగా అమర్చవచ్చు. ఆలోచిస్తే ఎన్నో ఐడియాలు... ప్రయత్నించండి.