Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏండ్లు గడుస్తున్నా రుతుస్రావం ఓ నిషిద్ధంగానే మిగిలిపోయింది. అయినప్పటికీ కొంత మంది మహిళల అభివృద్ధిని ఇది అడ్డుకోలేదు. ఈ సమస్యపై పోరాడి విజయం సాధించిన వారు ఎందరో ఉన్నారు. వారిలో ప్రాచీ కౌశిక్ ఒకరు. ప్రస్తుతం ఆమె మహిళా వ్యవస్థాపకతను ప్రోత్సహిస్తూ, రుతుక్రమ ఆరోగ్యం గురించి అవగాహన కల్పిస్తూ గ్రామీణ భారతదేశాన్ని మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నిషిద్ధం అనేదే లేకుండా చేయాలని కృషి చేస్తున్నారు.
హర్యానాలోని ఝజ్జర్ సిటీకి చెందిన ప్రాచీ... మహిళలు ఆరోగ్యంగా ఉండటానికి, ఆర్థిక స్వతంత్రం సాధించడానికి, వారి సొంత హక్కులో వ్యవస్థాపకులుగా మారడానికి కావాల్సిన సహకారం అందిస్తున్నారు. దానికోసమే వ్యోమిని సోషల్ ఫౌండేషన్ అనే ఓ సంస్థను స్థాపించారు. ప్రస్తుతం దాని డైరెక్టర్‌గా, ఉన్న ఆమె దేశంలోని వెనుకబడిన వర్గాలలో వ్యవస్థాపకతను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇవ్వడం, పునరుత్పత్తి ఆరోగ్యం గురించి ఎక్కువగా మాట్లాడటం ద్వారా గ్రామీణ భారతదేశాన్ని మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దానికోసమే మహిళల స్వాతంత్య్రాన్ని ప్రోత్సహిస్తూ, వారి మార్కెటింగ్ వాణిజ్య చతురతను పదును పెడుతున్నారు.
అవగాహన కల్పిస్తూ...
వ్యోమిని ద్వారా ప్రాచీ భారతదేశంలో మొట్టమొదటి శానిటరీ వేర్ ఇంక్యుబేటర్ కేంద్రాన్ని స్థాపించారు. దీని ఆధ్వర్యంలో మహిళలకు శానిటరీ ఉత్పత్తులను ఎలా రూపొందించాలో నేర్పుతున్నారు. కంపెనీ కార్యాలయాల్లో వెండింగ్ మెషీన్లను ఇన్స్టాల్ చేస్తున్నారు. సిబ్బందికి రుతుక్రమ ఆరోగ్యం గురించి అవగాహన కల్పిస్తున్నారు. ''నా స్కూల్ ఫీజు కట్టేంత ఆర్థిక స్థితి మా తల్లిదండ్రులకు లేదు. అందుకే చిన్నప్పటి నుంచే ట్యూషన్లు చెబుతూ సంపాదించడం మొదలుపెట్టాను. నా 16 సంవత్సరాల వయసులో మహిళా సాధికారతపై పనిచేయడం ప్రారంభించాను. ఒక ఎన్జీఓలో చేరాను. వివిధ మహిళా సాధికారత ప్రాజెక్టులలో పాలుపంచుకున్నాను'' అని ఆమె చెప్పారు.
వ్యోమిని ప్రారంభించారు
ఢిల్లీ యూనివర్శిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఆమె స్థానిక ఎన్జీఓతో కలిసి పని చేశారు. శానిటరీ న్యాప్కిన్ల యాక్సెస్ సమస్యను పరిష్కరించడంలో సహాయం చేయాలనే కోరికతో మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖలో చేరారు. నెమ్మదిగా ఉన్న అక్కడి పురోగతితో విసుగు చెంది ప్రాచీ వ్యోమినిని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఒక సామాజిక కార్యకర్తగా, ఒక వ్యాపారవేత్తగా కాకుండా వ్యాపారాన్ని నిర్వహించడం, దానిని పెంచడం వంటి ప్రాథమిక అంశాలను అర్థం చేసుకోవడానికి ఆమె శిక్షణ తీసుకున్నారు. నోయిడాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్మాల్ బిజినెస్ డెవలప్మెంట్ (NIESBUD)లో తన వ్యవస్థాపక శిక్షణను పూర్తి చేశారు.
ఆరోగ్యం, ఆర్థిక సాధికారత
''పది సంవత్సరాల తర్వాత నేను మహిళలకు సంబంధించిన రెండు ముఖ్యమైన సమస్యల గురించి అవగాహన చేసుకున్నాను. అవి ఆరోగ్యం, ఆర్థిక సాధికారత. వారు ఆర్థిక స్థితిని, ఆరోగ్యాన్ని పొందడంలో మేము వారికి సహాయం చేయగలిగితే మిగిలిన వాటిని వారు నిర్ణయించుకుంటారు. సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళలు ఎదగడానికి సులభమైన వేదికలు అందుబాటులో ఉండవు. వారు ఎక్కడికైనా చేరుకోవడానికి అనేక సవాళ్లను ఎదుర్కోవాలి'' అని 35 ఏండ్ల ప్రాచీ అంటున్నారు."3As" అవగాహన, స్థోమత, ప్రాప్యత ద్వారా మహిళలకు మద్దతు ఇవ్వాలని ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారు.
నైపుణ్యాలను పెంచుతుంది
వ్యోమిని బృందం మొదట వ్యవస్థాపకులు కావాలనుకునే మహిళలను గుర్తిస్తుంది. తర్వాత అది వారి నైపుణ్యాలను అర్థం చేసుకుని వారికి అవసరమైన శిక్షణనిస్తుంది. వారి వ్యాపారాలను స్థాపించడానికి వారి నైపుణ్యాలను పెంచుతుంది. దాని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ సపోర్ట్ (EDP) కింద కంపెనీ శిక్షణ, సామర్థ్యాన్ని పెంపొందించడం, మార్కెట్ లింకేజీలు, బ్యాంక్, ప్రభుత్వ పథకాల అనుసంధానాలు, మైక్రో-ఎంటర్ప్రైజ్ అభివృద్ధిని అందిస్తుంది. వ్యోమిని ఈ కార్యక్రమం కింద దాదాపు 5,000 మంది మహిళలకు శిక్షణ ఇచ్చింది. దాదాపు 500 మంది మహిళలను ఆదాయాన్ని పెంచే కార్యకలాపాలకు అనుసంధానం చేసింది.
వర్క్‌షాప్‌లను నిర్వహిస్తూ
గత రెండేండ్లలో స్వయం సహాయక బృందాలు, మహిళా సంఘాలు, యువకులు, జైళ్ల నుండి విడుదలైన ఖైదీలు, లింగమార్పిడి సంఘంతో దాదాపు 50 EDP వర్క్‌షాప్‌లను నిర్వహించింది. NIESBUD, నేషనల్ స్మాల్ ఇండిస్టీస్ కార్పొరేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, హర్యానా రూరల్ డెవలప్మెంట్ మిషన్ మద్దతుతో ఇది జరిగింది. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ వారి ఆజీవిక మిషన్ కింద స్వయం సహాయక బృందాల కోసం హర్యానాలోని హిసార్‌లో వ్యోమిని సామర్థ్య నిర్మాణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.
ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహించడం
ఇది పునరుత్పత్తి ఆరోగ్య కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తుంది. రుతు ఆరోగ్యం, పరిశుభ్రత గురించి విస్తృతమైన అవగాహన ప్రచారాలను అనుమతిస్తుంది. అలాగే ఇంటెన్సివ్ కౌన్సెలింగ్, సెన్సిటైజేషన్ క్యాంపులు, స్థిరమైన సానిటరీ పద్ధతులపై వర్క్‌షాప్‌లను కూడా అందిస్తుంది. ఈ బృందం మహిళలకు శానిటరీ నాప్కిన్లను ఎలా తయారు చేయాలో, విక్రయించాలో నేర్పుతుంది. రక్షక్ అని పిలువబడే వ్యోమిని అంతర్గత బ్రాండ్ కింద విక్రయించబడే ఇవి ఆరు న్యాప్కిన్ల ధర రూ. 20. అంతేకాకుండా గృహ హింస బాధితులు సీనియర్ న్యాయవాదుల నుండి సహాయం పొందడానికి కంపెనీ సహాయపడుతుంది.
దేశంలోని ప్రతి జిల్లాకు
''మేము వారిని మంచి ఆసుపత్రులకు కూడా సూచిస్తాము. మంచి వైద్యులచే చికిత్స చేయిస్తాము. వారి సామాజిక, మానసిక సమస్యలను పరిష్కరిస్తాం. మహిళలు ప్రధాన స్రవంతి జీవితాన్ని గడపడానికి మేము సహాయం చేయాలనుకుంటున్నాము'' అని ప్రాచీ పంచుకున్నారు. ప్రాచీ చెప్పిన ప్రకారం వారి సంస్థ తన రుతు ఆరోగ్య నిర్వహణ కార్యక్రమంలో దాదాపు 10 లక్షల మంది మహిళలను పరిశుభ్రమైన వస్తువులను ఉపయోగించుకునేలా చేసింది. ప్రస్తుతానికి వ్యోమిని హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీలో ఉంది. భవిష్యత్‌లో భారతదేశంలోని ప్రతి జిల్లాలో ఇంక్యుబేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ప్రాచీ కోరుకుంటున్నారు. తద్వారా మహిళలు మెట్రో నగరాలకు వెళ్లకుండానే అవసరమైన శిక్షణ పొందవచ్చని ఆమె ఉద్దేశం.