Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డిగ్రీ వరకు ఓ ప్రణాళిక లేకుండా సాగి ముందుకు ఎలా వెళ్లాలో కొందరికి అర్థంకాదు. మరికొందరికి తమకిష్టమైనది ఏ అంశం అనేది కూడా తెలియదు. ఎదుట ఎన్నో రకాల కోర్సులు, అవకాశాలు చూస్తున్నప్పుడు ఎటు వెళ్లాలో నిర్ణయించుకోలేరు. ఇటువంటప్పుడే కౌన్సెలింగ్ తీసుకోవడం మంచిది. కెరియర్లో స్పష్టతను తెచ్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కెరియర్ కౌన్సెలర్లు ఎదుటివారిలోని ఆసక్తి మాత్రమే కాదు, ఎందులో వారికి నైపుణ్యాలున్నాయో కూడా గుర్తిస్తారు. వాటిని ఆధారంగా చేసుకొని ఎటువంటి కెరియర్ను ఎంచుకోవాలో సలహాలూ, సూచనలిస్తారు. చదువులో మాత్రమే కాదు, ఉద్యోగం, వ్యాపారంతోపాటు జీవితానికి సంబంధించిన నిర్ణయాల్లోనూ అస్పష్టతను దూరం చేస్తారు.
ఆసక్తి ఉన్న కోర్సు పూర్తిచేసిన తర్వాత ఆయా రంగాల్లో అవకాశాలు లేవన్న సమయంలో కెరియర్ కౌన్సెలర్లు చేయూతనందిస్తారు. ఆ కోర్సులో చేరేటప్పుడు అవకాశాలుండొచ్చు. తీరా రెండుమూడేండ్లకు ఆ రంగం కుదేలుకావొచ్చు. అంతమాత్రాన నిరుత్సాహపడాల్సిన అవసరంలేదు. అనుబంధ రంగాల్లో ప్రయత్నించొచ్చు. లేదా ఆ కోర్సుకు అనుబంధ కోర్సు జతచేస్తే మంచి ఉద్యోగ అవకాశాలు రావొచ్చు. వీటికి సంబంధించిన నైపుణ్యాలను ఎలా పెంచుకోవాలో కౌన్సెలర్ల వద్ద తెలుసుకోవచ్చు. కెరియర్ పరంగానే కాకుండా దీనికి కావాల్సిన మానసిక సంసిద్ధతనూ అందిస్తారు. నైపుణ్యాలు, ఆసక్తి, ఆలోచనలు, భావోద్వేగాలనూ తెలుసుకొని దానికి తగినట్టు కెరియర్ను కూడా సూచిస్తారు.
చదువు, ఉద్యోగం మాత్రమే కాదు, వీరు వ్యాపార రంగంలోనూ సలహాలు, సూచనలు అందిస్తారు. నైపుణ్యం, ఆసక్తి ఉండి కూడా ధైర్యంలేక వెనకడుగు వేస్తున్నప్పుడు వీరిని సంప్రదిస్తే సరైన మార్గాన్ని చూపిస్తారు. ఆసక్తి మేరకు మెరుగుపరుచుకోవాల్సిన అంశాలను చెప్పి, అడుగుపెట్టే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలూ చెబుతారు. విద్యార్థిగా ఉన్నప్పుడు ఉన్న అభిరుచిని కూడా కెరియర్‌గా మార్చుకోవడానికి చేయూతనిస్తారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఉన్న వేదికలు, పలురకాల యాప్‌ల గురించి అవగాహన కలిగిస్తారు.