Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మునగలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఎముకలు, దంతాలని దృఢంగా మార్చడంతో పాటు బరువుని కంట్రోల్ చేస్తుంది. రక్తాన్ని శుభ్రపరచడంలో మునగాకులు బాగా ఉపయోగపడతాయి. ఈ ఆకుల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారికి ఎంతో మేలు చేస్తుంది. మునగాకు కూర తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. బీపీ కూడా నియంత్రణలోకి వస్తుంది. ఇన్ని ప్రయోజనాలున్న మునగాకుతో రకరకాల వంటలు చేసుకోవచ్చు. అవేంటో చూద్దాం...
రసం ఇలా...
కావాల్సిన పదార్ధాలు: కందిపప్పు - 200 గ్రాములు, టొమాటో ముక్కలు - పావు కప్పు, చింతపండు - తగినంత, మిరియాలు - ఆరు, ధనియాలు - టీ స్పూను, పచ్చిమిర్చి - ఆరు, వెల్లుల్లి రేకలు - ఎనిమిది, నూనె - రెండు టీ స్పూన్లు, మునగాకు - 200 గ్రాములు, నూనె - మూడు టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి - ఎనిమిది, ఆవాలు - టేబుల్ స్పూను, జీలకర్ర - టేబుల్ స్పూను, కరివేపాకు - రెండు రెమ్మలు, పసుపు - కొద్దిగా, ఉప్పు - తగినంత, మినప్పప్పు - 100 గ్రా., కొత్తిమీర - కొద్దిగా, కరివేపాకు - రెండు రెమ్మలు.
తయారు చేసే విధానం: ముందుగా కందిపప్పును కడిగి, టొమాటో ముక్కలు జతచేసి, కుకర్లో మెత్తగా ఉడికించాలి. చింతపండును నానబెట్టి రసం తీసి పక్కన ఉంచుకోవాలి. మిరియాలు, ధనియాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి. బాణలిలో నూనె కాగాక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు వరసగా వేసి వేయించాలి. మునగాకు జతచేసి ఉడికించిన పప్పు, ఉప్పు, నీరు పోసి మూడు నాలుగు నిముషాలు ఉడికించాలి. చింతపండు రసం, పసుపు వేసి బాగా మరిగించాలి. కొత్తిమీర, కరివేపాకు వేసి దించేయాలి. అంతే మునగాకు రసం రెడీ.
కారం పొడి రుచిగా...
కావల్సిన పదార్థాలు: మునగాకు - కప్పు, నూనె -ఒకటిన్నర టేబుల్ స్పూన్లు, పల్లీలు - టేబుల్ స్పూను, నువ్వులు - టేబుల్ స్పూను, శనగ పప్పు - టేబుల్ స్పూను, మినప పప్పు - టేబుల్ స్పూను, ధనియాలు - టేబుల్ స్పూను, ఎండు మిర్చి - 10 నుంచి 15, జీలకర్ర - టేబుల్ స్పూను, చింతపండు - 50 గ్రాములు, వెల్లుల్లి రెబ్బలు - 10, ఉప్పు - రుచికి సరిపడా.
తయారు చేసే విధానం: ముందుగా మునగాకును శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో అర టేబుల్ స్పూను నూనె పోసి కాగాక ఆరబెట్టుకున్న మునగాకును వేసి తక్కువ మంటపై బాగా వేయించుకోవాలి. మునగాకు బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో పల్లీలు, నువ్వులను వేరు వేరుగా వేసి వేయించి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూను నూనె వేసి శనగపప్పు, మినప పప్పు, ధనియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు ఒక్కొక్కటిగా వేస్తూ వేయించుకోవాలి. ఇవి వేగాక జీలకర్ర, చింతపండు, రుచికి సరిపడా ఉప్పును వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, మునగాకును వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక జార్లో వేసి మెత్తగా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న పొడిని మూత ఉన్న డబ్బాలో వేసి గాలి తగలకుండా నిల్వ చేయాలి. వేడి వేడి అన్నంలో మునగాకు పొడి, నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉండడమే కాకుండా.. మునగాకులో ఉండే ఔషధ గుణాలు శరీరానికి లభిస్తాయి. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. అనేక వ్యాధులు రాకుండా ఉంటాయి. రోజూ అన్నంలో మొదటి ముద్ద ఈ పొడిని కలిపి తింటే అనేక వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.
నోరూరించే పచ్చడి
కావలసిన పదార్ధాలు: మునగాకు - పావు కేజీ, చింతపండు - కొద్దిగా, ఎండుమిర్చి - రెండు, పచ్చిమిర్చి - రెండు, కొత్తిమీర - రెండు కట్టలు, వెల్లులి - నాలుగు రెబ్బలు, జీలకర్ర - అర చెంచా, ఉప్పు - తగినంత, పసుపు - 1 /8 స్పూను, పల్లీలు - పావు కప్పు, నూనె - సరిపడినంత, తాలింపుగింజలు - కొద్దిగా.
తయారు చేసే విధానం: మునగాకు కడిగి ఆరబెట్టి పుల్లలు, ఈనెల లేకుండా దూసి ఉంచుకోవాలి. పొయ్యిమీద పాన్లో నూనె వేడిచేసి పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి ముక్కలు, వెల్లులి, జీలకర్ర వేయించాలి. అవివేగాక మునగాకు వేసి వేయించుకోవాలి. పసుపు వేసి అవి పూర్తిగా వేగుతున్న సమయంలో కొత్తిమీర ఆకులువేసి ఉప్పు, చింతపండు వేసి మూతపెట్టి మగ్గనిచ్చి పొయ్యిమీద నుండి దించి చల్లారనివ్వాలి. ఈ లోగా పల్లీలు దోరగా పొడి మూకుడులో వేయించుకోవాలి. ఇవ్వన్నీ కలిపి పచ్చడిలా రుబ్బుకోవాలి. ఈ పచ్చడిని విడిగా గిన్నెలోకి తీసుకుని పైన నూనెలో వేయించిన తాలింపుగింజలు, కరివేపాకు వేసుకోవాలి. ఈ పచ్చడి చాలా బావుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలామంచిది.
పప్పెంతో కమ్మగా
కావాల్సిన పదార్ధాలు: పెసరపప్పు - కప్పు, శనగపప్పు - మూడు టేబుల్ స్పూన్లు, కాబూలీ సెనగలు - 15 నుండి 20, ఉల్లిగడ్డ తరుగు - అర కప్పు, పచ్చిమిర్చి చీలికలు - నాలుగు, టొమాటో - ఒకటి, పసుపు - టీస్పూను, నీళ్ళు - అరకప్పు, కొత్తిమీర - చిన్న కట్ట, మునగాకు - వంద గ్రాములు, నూనె - రెండు టేబుల్ స్పూన్లు, ఆవాలు - టీస్పూను, జీలకర్ర - టీస్పూను, ఎండు మిర్చి - మూడు, దంచిన వెల్లులి - ఐదు, పచ్చి కొబ్బరి - అర కప్పు, కొబ్బరి నూనె - టేబుల్ స్పూను, ఉప్పు - సరిపడా.
తయారు చేసే విధానం: పప్పులన్నీ గంట సేపు నానబెట్టాలి. తర్వాత కుక్కర్లో వేసి నీళ్ళు పోసి నాలుగు విజిల్స్ వచ్చే దాకా ఉడికించి దింపేసుకోండి. నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వెల్లులి వేసి వేపుకోవాలి. మునగాకు వేసి పసరు వాసన పోయే దాకా వేపుకోవాలి. మెత్తగా ఉడికిన పప్పు, ఉప్పు వేసి బాగా కలుపుకోండి. అవసరమైతే కొద్దిగా నీళ్ళు పోసుకోండి. చివరగా పచ్చికొబ్బరి, కొబ్బరి నూనె వేసి బాగా కలిపి ఒక నిమిషం ఉడికించి దింపేసుకోండి.